ఆంగ్లేయులకు భారతీయ చరిత్ర తెలియదు

ABN , First Publish Date - 2020-11-19T06:01:07+05:30 IST

భారతీయులకు ఒక చరిత్ర అంటూ ఏమీ లేదని ఆంగ్లేయులు అభిప్రాయపడేవారని, వాస్తవానికి మన చరిత్ర గురించి వారికేమీ తెలియదని జిల్లా చరిత్ర, సంస్కృతి సామాజిక విషయాల అధ్యయన సంస్థ కార్యదర్శి డాక్టర్‌ పి.చిరంజీవినికుమారి అన్నారు.

ఆంగ్లేయులకు భారతీయ చరిత్ర  తెలియదు
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న చిరంజీవినికుమారి, తదితరులు

  పుస్తకావిష్కరణ సభలో డాక్టర్‌ పి.చిరంజీవిని కుమారి

కాకినాడ,నవంబరు18 (ఆంధ్రజ్యోతి): భారతీయులకు ఒక చరిత్ర అంటూ ఏమీ లేదని ఆంగ్లేయులు అభిప్రాయపడేవారని, వాస్తవానికి మన చరిత్ర గురించి వారికేమీ తెలియదని జిల్లా చరిత్ర, సంస్కృతి సామాజిక విషయాల అధ్యయన సంస్థ కార్యదర్శి డాక్టర్‌ పి.చిరంజీవినికుమారి అన్నారు. కాకినాడ విద్యుత్‌ నగర్‌లో ఉన్న ఐడియల్‌ కళాశాలలో ప్రముఖ కవి, చరిత్రకారుడు బొల్లోజుబాబా రచించిన ‘మెకంజీ కైఫియ్యతులు- తూర్పుగోదావరి జిల్లా ’ పుస్తకావిష్కరణ సభలో ఆమె  మాట్లాడారు. మన ప్రాచీనులు తరతరాలుగా చరిత్రను లిఖించేవారన్నారు. వాటిని బ్రిటిష్‌ అధికారి కాలిజ్‌ మెకంజీ సేకరించి కైఫియ్యతులు పేరుతో భద్రం చేశారన్నారు. ఈ కైఫియ్యతుల అధ్యయనంలో ఒక ప్రాంత ప్రజలు తమ చరిత్రను ఏ విధంగా సృష్టించుకున్నారనేది మన పూర్వీకులు పుస్తకాల్లో కనిపిస్తుందన్నారు. ఏ దేశ చరిత్ర అయినా ఆ దేశంలో ప్రాంతాల వారీ జనం ఎలా జీవించారు, ఎలా పాలించబడ్డారు, ఏ విధంగా మలుపు తీసుకుంటూ వచ్చారనే విషయాలను వెలికి తీయడం చరిత్రకారుల విధి అన్నారు. ఆ విధంగా రెండొంద ల ఏళ్ల క్రితం మెకంజీ సేకరించిన వివరాలను బొల్లోజుబాబా సేకరించి పుస్తకరూపంలో తీసుకురావడాన్ని అభినందించారు. సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గనరా మాట్లాడుతూ బాబా రచించిన ఈ పుస్తకం ఎంతో విలువైనదన్నారు. ఇప్పటి వరకు పది జిల్లాలకు చెందిన కైఫియ్యతులు పుస్తకరూపంలో వచ్చాయని, మన జిల్లాకు సంబంధించి పుస్తకం రావడం ఇదే ప్రథమమన్నారు. పుస్తక రచయిత బాబా మాట్లాడుతూ భారతదేశ సర్వేయర్‌ జనరల్‌గా పనిచేసిన మెకంజీ రెండు వేలకు పైబడి కైఫియ్యతులు అని పిలిచే స్థానిక చరిత్రలను సేకరించారన్నారు. వీటిలో జిల్లాలో రాజమహేంద్రవరం, కోరుకొండ, సామర్లకోట లాంటి పది ప్రాంతాల స్థానిక చరిత్రలను 1814-15 ప్రాంతంలో ఆయన సేకరించాడన్నారు. 


Updated Date - 2020-11-19T06:01:07+05:30 IST