తాగునీటి ఎద్దడి రాకుండా యాక్షన్ ప్లాన్
ABN , First Publish Date - 2020-04-05T10:40:26+05:30 IST
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యుఎస్) సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.

95 శాతం నింపిన మంచినీటి చెరువులు
ఈ నెల 10 నుంచి 50 రోజులపాటు క్లోజర్
ఈలోపు చెరువులకు నీళ్లు
తాగునీటి సరఫరాకు రూ. 9 కోట్ల కేటాయింపు
చేతి పంపుల మరమ్మతులకు నిధుల మంజూరు
కాకినాడ (ఆంధ్రజ్యోతి) : వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యుఎస్) సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే జిల్లాలో ఉన్న మంచినీటి చెరువుల్లో 95 శాతం మేర వాటిని నీటితో నింపింది. ఈనెల 10వ తేదీ నుంచి 50 రోజులపాటు కాలువలను కట్టేస్తున్నారు. దీంతో క్లోజర్ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఇంకా 5 శాతం చెరువులు నింపాల్సి ఉంది. వీటిని ఈ పది రోజుల్లో గోదావరి నీటితో నింపనున్నారు. అలాగే చేతి పంపుల మరమ్మతులకు ఎంపీడీవోలకు నిధులు మంజూరు చేశారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా జిల్లాకు రూ.9 కోట్ల నిధులు కేటాయించారు. వాస్తవానికి కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగుతోంది.
దీంతో తాగునీటి సరఫరాతో సంబంధం ఉన్న అన్ని శాఖల సిబ్బంది అందుబాటులో లేదు. ఈలోపు క్లోజర్ ప్రకటించారు. అయినప్పటికీ అన్ని మంచినీటి చెరు వులను నింపడమే లక్ష్యంగా పెట్టుకుని యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లాలో నాలుగు విలీన మండలాలతో కలిపి 49 కాంప్రహెన్సివ్ ప్రొటక్ట్ వాటర్ స్కీమ్ (సీపీడబ్ల్యుఎస్)లు, 2,107 రక్షిత మంచి నీటి సరఫరా పథకాలు అమల్లో ఉన్నాయి. వీటి ద్వారా 1656 గ్రామీణ ఆవాసాల్లో 22.20 లక్షల జనాభాకు వేసవిలో సమృద్ధిగా తాగునీటి పంపిణీకి చర్యలు చేపడుతున్నారు. ఏజెన్సీలో భగవాన్ శ్రీ సత్యసాయి బోర్డు ఆధ్వర్యంలో 212 ఆవాసాల్లో 2.62 లక్షల జనాభాకు 3 రక్షిత మంచినీటి పథకాలను ఏర్పాటు చేసింది. క్లోజర్ సమయానికి జిల్లాలో ఉన్న 41 చె రువులకుగాను సమస్యాత్మకంగా ఉన్న 7 చెరువులను ఆఽధునికీకరించి వాటిలో నీరు నింపడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ నీటి ఇబ్బంది తలెత్తకుండా మానటరింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ఈ శాఖ మండల ఏఈ, ఎంపీడీవో, తహశీల్దార్ సభ్యులుగా ఉంటారు. అలాగే ఎస్ఈ కార్యాలయంలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 12,202 చేతి పంపుల ద్వారా ప్రజలకు నీరు అందుతోంది. అయితే వీటిలో 685 పంపులు పాడయ్యాయి. వీటిని బాగు చేసి, పూర్తి స్థాయిలో ఆధునికీకరించడానికి ఎంపీడీవోలకు నిధులు కేటాయించారు.
ఏజెన్సీలో కొండ ప్రాంతాలు, విద్యుత్ సౌకర్యం లేనిచోట్ల సోలార్ పవర్ ద్వారా పంపులను ఏర్పాటు చేశారు. వీటితో గిరిజనులకు తాగునీటి సదుపాయం కల్పిస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాలకు నీరు అందడం లేదు. దీంతో తొలి విడతలో 14 పనులు చేపట్టారు. రాజమహేంద్రవరం, కాకినాడ నగరపాలక సంస్థలు, మునిసిపాల్టీల్లో ఇప్పటికే సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపారు. సామర్లకోటలో ఉన్న సాంబ మూర్తి రిజర్వాయర్, వాటర్ స్టోరేజ్ ట్యాంకులు, కరప మండలం అరట్లకట్టలో ఉన్న రిజర్వాయర్లో సమృద్ధిగా నీటి నిల్వలు ఉంచారు. ఈ సీజన్లో రెండు పూటలా కుళాయిల ద్వారా నీటిని విడుదల చేయడం కోసం వంతుల వారీ పంపిణీ చేస్తారని తెలుస్తోంది. వేసవిలో తాగు నీటి ఎద్దడి లేకుండా చూస్తామని ఆర్డబ్ల్యుఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ తాళ్లూరి గాయత్రిదేవి చెప్పారు.