విదేశాలనుంచి వచ్చారా..?

ABN , First Publish Date - 2020-03-21T09:12:55+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావం విదేశాలనుంచి వచ్చినవారిపై అధికంగా ఉంది. ఇతర దేశాల నుంచి ఎవరైనా వస్తే వారికి అన్ని పరీక్షలు జరిగినా కరోనా

విదేశాలనుంచి వచ్చారా..?

కరోనా అనుమానంతో స్థానికుల హడావుడి

ఉరుకుల పరుగులు తీసిన అధికారులు


ముమ్మిడివరం, మార్చి 20: 

కరోనా వైరస్‌ ప్రభావం విదేశాలనుంచి వచ్చినవారిపై అధికంగా ఉంది. ఇతర దేశాల నుంచి ఎవరైనా వస్తే వారికి అన్ని పరీక్షలు జరిగినా కరోనా వైరస్‌ ఉంటుందనే పుకార్లతో అలజడులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వివాహ, ఇతర వేడుకలకు విదేశాల నుంచి వచ్చినవారు హాజరవడంతో ఈ పుకార్లకు బలం చేకూరుతోంది. దీంతో రెవెన్యూ, పోలీసు, వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది అక్కడకు పరుగులు తీస్తున్నారు. ముమ్మిడివరం మూలతూమువద్ద శుక్రవారం జరిగిన వివాహ వేడుకల్లో ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. అనాతవరానికి చెందిన పెళ్లికుమార్తె, సీహెచ్‌.గున్నేపల్లికి చెందిన పెళ్లికుమారుడి పెళ్లివేడుక మూలతూము వద్దనున్న చర్చిలో జరిగింది. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె వైపునుంచి వచ్చిన బంధువుల్లో గల్ఫ్‌ దేశం నుంచి కొంతమంది వచ్చారు.


వీరివల్ల కరోనా వైరస్‌ ప్రబలే అవకాశం ఉందని ప్రచారం చేయడంతో వైద్య, ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమై అక్కడకు వెళ్లారు. వారంతా గల్ఫ్‌ నుంచి 15రోజుల క్రితమే వచ్చారని, అన్ని ఆరోగ్య పరీక్షలు జరిగాయని, కరోనా లేదని నిర్ధారణ కావడంతో అధికారులు వెనుతిరిగారు. వివాహ వేడుక వద్ద ఎక్కువమంది గుమిగూడి ఉండవద్దని, త్వరగా వేడుకను ముగించుకుని వెళ్లాలని కరోనా వైరస్‌పై వారికి అవగాహన కల్పించారు. ముమ్మిడివరం రాంజీనగర్‌లో మాగాం హేచరీలో పనిచేయడానికి నలుగురు వియత్నాం దేశస్తులు వచ్చి అద్దెకు ఉంటున్నారు. వీరినుంచి స్థానికులు కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తం చేయడంతో వైద్యఆరోగ్య సిబ్బంది అక్కడకు వెళ్లి వారి వివరాలు సేకరించగా వీరంతా గత ఫిబ్రవరి నుంచే ఉంటున్నారని తేలింది.

Updated Date - 2020-03-21T09:12:55+05:30 IST