బాధితులకు అండగా ఉండండి

ABN , First Publish Date - 2020-11-26T06:16:25+05:30 IST

‘ప్రజలకు వరద సాయం లేదు. చేసినా పైపై మెరుగులతో మమ అనిపిస్తున్నారు. మరోవైపు రైతులకు మద్దతు ధర లేదు. గిట్టుబాటు ధర లేక వారు అప్పులపాలవుతున్నారు.

బాధితులకు అండగా ఉండండి

  వైసీపీ పాలనలో అన్ని చెడ్డ పనులే

  మన హయాంలో పనులను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు

 కాకినాడ పార్లమెంటరీ నేతలతో చంద్రబాబు సమీక్ష

కాకినాడ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజలకు వరద సాయం లేదు. చేసినా పైపై మెరుగులతో మమ అనిపిస్తున్నారు. మరోవైపు రైతులకు మద్దతు ధర లేదు. గిట్టుబాటు ధర లేక వారు అప్పులపాలవుతున్నారు. పత్రికల్లో చూశా. మీ జిల్లాలోని తాళ్లరేవు మండలంలో ఒక రైతు పంటకు నిప్పు పెట్టడాన్ని. అయినా పాలకుల్లో చలనం లేదు. వైసీపీ చేస్తున్న పనులన్నీ చెడ్డవే, మన హయాంలో చేసిన పనులతో ప్రజలు బేరీజు వేసుకునే పరిస్థితి వచ్చింది’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడ నుంచి బుధవారం ఆయన జూమ్‌ యాప్‌ ద్వారా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ మండల శాఖల బాధ్యులతో సమీక్షించారు. వైసీపీ ఆగడాల బాధితులకు టీడీపీ కార్యకర్తలు అండగా ఉండాలని, భవిష్యత్తుపై వారికి భరోసా కల్పించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వేసిన సీసీ రోడ్లు, కట్టిన భవనాలే తప్ప ఏడాదిన్నరలో ఎక్కడా కొత్తవి నిర్మించలేదన్నారు. మన హయాంలో కట్టిన భవనాలు, ట్యాంకులకు వారి పార్టీ రంగులు వేసుకుని ప్రజల్లో వైసీపీ అభాసుపాలయ్యిందన్నారు. ఏపీకి టీడీపీ తెచ్చిన మంచి పేరును వైసీపీ బుగ్గిపాలు చేస్తోందని విమర్శించారు. మన పార్టీపై అదే పనిగా బురద జల్లడమే బ్లూ మీడియా పని పెట్టుకుందని, కొందరు పేటీఎం బ్యాచ్‌గా ఏర్పడి ప్రతిపక్షంపై దుమ్మెత్తి పోస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షమని, వీటిపై అణచివేత ధోరణిని ప్రజలు సహించరనే వాస్తవ సత్యాన్ని వైసీపీ నేతలు గుర్తించాలన్నారు. రైతులు, పేదలు, మహిళలు కంట నీరు పెడితే రాష్ట్రానికి శ్రేయస్కరం కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చేసిన దాడులు, దౌర్జన్యాలను ప్రజలు మరచిపోలేదన్నారు. బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేసి, మళ్లీ ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-11-26T06:16:25+05:30 IST