పటిష్టంగా వైఎస్సార్‌ జలకళ పథకం అమలు: కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-29T17:26:46+05:30 IST

ఉచితంగా బోరు బావుల తవ్వకానికి సంబంధించిన వైఎస్‌ఆర్‌ జలకళ పథకాన్ని..

పటిష్టంగా వైఎస్సార్‌ జలకళ పథకం అమలు: కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి

కాకినాడ: ఉచితంగా బోరు బావుల తవ్వకానికి సంబంధించిన వైఎస్‌ఆర్‌ జలకళ పథకాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేసేందుకు ప్రణాళిక రచించినట్లు  కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు.   తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సోమవారం వైఎస్‌ఆర్‌ జలకళ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఎంపీలు వంగా గీత, చింతా అనూరాధ హాజరయ్యారు.


ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కాకినాడ సిటీ, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాలు మినహా మిగిలిన 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు బోరుబావుల రిగ్గుల వాహనాలను సమకూర్చినట్లు వెల్లడించారు. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోరుబావులు వేయడంతో పాటు మోటార్లను బిగించేందుకు ఏర్పాట్లు చేయనున్నామన్నారు. జలకళ పథకం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జేసీ జి.రాజకుమారి, డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు, ఈజీఎస్‌ సభ్యురాలు మరియమ్మగాంధీ పాల్గొన్నారు. 


సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 

 జేసీ రాజకుమారి మీడియాతో మాట్లాడుతూ జలకళ పఽథకం ద్వారా లబ్ధి పొందేందుకు రైతులు ఆన్‌లైన్‌లో కానీ, నేరుగా కానీ దరఖాస్తు చేసుకోవచ్చునని  తెలిపారు. వలంటీర్ల సహాయంతో గ్రామ సచివాలయాల్లోను దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.   


Updated Date - 2020-09-29T17:26:46+05:30 IST