కట్టడి కఠినంగా..

ABN , First Publish Date - 2020-03-25T09:51:49+05:30 IST

కరోనా వైరస్‌ ప్రస్తుతం రెండో దశ నుంచి మూడో దశలోకి వ్యాపించే ప్రమాదం ఉండడంతో కేంద్రం అప్రమత్తత ప్రకటించింది.

కట్టడి కఠినంగా..

కరోనా వైరస్‌ ప్రస్తుతం రెండో దశ నుంచి మూడో దశలోకి వ్యాపించే ప్రమాదం ఉండడంతో కేంద్రం అప్రమత్తత ప్రకటించింది. ఎవరూ బయటకు రాకుండా సాధ్యమైనంతవరకు ఇంట్లోనే ఉండాలని ఆదేశించిది. తేలిగ్గా తీసుకుని రోడ్లపై సంచరిస్తే సమాజానికే ప్రమాదం తెచ్చిపెట్టే పరిస్థితి ఉండడంతో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీంతో ఈనెల 31 వరకు కొనసాగే లాక్‌డౌన్‌ సోమవారం అపహాస్యం పాలవడంతో పోలీసుశాఖ మంగళ వారం నుంచి డోస్‌ పెంచింది. కట్టడిని కఠినం చేసింది. సరదాగా ఆరు బయట తిరిగే వారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి 144 సెక్షన్‌ విధించింది. ప్రజలెవరూ రహదారు లపైకి రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు.


ఉదయం ఆరు నుంచి పది వరకు మాత్రమే నిత్యవసరాలు కొనుగోలుకు ప్రజలు బయటకు వచ్చేందుకు కలెక్టర్‌ అనుమతించగా, ఆ తర్వాత వచ్చేవారిని అరెస్ట్‌ చేయాలని ఎస్పీ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ఇందుకు 188 సెక్షన్‌ ప్రయోగించా లని సూచించారు. దీని ప్రకారం ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించేవారిపై కేసులు, జరిమానాలు కఠినంగా విధించనున్నారు. కాగా లాక్‌డౌన్‌తో ప్రజలు బయటకు రాకూడదనే నిషేధాజ్ఞలు అమలు తీరుపై కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ నయీం కలిసి మంగళవారం కాకినాడ నగరంలో స్వయంగా పర్యవేక్షించారు. జగన్నా థపురం, బాలాజీచెరువు జంక్షన్‌ తదితర చోట్ల చోట్ల పర్యటించి అటుగా వెళ్తున్న వాహనదారులను ఆపి ప్రశ్నించారు. తక్షణం ఇళ్లలోకి వెళ్లకపోతే అరెస్ట్‌, జరి మానా చేస్తామని హెచ్చరించారు. రాజమహేంద్రవరంలో అర్బన్‌ ఎస్పీ షిమోషి గోకవరం బస్టాండ్‌ నుంచి నడుకుకుంటూ వెళ్లి ప్రజలకు క్లాస్‌ పీకారు. బైకులు, కార్లు స్వాధీనం  చేసుకున్నారు. అమలాపురం, రామచంద్ర పురం, తుని, పిఠాపురం, పెద్దాపురం తదితర పట్టణాల్లోను పోలీసులు ఆంక్షలు విధించారు.


అలాగే జిల్లావ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై మంగళవారం నుంచి బారికేడ్లు అడ్డంగా ఉంచారు. కాకినాడలో ఆర్టీసీ బస్టాండ్‌ వద్దనున్న ఆర్వోబీ, రాజమహేంద్రవరంలో గోదావరి బ్రిడ్జిలను మూసివేశారు. అటు జిల్లా చుట్టూ ఇతర జిల్లాలతో అనుసంధానమైన రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆదేశాలతో పోలీసుశాఖ జిల్లాలో మరింత అప్ర మత్తమైంది. ఇంటిదాటి బయటకు రాకూడదని ఆదేశాలున్నా అతిక్రమించే వారిపై మంగళవారం నుంచి 188 సెక్షన్‌ ప్రయోగిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించే వారిపై ప్రయోగించే ఈ సెక్షన్‌ కింద జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 1500 కేసులు వాహనదారులపై నమోదు చేసింది. ఇందులో ఒక్క కాకినాడలోనే 500 కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఈ సెక్షన్‌ కింద రూ.7లక్షల జరిమానా వసూలు చేయగా, కాకినాడ పరిధిలోనే రూ.3.50 లక్షల అపరాధ రుసుం విధించారు. కరోనా కట్టడిలో భాగంగా బుధవారం నుంచి రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు మూత పడనుంది.


కొన్నిరోజులుగా సర్వీసుల్లో విమానయాన సంస్థలు కోత విధించడంతో రోజూ రాజమహేంద్రవరం నుంచి విశాఖ, రాజమహేంద్రవరం-హైదరాబాద్‌ సర్వీసులు అరకొరగా నడుస్తున్నాయి. అయితే బుధవారం నుంచి వీటిని కూడా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో ఎయిర్‌పోర్టు తాత్కాలికంగా మూతపడనుంది. కాగా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ మూతపడగా, రైళ్లు సైతం పూర్తిగా నిలిచిపోయాయి. కాగా ఆటోలు జిల్లావ్యాప్తంగా సోమవారం పూర్తిస్థాయిలో తిరగ్గా, మంగళవారం నిలిచిపోయాయి. పోలీసులు వీటిని అడ్డుకున్నారు. ఉదయం పదిలోపు మాత్రం ఆటోలో ఇద్దరి వరకు అనుమతిస్తున్నారు.


అవి మూతపడవా... జనం ఆందోళన బాట..

జిల్లావ్యాప్తంగా ఈనెల 31 వరకు అన్ని వ్యాపార సంస్థలు, మాల్స్‌ మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కానీ కొన్నిచోట్ల ఇవి దర్జాగా పనిచేస్తున్నాయి. రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరులో ఓ హార్లిక్స్‌ ఫ్యాక్టరీ 500 మంది కూలీలతో పనిచేస్తోంది. తమకు వైరస్‌ ముప్పు ఉందని, ఉత్పత్తి ఆపాలని ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా యాజమాన్యం పట్టించు కోవడం లేదు. అటు ఏడీబీ రోడ్డులో టైల్స్‌ ఉత్పత్తి పరిశ్రమలు యథావిధిగా నడుస్తున్నాయి. విధులకు రాకపోతే వేతనాల్లో కోత వేస్తామని హెచ్చరించడంతో బిక్కుబిక్కుమంటూ చిరుద్యోగులు విధులకు హాజరవుతున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం పరిధిలో ఆల్‌సమీ అనే జంతు వధశాల నిరాటంకంగా పనిచేస్తోంది. నిత్యం వందలాది జంతువులను వధిస్తూ మాంసం ఎగుమతి చేస్తోంది. ఇందులో 600 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు.

Read more