కాలువలనూ కమ్మేశారు

ABN , First Publish Date - 2020-11-21T06:20:31+05:30 IST

జిల్లాలో గోదావరి ప్రధాన కాలువలపై ఆక్రమణలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఎక్కడికక్కడ అనేక మంది ప్రధాన కాలువ గట్లపై ఇష్టానుసారం నిర్మాణాలు చేసేశారు.

కాలువలనూ కమ్మేశారు
అనపర్తిలో గోదావరి కాలువపై గుర్తించిన ఆక్రమణలివే

  • జిల్లాలో అడ్డూఅదుపూ లేకుండా గోదావరి కాలువల ఆక్రమణ
  • తూర్పు, మధ్య డెల్టా పరిధిలో 9,500 చోట్ల కబ్జాలు గుర్తింపు
  • అధికంగా ఆత్రేయపురం పరిధిలో కాలువలపై 800 ఆక్రమణలు
  • ఎక్కడికక్కడ అనధికారికంగా షెడ్లు, వాణిజ్య దుకాణాలు, హోటళ్లు, ఇళ్ల నిర్మాణం
  • డ్రోన్ల ద్వారా వీటన్నింటినీ గుర్తించిన నీటిపారుదల శాఖ 
  • పోలీసుల సహాయంతో  కూల్చివేసేందుకు సిద్ధమవుతున్న రెవెన్యూ, ఇరిగేషన, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు


జిల్లాలో గోదావరి ప్రధాన కాలువలపై ఆక్రమణలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఎక్కడికక్కడ అనేక మంది ప్రధాన కాలువ గట్లపై ఇష్టానుసారం నిర్మాణాలు చేసేశారు. కొన్నిచోట్ల నేతల ప్రోద్బలంతో షెడ్లు, ఇళ్లు, వాణిజ్య దుకాణాలు, హోటళ్లు ఒకటేమిటి ఎన్ని  రకాలుగా కబ్జాలు చేయాలో అన్ని రకాలుగానూ కాలువలను కమ్మేశారు. దీంతో గోదావరి కాలువల నీటి ప్రవాహానికి ఎన్నో చిక్కులు. కబ్జాలతో ఇవి కుచించుకుపోయి.. మరికొన్నిచోట్ల పూడుకుపోయి శివారు ప్రాంతాలకు సాగునీరందని  పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆక్రమణలపై సర్వే ద్వారా నిగ్గుతేల్చిన నీటిపారుదల శాఖ కాలువల విభాగం అధికారులు కళ్లు తేలేశారు. తూర్పు, మధ్య డెల్టా పరిధిలో ఏకంగా 9,500 కబ్జాలున్నట్టు నిర్ధారించారు. త్వరలో వీటన్నింటినీ కూల్చివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.


(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గోదావరి ప్రధాన కాలువలు తూర్పు, మధ్య డెల్టాల పరిధిలో 2,400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. మధ్య డెల్టా కింద కోనసీమ, తూర్పు డెల్టా కింద ధవళేశ్వరం నుంచి కాకినాడ వరకు కాలువల్లో గోదావరి నీరు ప్రవహిస్తోంది. ఈ రెండు డెల్టాల పరిధిలో ప్రవహించే కాలువల ఆధారంగా నాలుగు లక్షల హెక్టార్ల వరకు పంటలు సాగవుతున్నాయి. అయితే ఇంతటి కీలక కాలువలు భారీ స్థాయిలో ఆక్రమణలకు గురయ్యాయి. ఎక్కడికక్కడ నీరు సజావుగా పారే అవకాశం లేకుండా గట్లు బలహీనపడేలా కబ్జాలు పెరిగిపోయాయి. దీంతో కాలువల్లోకి నీరు వదిలినప్పుడు, వరద నీరు విడిచిపెట్టినప్పుడు బలహీన కాలువలు గట్లు తెగి అనేక ప్రాంతాలను నీళ్లు ముంచెత్తుతున్నాయి. అటు కబ్జాల కారణంగా కాలువల్లో నీరు శివారు ప్రాంతాల్లో సాగుకు అందడం లేదు. ఎన్నో ఏళ్ల నుంచీ ఇదే తీరు. అయితే వీటిని ఇకపై ఊపేక్షించకూడదని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా తూర్పు, మధ్య డెల్టాల పరిధిలోని కాలువలపై గడచిన కొన్ని నెలలుగా డ్రోన్ల ద్వారా సర్వే చేపట్టింది. ఏయే కాలువలపై ఎక్కడెక్కడ ఎలాంటి ఆక్రమణలున్నాయనేదానిపై అధ్యయనం చేసింది. అందులో భాగంగా కోనసీమలోని వచ్చే మధ్య డెల్టా పరిధిలోని అమలాపురం, రామచంద్రపురం కెనాల్‌ డివిజన్లలో 4,800 కబ్జాలున్నట్టు గుర్తించారు. అటు ధవళేశ్వరం నుంచి సామర్లకోట, బిక్కవోలు, కాకినాడ వరకు తూర్పు డెల్టా పరిధిలో 4,700 గుర్తించారు. అత్యధికంగా ఆత్రేయపురం పరిధిలో కాలువపై 800చోట్ల కబ్జాలున్నాయని తేల్చారు. ముఖ్యంగా గోదావరి కాలువలపై రావులపాలెం, కోటిపల్లి, కాకినాడ, బిక్కవోలు, సామర్లకోట, ద్వారపూడి, అనపర్తి, ధవళేశ్వరం తదితర ప్రాంతాల్లో కబ్జాలు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. 


ఆయా కాలువలపై పశువులను కట్టే పేరుతో శాశ్వత షెడ్లు నిర్మించడం దగ్గర నుంచి వాణిజ్య దుకాణాలు,సెలూన్లు, కిళ్లీ బడ్డీలు, చికెన్‌ దుకాణాలు, ఫొటో స్టూడియోలు, బైక్‌ మెకానిక్‌ షాపులు, పూరిళ్లు, పెంకుటిళ్లు, చిన్నపాటి శ్లాబులతో ఇళ్ల నిర్మాణాలు కూడా చేసేశారు. పూర్తిగా సొంత స్థలం తరహాలో గోడలు నిర్మించారు. విద్యుత్‌ కనెక్షన్లు కూడా యథేచ్చగా వాడుతున్నారు. ఈ ఆక్రమణల వెనుక కొందరు స్థానికంగా రాజకీయంగా పలుకుబడి ఉన్న నేతలు కూడా ఉన్నారు.  కొందరితై అధిక ఆక్రమణలతో పదుల సంఖ్యలో కాలువలపై దుకాణాలను నిర్మించి ఏకంగా అద్దెకు ఇస్తూ లక్షల్లో గడిస్తున్నారు. అయితే ఇలా ఇష్టానుసారం కబ్జాలతో ఆయా ప్రాంతాల్లోని గోదావరి కాలువల్లో మట్టి కింద దిగి అనేక చోట్ల పూడుకుపోయి బలహీనంగా మారిపోయాయని కాలువల విభాగం ఇంజనీర్లు విశ్లేషించారు. ఈమేరకు మొత్తం ఆక్రమణలతో కూడిన నివేదికను తయారు చేశారు. డ్రోన్ల సాయంతో గుర్తించిన కబ్జా ప్రాంతాల వీడియోలు, ఫొటోలను అందులో పొందుపరిచారు. వీటిని కొనసాగిస్తే మున్ముందు కాలువలు పూర్తిగా కుప్పకూలే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని నివేదికలో ప్రస్తావించారు. ఈ మొత్తం ఆక్రమణలపై ఇటీవల కలెక్టర్‌ సైతం సమీక్షించారు. వీటన్నిటినీ కూల్చేయాలని నిర్ణయానికి వచ్చారు. దీనికి ప్రభుత్వం నుంచి కూడా ఆమోదముద్ర లభించింది. ఈ నేపథ్యంలో త్వరలో ఆయా కాలువలపై ఉన్న ఆక్రమణలను స్థానిక రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్‌ శాఖల అధికారుల బృందం కూల్చివేత పనులు ప్రారంభించనుంది. పరిస్థితులను బట్టి పోలీసుల సాయంతో కూల్చివేతలు కొనసాగించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆక్రమణదారులకు సమాచారం కూడా అందించారు. కూల్చివేతలు తప్పవని వివరించారు. మరోపక్క ఆక్రమణలకు ఎవరు అడ్డుపడినా కూల్చివేతలను ఆపకూడదనే నిర్ణయానికి కూడా వచ్చారు.

Updated Date - 2020-11-21T06:20:31+05:30 IST