కరోనా వ్యాప్తి తగ్గుతోంది!

ABN , First Publish Date - 2020-12-01T07:09:59+05:30 IST

కొంతకాలం కిందట రోజుకు సగటున జిల్లాలో 600 నుంచి 1200 కేసులు నమోదవుతూ వచ్చాయి.

కరోనా వ్యాప్తి తగ్గుతోంది!

జిల్లాలో ఆశాజనకమైన ఫలితాలు 

నవంబరులో బాగా తగ్గిన కొవిడ్‌ కేసులు

ఊపిరిపీల్చుకున్న అధికార యంత్రాంగం 

యాక్టివ్‌ కేసులు బాగా తగ్గుముఖం

మరణాలూ గణనీయంగా తగ్గుదల 


జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.  పాజిటివ్‌ల నమోదు గత రెండు  నెలల నుంచి బాగా తగ్గుముఖం పడుతున్నట్టు ప్రభుత్వం వెల్లడిస్తున్న ఫలితాల బట్టి    స్పష్టమవుతోంది. అయితే కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ విస్తృతమయ్యే అవకాశాలుంటాయని ఇటీవల వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. కానీ గడిచిన 20 రోజుల నుంచి పాజిటివ్‌ కేసులు జిల్లాలో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన రెండ్రోజుల వ్యవధిలో   వరుసగా 40-45 కేసులు మాత్రమే నమోదయ్యాయి.  ఇక మరణాలు కూడా నమోదు కాకపోవడం నిజంగా శుభపరిణామమే. జనం మరింత అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశమూ ఉంది.


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

 కొంతకాలం కిందట రోజుకు సగటున జిల్లాలో 600 నుంచి 1200 కేసులు నమోదవుతూ వచ్చాయి. దీంతో జిల్లా అధికారులు, వైద్యాధికారులు చాలా ఆందోళన చెందారు. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రాష్ట్రంలో అత్యధిక కేసులు మన జిల్లాలోనే నమోదుకావడం సంచలనం కూడా అయ్యింది. దానికి తగ్గట్టుగానే మరణాల సంఖ్య ఉండడంతో  మరింత ఆందోళనను పెంచింది. జిల్లావ్యాప్తంగా పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందడంతో కేసులను అరికట్టగలమా లేదా అనే ఆందోళన కూడా అధికారుల్లో వ్యక్తమైంది. ఒక దశలో కరోనా కేసులతో ప్రభుత్వ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లతోపాటు హోం ఐసోలేషన్‌లలో ఉన్న వారి సంఖ్య 40 వేలకు పైబడి ఉండడంతో జిల్లా అధికారులు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా కొవిడ్‌ నియంత్రణకు చికిత్పకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆగస్టు, సెప్టెంబరు నెలల వరకూ కేసులు పెరగడం, తగ్గడం కనిపించింది. ఈ రెండు నెలల్లో జిల్లాలో ఒక్కోచోట బాధితులు పెరగడం, చాలాచోట్ల తగ్గడం కనిపించడంతో అధికారుల్లో కొంత ఊరట చెందారు. ఇదే సమయంలో ప్రజలు కూడా మాస్క్‌ ధరించడం, శానిటైజర్‌ వినియోగించడం రోజువారీ జీవనంలో భాగంగా చేసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలకు అనుమతించినా అత్యవసరం అయితేనే జనం ప్రయాణాలకు సిద్ధపడుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర వేడుకలపై కొవిడ్‌ ఆంక్షలు కొనసాగుతు న్నా జనం కూడా తప్పనిసరి అయితేనే వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇలా కొవిడ్‌ వ్యాప్తి కొంత తగ్గడం, అదే సమయంలో ప్రజలు కాస్త అవగాహనతో మెలగడం కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడానికి ఒక కారణంగా విశ్లేషిస్తున్నారు. అయితే సెకండ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ప్రజలు వ్య వహరిస్తేనే పూర్తిగా కొవిడ్‌ను అదుపులో ఉంచగలమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి తగ్గింద నే చెప్పాలి. అక్టోబరు 29న 414 కేసులు నమోదు కాగా, నవంబరు 29న 40 కేసులు నమోదు కావడమే నిదర్శనం.

కొవిడ్‌ టెస్టుల సంగతేంటి.. 

జిల్లాలో కరోనా ప్రబలిన నాటి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ట్రూనాట్‌,రాపిడ్‌ కిట్‌ల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొవిడ్‌ వైరస్‌ సోకినవారికి, అనుమానితులకు 12,72,000 నిర్ధారణ పరీక్షలు జరిగాయని సమాచారం. వీరిలో 636 మంది కరోనాతో మృతి చెందారు. మిగిలినవారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, హోంఐసోలేషన్‌లో చికిత్స పొందారు. ఇక రోజు వారీ పరీక్షల సంఖ్య తగ్గుతోంది. నవంబరు 23న జిల్లాలో 2,678 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా 104 మందికి వైరస్‌ నిర్ధారణయ్యింది. 24న 2,313  మందికి పరీక్ష చేయగా 116, 26న పరీక్ష చేసిన 1876 మందిలో 117, 29న 1012 మందికి పరీక్ష చేయగా 40, 30న చేసిన 1200 పరీక్షల్లో 45 మందికి కొవిడ్‌ ఉంది.


Updated Date - 2020-12-01T07:09:59+05:30 IST