‘తూర్పు’ ఉక్కిరిబిక్కిరి.. 80 వేలు దాటేసిన కొవిడ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-09-17T15:22:04+05:30 IST

జిల్లాను కొవిడ్‌ మహమ్మారి వదలడం లేదు. అంతకంతకూ వేలాదిమందిని..

‘తూర్పు’ ఉక్కిరిబిక్కిరి.. 80 వేలు దాటేసిన కొవిడ్‌ కేసులు

వారం వ్యవధిలో పదివేలకుపైగా నమోదు

అడ్డూఅదుపు లేకుండా పాజిటివ్‌లు పరుగు

అన్ని మండలాల్లోనూ వైరస్‌ బాధితులు

రోజుకు వెయ్యి కేసులపైనే.. బెడ్లకు కటకట


తూర్పు గోదావరి(ఆంధ్రజ్యోతి): జిల్లాను కొవిడ్‌ మహమ్మారి వదలడం లేదు. అంతకంతకూ వేలాదిమందిని పట్టిపీడిస్తూనే ఉంది. ఏమాత్రం తగ్గకుండా కేసులు పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఇతర జిల్లాలతో పోల్చితే వైరస్‌ తీవ్రత పెరగడమే గాని తగ్గడం కనిపించడం లేదు. దీంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఇంట్లో ఉన్నా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్‌ ఎలా సోకిందో కూడా అంతుచిక్కక జనం బెంబేలెత్తుతున్నారు. కొవిడ్‌ మృతుల సంఖ్య సైతం భారీగానే పెరుగుతోంది. అటు కేసులు.. ఇటు మరణాలు తూర్పును ఊపిరిసలపనీయడం లేదు. తాజాగా బుధవారం నాటికి జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య 80 వేల మార్కు దాటేసింది. వారం వ్యవధిలో ఏకంగా పది వేలకుపైగా కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం 81,064 అయ్యాయి.


జిల్లాలో సెప్టెంబర్‌ 9 నాటికి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 71,085. అప్పటి నుంచి సరిగ్గా ఏడు రోజుల తర్వాత చూస్తే పాజిటివ్‌లు పదివేలకుపైగా పెరిగిపోయాయంటే వైరస్‌ వేగం జిల్లాలో ఏ స్థాయిలో ఉందో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు జిల్లావ్యాప్తంగా ప్రతి ఎనిమిది రోజులకు పది వేల పాజిటివ్‌లు నిర్ధారణ కాగా, ఈసారి ఏకంగా ఏడు రోజుల్లో పది వేల కేసులు పెరగడం అటు వైద్యవర్గాలు, ఇటు అధికారులను కలవర పెడుతోంది. ప్రతి రోజు వెయ్యికిపైగా కొత్త కేసులు వస్తుండడం, ఇందులో సగం మందిని హోం ఐసోలేషన్‌కు అనుమతించినా మిగిలిన వారి లో చాలామంది కొవిడ్‌ లక్షణాలతో సతమతమవుతున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి వారే అధికం. దీంతో వీరంతా ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రులకు వస్తున్నారు. అయితే ఏరోజుకారోజు భారీగా పెరుగుతున్న తాకిడితో పడకలు దొరకడం లేదు.


ఆక్సిజన్‌ బెడ్లు సకాలంలో అందుబాటులోకి రావడం లేదు. దీంతో మహమ్మారిని తట్టుకుని నిలబడడం ఎలాగో వైద్యవర్గాలకు అంతుచిక్కడం లేదు. బుధవారం జిల్లావ్యాప్తంగా 1,421 కేసులు నిర్ధారణ కాగా, వీటితో కలిపి కేసులు 80 వేలకు దాటాయి. దీంతో మున్ముందు ఇంకెన్ని పాజిటివ్‌లు చూడాల్సి వస్తుందోననే భయం సర్వత్రా నెలకొంది. ఇదిలాఉంటే జిల్లాలో మొత్తం పాజిటివ్‌ సోకిన వారిలో ప్రస్తుతం ఇంకా 12,036 మంది చికిత్స పొందుతుండగా, 68,561 మంది కోలుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 467కి చేరింది.Updated Date - 2020-09-17T15:22:04+05:30 IST