‘తూర్పు’న మరణ మృదంగం

ABN , First Publish Date - 2020-09-16T16:42:28+05:30 IST

జిల్లాలో నమోదవుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య గమనిస్తుంటే, అతి త్వరలో..

‘తూర్పు’న మరణ మృదంగం

పెరుగుతున్న కొవిడ్‌ మరణాలు

ఒక్క రోజే ఆరుగురి మృతి 

తాజాగా 1,423 కేసులు

మొత్తం బాధితులు 79,643 


కాకినాడ(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నమోదవుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య గమనిస్తుంటే, అతి త్వరలో జిల్లాలో లక్ష మంది దీని  బారిన పడేట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇదే క్రమంలో మరణాల రేటు పరిశీలిస్తే కొవిడ్‌తో చికిత్స పొందుతూ ప్రతీరోజూ నలుగురి నుంచి ఆరుగురు మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో  చికిత్స పొందుతూ మృతి ఆరుగురు మరణించారు. తాజాగా 1,423 కరోనా కేసులు నమోదుకాగా, సదరు బాధితుల సంఖ్య 79,643 చేరింది. యాక్టివ్‌ కేసులుగా 11,999 మంది నమోదయ్యారు. 67,180 మంది కోలుకున్నారు. మొత్తంగా 464 కొవిడ్‌ మరణాలు సంభవించాయి. ట్రూనాట్‌ ద్వారా 469, రాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌లతో చేసిన పరీక్షల్లో 954 మందికి కొత్తగా వైరస్‌ సోకినట్టు నిర్ధారణయ్యింది.


వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల్లో నిత్యం ఎవరో ఒకరు కొవిడ్‌ బారిన పడుతున్నారు. ఆయా శాఖల్లో సిబ్బంది కొందరు హోం క్వారంటైన్‌, మరికొందరు కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. ఇటీ వల ఒక సంక్షేమ శాఖకు చెందిన వసతి గృహాధికారి కొవిడ్‌ బారిన పడ్డారు. ఇదే సమయంలో ఆమె భర్తకు కూడా వైరస్‌ సోకింది. వీరిద్దరు కాకినాడలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. కానీ వీరి వైద్యానికి సదరు ఆస్పత్రి యాజమాన్యం వసూలు చేసిన ఫీజు అక్షరాలా పది లక్షల రూపాయలు.


ప్రాణం పోతే తిరిగిరాదని, బతికుంటే బలుసాకు తినైనా బతికేవచ్చని ఈ వసతిగృహాధికారి పెద్ద మొత్తం చెల్లించి బయటపడినట్టు తెలిసింది. ఇదే శాఖకు చెందిన ఓ మినిస్ర్టీరియల్‌ ఉద్యోగి కరోనాతో కాకినాడ రామరావుపేటలో ఓ ప్రైవేట్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వైద్యం అందిస్తామని, ఇందుకు ప్రాథమికంగా రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని బాధితుడి కుటుంబీలకు చెప్పినట్టు తెలిసింది. పైగా ప్రాణానికి గ్యారంటీ ఇవ్వమని చెప్పడంతో వారు ఆందోళనలో ఉన్నారని సమాచారం. 


అనాతవరం రేషన్‌ డీలర్‌ మృతి

ముమ్మిడివరం: ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామ రేషన్‌షాపు డీలర్‌ పెంటపాటి సాయివెంకట సుబ్రహ్మణ్య రామకృష్ణ (52) కరోనా బారినపడి మృతిచెందారు. ఈనెల 5వ తేదీన డీలర్‌ కరోనా బారినపడడంతో అమలాపురం కిమ్స్‌ కోవిడ్‌ సెంటర్‌లో చికిత్సకు చేరారు. సోమవారం రాత్రి మృతి చెందారు. డీలర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. డీలర్‌ మృతికి డీలర్ల సంఘ అధ్యక్షుడు గుద్దటి సుబ్బారావు, తహశీల్దార్‌ ఎస్‌ పోతురాజు, కార్యాలయ సిబ్బంది, డీలర్లు సంతాపం వ్యక్తంచేశారు. 


కొవిడ్‌తో మరొక వ్యక్తి మృతి 

అమలాపురం: కిమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొత్తపేట మండలం కండ్రిగ గ్రామానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి మంగళవారం మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

Updated Date - 2020-09-16T16:42:28+05:30 IST