కరోనా కలవరం

ABN , First Publish Date - 2020-03-19T08:56:11+05:30 IST

కరోనా మహమ్మారి అంతకంతకూ విజృభిస్తుండడంతో సమాజంలో దాదాపు అన్ని వర్గాలు ప్రభావితం అవ ుతున్నాయి. గుంపులుగా ఉండేచోట వైరస్‌ వ్యాప్తి ఎక్కు వయ్యే ప్రమాదం ఉండడంతో రాష్ట్ర

కరోనా కలవరం

జిల్లావ్యాప్తంగా కరోనాపై అలెర్ట్‌

ఎట్టకేలకు సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం 

నేటి నుంచి స్కూళ్లు కాలేజీలు,  యూనివర్సిటీలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌

31వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లన్నీ మూత

ఆలయాల్లోనూ రద్దీకి నో.. కోర్టులకు సెలవులు

ఎక్కడికక్కడ రద్దవుతున్న సభలు, సమావేశాలు

సామూహిక సీమంతాలు నిలిపివేస్తూ ఆదేశాలు

కాకినాడ జీజీహెచ్‌ జనరల్‌ వార్డుల్లో సోడియం హైపో క్లోరైట్‌ స్ర్పేకు ఆదేశాలు

 జిల్లావ్యాప్తంగా 135 సినిమా థియేటర్ల మూత 

తిరుమల, విశాఖ, గరీబ్‌రథ్‌, న్యూఢిల్లీ,  గోదావరి, గౌతమీ రైళ్లలో రిజర్వేషన్లు ఖాళీ

 రాజమహేంద్రవరం నుంచి విశాఖ,  హైదరాబాద్‌ మార్గాల్లో ఖాళీగా విమానాలు

విదేశాల నుంచి వచ్చిన వారికి గృహ నిర్బంధం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ)

కరోనా మహమ్మారి అంతకంతకూ విజృభిస్తుండడంతో సమాజంలో దాదాపు అన్ని వర్గాలు ప్రభావితం అవ ుతున్నాయి. గుంపులుగా ఉండేచోట వైరస్‌ వ్యాప్తి ఎక్కు వయ్యే ప్రమాదం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పందించింది. అందులోభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ఆదేశించింది. దీంతో జిల్లాలో వందలాది ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు మూతపడనున్నాయి. యూనివర్సిటీలు, కోచింగ్‌ సెంటర్లకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని ప్రకటించింది.


జిల్లాలో 61 బీసీ సంక్షేమ వసతిగృహాలు, 88 ఎస్సీ, 102 ఎస్టీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వందలాది మంది విద్యార్థులు ఇందులో బస చేస్తున్నందున సులువుగా వైరస్‌ వ్యాప్తి జరిగే ప్రమాదం ఉండడంతో వీటిని కూడా మూసి వేయాలని అధికారులు నిర్ణయించారు. ఈనెల 31 వరకు వీటికి సెలవులు కొనసాగనున్నాయి. ఇక ఆలయాల్లో ఇప్పటికే భక్తులు రాక తగ్గిపోగా, వృద్ధులు, చిన్నపిల్లలు రావడం మానివేయాలని ప్రకటిస్తున్నారు. నిత్యం వేలాదిమంది రద్దీ ఉండే అన్నవరం, వాడపల్లి వెంకన్న ఆలయాల్లో నిత్య కైంకర్యాలు మాత్రమే జరిగేలా చర్యలు చేపడుతున్నారు.


అలాగే జిల్లాలో ముందుగా నిర్ణయించు కుని ఏర్పాటుచేసుకున్న సమావేశాలు, సభలు రద్దవుతు న్నాయి. అలాగే ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక సీమంతాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారు.  మరోవైపు కోర్టులకు కక్షిదారులు రాకుండా సెలవులు తీసుకున్నారు. అటు కాకినాడ జీజీహెచ్‌లో అధికారులు కరోనాపై అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఐసోలేషన్‌ వార్డును నిర్వహిస్తుండగా, తాజాగా 30కిపైగా ఉన్న ఆస్పత్రి జనరల్‌ వార్డులపై దృష్టి సారించారు.


ఇక్కడ పదుల సంఖ్యలో రోగులు ఒకేచోట రోజుల తరబడి ఉండాల్సిన పరిస్థితుల నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి జరగకుండా నిరంతరం వార్డుల్లో హైపోక్లోరైట్‌ స్ర్పే బుధవారం నుంచి ప్రారంభించారు. ఇది నిరంతరం కొన సాగనుంది. అలాగే రైల్వేస్టేషన్లు, బస్టాండుల్లో కూడా ఈ స్ర్పేను ముమ్మరం చేశారు. జిల్లాకు విదేశాల నుంచి వస్తున్న వారిలో అనుమానితులను జీజీహెచ్‌కు తరలి స్తున్నారు. కొందరిని వారి ఇళ్లలోనే గృహ నిర్బంధం చేస్తున్నారు. తేటగుంటలో ఒకరిని, కాకినాడ సర్పవరంలో ఇద్దరిని గృహ నిర్బంధంలో ఉంచారు.


నేటి నుంచి థియేటర్ల మూత..

కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్‌లు, విడుదలలు వాయిదా పడ్డాయి. అటు వైరస్‌ ప్రభావంతో థియేటర్లకు వచ్చే జనం కూడా బాగా తగ్గిపోయారు. దీంతో నష్టాలతో థియేటర్లు విలవిల్లాడుతున్నాయి. గడచిన కొన్నిరోజులుగా ప్రేక్షకులు లేకపోయినా, ఏదోలా భరించిన యాజ మాన్యాలు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని మూసి వేయాలని నిర్ణయించాయి. అందులో భాగంగా గురువారం నుంచి జిల్లావ్యాప్తంగా ఉన్న 135 సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. తిరిగి ఎప్పుడు తెరిచేది ఇప్పట్లో చెప్పలేమని యూనియన్‌ నేతలు పేర్కొన్నారు. 


రైళ్లు, బస్సులు, విమానాలు ఖాళీ...

విశాఖ నుంచి జిల్లా మీదుగా నిత్యం విజయవాడ, హైదరాబాద్‌, చెన్నై తదితర ప్రాంతాలకు పదుల సంఖ్యల్లో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో స్లీపర్‌ క్లాస్‌ నుంచి ఽథర్డ్‌ ఏసీ నుంచి సెకండ్‌ఏసీ వరకు టిక్కెట్‌ రిజర్వేషన్లు దాదాపు దొరకడం కష్టం. కానీ కరోనా హెచ్చ రికల నేపథ్యంలో ఈ రైళ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. విశాఖ నుంచి వచ్చే గోదావరి, విశాఖ, తిరుమల, గరీబ్‌ రథ్‌, డబుల్‌ డెక్కర్‌, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌, ఎల్‌టీటీ, ప్రశాంతి, హౌరా తదితర రైళ్లలో సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక్కో రైలులో స్లీపర్‌ క్లాస్‌ టిక్కెట్లు 100 నుంచి 120 వరకు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఏసీ రైలు టిక్కెట్లు అయితే 200 నుంచి 250 వరకు, తిరుపతి డబుల్‌ డెక్కర్‌లో అయితే 780 సీట్లు వరకు ఖాళీగా కనిపిస్తున్నాయి.


అటు రైలు బయలుదేరే ముందు క్యాన్సిలేషన్స్‌ కూడా అధికంగా ఉంటున్నాయి. కాగా కాకినాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరే గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో 20 రోజుల ముందు బుక్‌ చేసినా స్లీపర్‌, థర్డ్‌ ఏసీ టిక్కెట్లు దొరకవు. కానీ ప్రస్తుతం రానున్న కొన్నిరోజులకు ఈ రైల్లో స్లీపర్‌, థర్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ టిక్కెట్లు పదుల సంఖ్యలో ఖాళీగా కని పిస్తున్నాయి. మరోవైపు బస్సుల పరిస్థితీ అంతే. ఏసీ బస్సులు ఎక్కే నాథుడే కనిపించడం లేదు. రాజమహేంద్ర వరం నుంచి విశాఖ, హైదరాబాద్‌ వెళ్లే విమానాలు ఖాళీ సీట్లతో తిరుగుతున్నాయి.


ఫిలిప్పీన్స్‌ దేశంలో దుగ్గుపన్నా సిటీలో లైసమ్‌ నార్త్‌ వెస్ట్రన్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతున్న 86 మంది విద్యార్థులు మనీలా ఎయిర్‌పోర్టులో ఇరుక్కుపోయారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 35 మంది ఉండగా, రాజమహేంద్రవరం నగరానికి చెందిన ఎంబీబీఎస్‌ నాలుగవ సంవత్సరం చదువుతున్న వెలమ హరిత ప్రసన్నలక్ష్మి ఉన్నారు. ఆమెతో ‘ఆంధ్రజ్యోతి’ మాట్లాడింది..


ఆమె మాటల్లో..మమ్మల్ని తీసుకువెళ్లండి..మనీలా ఎయిర్‌పోర్టు నుంచి హరిత

‘‘ఎయిర్‌పోర్టులో 86 మంది చిక్కుకున్నాం. రెండ్రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. మా పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ నిద్రాహారాలు లేవు. పట్టించుకునేవారే లేరు. ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోమంటున్నారు. మనీలాలో బయట చూస్తే రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు కర్ఫ్యూ. బస్సు, కార్‌, రవాణా సౌకర్యాలన్నీ బంద్‌. దయచేసి భారత ప్రభుత్వం స్పందించాలి. మా ఆరోగ్య పరిస్థితిపై అనుమానం ఉంటే వైద్య పరీక్షలు  చేసిన తరువాతే స్వదేశానికి తీసుకువెళ్లండి.  త్వరగా స్వదేశానికి చేర్చండి.’’

Updated Date - 2020-03-19T08:56:11+05:30 IST