-
-
Home » Andhra Pradesh » East Godavari » Carona cases in East Godavari District
-
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కన్నెర్ర .. ఒక్కరోజులోనే ఏకంగా..
ABN , First Publish Date - 2020-06-22T18:21:13+05:30 IST
కరోనా వైరస్ కన్నెర్ర చేసింది. జిల్లాలో బాధితుల సంఖ్య సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జనాలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఆదివారం 74 కొత్త కేసులు బయట పడ్డాయి.

ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కొవిడ్-19
ఆదివారం ఒక్కరోజు 74 మందికి పాజిటివ్ నిర్ధారణ
అత్యధికంగా రాజమహేంద్రవరంలో 22, మిగతా ప్రాంతాల్లో 52
జిల్లాలో 801కి చేరిన బాధితుల సంఖ్య
అమలాపురం, కాకినాడల్లో ఇద్దరు మృతితో
పదికి చేరిన మరణాలు
(కాకినాడ-రాజమహేంద్రవరం, ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ కన్నెర్ర చేసింది. జిల్లాలో బాధితుల సంఖ్య సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జనాలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఆదివారం 74 కొత్త కేసులు బయట పడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 801కు చేరుకుంది. అమలాపురం, కాకినాడల్లో ఇద్దరు వైరస్‌తో మృతి చెందడంతో కొవిడ్-19తో మృతి చెందిన వారి సంఖ్య పదికి పెరిగింది. అత్యధికంగా రాజమహేంద్రవరం నగరంలో 22 కేసులు నమోదయ్యాయి. రాయవరం మండలం చెల్లూరు-14, మండపేట-9, పెద్దాపురం మండలం జి.రాగంపేట-7, కాకినాడ నగరం-5, ఉప్పలగుప్తం మండలం-4, పి.గన్నవరం మండలం పోతవరం-4, కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం, తిమ్మాపురం-3, అమలాపురం పట్టణం-2, రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడింగొయ్యి-1, అమలాపురం రూరల్-1, ముమ్మిడివరం-1, సామర్లకోట-1 కేసులు నమోదయ్యాయి.
రాజమహేంద్రవరంలో కరోనా కలకలం రేపుతోంది. మొదటో ఢిల్లీ కనెక్షన్ వారే ఉండేవారు. ఇవాళ కిరాణా, చేపల వ్యాపారులు, చెరకు రసం, జ్యూస్ అమ్మేవారు కూడా ఉండ డం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో ఆదివారం ఎనిమిది మందికి పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారించారు. ఆంధ్రానగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పాజిటివ్ వచ్చింది. వీరు కిరాణా వ్యాపారం చేస్తుంటారు. ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్ గా ఉన్న వీఎల్ పురంలో మరో రెండు కేసులు ఉన్నాయి. వీరు చెరకు రసం విక్రయిస్తారు. మంగళవారపుపేట, శ్రీరామనగర్‌ల్లో ఒక్కొక్కరికి వచ్చింది. ఇటీవల ధవళేశ్వరంలో పాజిటివ్ కేసు వ్యక్తితో సంబంధం కారణంగా వీరికి వైరస్ సోకింది. ప్రస్తుతం 25మంది పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారని, ఇప్పటిదాకా నగరంలో 66 పాజిటివ్ కేసులు నమోద య్యాయని ఎంహెచ్‌వో వినూత్న తెలిపారు.
మధురపూడి విమానాశ్రయంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన నలుగురికి పాజిటివ్ వచ్చింది. రెండు రోజుల క్రితం ఒకరు జ్వరంతో రాగా ఆయనకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఆదివారం మరో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. దీంతో విమాన ప్రయాణికులు తగ్గిపోతున్నారు.
రాయవరం: చెల్లూరులో మరో 13 మంది కొవిడ్-19 బారిన పడ్డారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 85కు చేరుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో కరోనా సోకిన వ్యక్తులను హోం క్వారంటైన్‌లోనే ఉంచి వైద్య సేవలు అంద జేస్తున్నారు. ఇదే కేసుల పెరుగుదలకు కారణమవుతోందని గ్రామస్తులు చెప్తున్నారు. సూర్యారావుపేటలో మత్స్యకార సామాజిక వర్గీయులు అధికం. వారి ఇళ్లు ఇరుకు కావడంతో కరోనా సోకిన వ్యక్తి నుంచి అతడి కుటుంబ సభ్యులకు కరోనా సోకి ఉండవ చ్చుంటున్నారు.
పెద్దాపురం: మండలంలోని జి.రాగంపేటలో ఏడు పాజిటివ్ కేసులు నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 18న సామర్లకోట లిక్కర్ డిపోలో హమాలీగా పనిచేస్తున్న 40ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ సోకిన విషయం తెలిసిందే. అతనితో ప్రైమరీ కాంటాక్టు కలిగిన 45 మందికి శ్వాబ్ పరీక్ష చేయగా ఏడుగురికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. వీరిలో ఒక మహిళతో పాటు నలుగురు వ్యక్తులు, 12 ఏళ్లు, 14 ఏళ్లు వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారిని బొమ్మూరు లోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించనున్నట్టు అధికారులు తెలిపారు.
సామర్లకోట: పట్టణంలోని భాస్కర్ కాలనీకి చెందిన 30 సంవత్సరాల వయసు గల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇతడు లిక్కర్ డిపోలో హమాలీగా పని చేస్తున్నట్టు సమాచారం.
మండపేట: పట్టణంలోని 29వ వార్డులో తొమ్మిది మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అందులో ఏడుగురు సచివాలయంలో పనిచేసే మహిళా వలంటీరు కుటుంబానికి చెందిన వారు కాగా మరొకరు బయటి వ్యక్తి. ఇంకొకరు సంఘం కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. వారందరినీ బొమ్మూరులోని క్వారంటైన్‌కు తరలించారు. అత్యధిక కేసులు నమోదు కావడంతో 29వ వార్డును కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు.
అమలాపురం టౌన్: పట్టణంలోని టీటీడీసీ క్వారంటైన్ సెంటర్లో వున్న నలుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్టు మునిసిపల్ కమిషనర్ కేవీఆర్‌ఆర్ రాజు తెలిపారు. ఇటీవల ముంబై నుంచి వచ్చిన వ్యక్తులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. వారిలో వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ముమ్మిడివరం మండలం కొండాలమ్మ చింతకు చెందిన 40ఏళ్ల వ్యక్తి ఇటీవల రష్యా నుంచి వచ్చాడు. ఇంటికి వెళ్లకుండా అమలాపురంలో హోం క్వారంటైన్‌లో ఉన్న ఆయనకు పరీక్షల అనంతరం పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వెత్సావారి అగ్రహారానికి చెందిన 45ఏళ్ల ఉద్యోగికి పాజిటివ్ వచ్చింది. ఆర్‌అండ్‌బీ కార్యాల యంలో పనిచేస్తున్న సదరు ఉద్యోగి బంధువుతో కలిసి ఈ నెల 17న అమలాపురం ఏరియా ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు.
ఆర్‌అండ్‌బీ ఉద్యోగికి పాజిటివ్ రాగా అతని బంధువుకు నెగిటివ్ వచ్చింది. ఆ ఉద్యోగికి ఎవరి ద్వారా కరోనా సంక్రమించిందన్న అంశంపై అధికారులు, వైద్య సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నారు. సదరు ఉద్యోగి ఎక్కడికీ వెళ్లలేదని, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా పాజిటివ్ బాధితులందరినీ కిమ్స్ కొవిడ్-19 ఆసుపత్రికి తరలించారు.
ఉప్పలగుప్తం: ఎస్.యానాంలో కెయిర్న్ అంబులెన్స్ డ్రైవర్‌కు పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అతని భార్య, ఇద్దరు పిల్లలకు కూడా పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు ధ్రువీకరించారు.
కోనసీమలో తొలి మరణం
అమలాపురం: కోనసీమలో కరోనా తొలి మరణం సంభవించింది. 55 ఏళ్ల ఎన్టీపీసీ ఉద్యోగి తీవ్రమైన కొవిడ్ లక్షణాలతో శనివారం రాత్రి అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు అందరూ ఉన్నా ఆయన భౌతికకాయానికి మునిసిపల్ సిబ్బంది పట్టణంలోని శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ ఎన్టీపీసీలో పనిచేస్తున్న ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లికి చెందిన ఓ వ్యక్తి రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి అమలాపురం వచ్చాడు. వారంతా ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలోని ఒక లాడ్జీలో బస చేశారు. అతనికి వైరస్ తీవ్రత ఎక్కువై అస్వస్థతకు గురై ఇబ్బందిపడుతున్న తరుణంలో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు కిమ్స్‌కు తరలించే సమయంలో మధ్యలోనే మరణించినట్టు ఆర్డీవో బీహెచ్ భవానీశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం మరణించిన వ్యక్తికి ట్రూనాట్ పరీక్ష చేయగా కొవిడ్-19 నిర్థారణ అయిందని, దీంతో కుటుంబ సభ్యులకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించి వారిని కిమ్స్ కొవిడ్ ఆసుపత్రికి తరలించినట్టు ఆర్డీవో చెప్పారు.
మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. రెండు రోజుల పాటు లాడ్జీలో బస చేసిన వ్యక్తికి ఆహారం సరఫరా చేసిన బంధువులను గుర్తించి వారి నుంచి కూడా శాంపిల్స్ తీసుకున్నారు. అటు రోగి బసచేసిన ఆర్టీసీ కాంపెక్లు ఎదుట, మృతదేహాన్ని ఉంచిన ప్రభుత్వాసుపత్రి వద్ద వాణిజ్య సముదాయాలన్నీ మూసివేశారు. ఉన్నత కుటుంబానికి చెందిన సదరు వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ పీఎంపీతో చికిత్స చేయించారు. దీంతో పరిస్థితి విషమించి మరణించి చాడని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ మరణంతో కోనసీమవాసుల్లో ఆందోళన పెరిగిపోయింది.