వస్త్ర రంగంలో రారాజు ‘బొమ్మన’ ఇక లేరు

ABN , First Publish Date - 2020-09-02T17:43:01+05:30 IST

ఉభయగోదావరి జిల్లాల వస్త్ర వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన బొమ్మన బ్రదర్స్‌..

వస్త్ర రంగంలో రారాజు ‘బొమ్మన’ ఇక లేరు

హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి ..

నేడు రాజమహేంద్రి వర్తక బంద్


రాజమహేంద్రవరం సిటీ(ఆంధ్రజ్యోతి): ఉభయగోదావరి జిల్లాల వస్త్ర వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన బొమ్మన బ్రదర్స్‌ అధినేత బొమ్మన రాజ్‌కుమార్‌ (62) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. గతంలో రెండుసార్లు గుండెపోటు రావడంతో స్టంట్‌లు వేశారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అటు వ్యాపార రంగంలోనూ, ఇటు రాజకీయంగానూ రాజమహేంద్రవరంలో కీలకమైన పాత్ర వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం జాంపేట కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా ఉన్నారు. తన చిరకాల కోరిక ఎమ్మెల్యే అవ్వాలని అనుకునేవారు. చిరంజీవి పీఆర్‌పీని ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీ తరపున రాజమహేంద్రవరం సీటు ఆశించారు. తర్వాత కాలంలో వైసీపీలోకి చేరిన ఆయన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి రాజమహేంద్రవరం అభ్యర్థిగా పోటీ చేసీ ఓటమి చెందారు. దీంతో కొంతకాలం రాజకీయలకు దూరమయ్యారు. 2019 ఎన్నికల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వచ్చిన బొమ్మన రాజ్‌కుమార్‌ ఎమ్మెల్సీ పదవిని ఆశించారు.


సీఎం జగన్‌ దృష్టిలో పడిన బొమ్మనకు సముచితస్థానం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఆకస్మిక మృతిచెందారు. రాజకీయలతో సంబంధం లేకుండా రాజ్‌కుమార్‌ అనేక మందికి సహాయపడ్డారు. రాజ్‌కుమార్‌ మృతి పట్ల రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ యువనేత ఆదిరెడ్డి వాసు, మాజీ మేయర్‌ ఆదిరెడ్డి వీరాఘవమ్మ, వైసీపీ నగర కోఆర్డినేటర్‌ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం, నందెపు శ్రీనివాస్‌, బీసీ సంక్షేమ సంఘం నేతలు దాస్యం ప్రసాద్‌, గోలి రవి, సమాజ సేవకుడు పడాల శ్రీనివాస్‌లు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. బుధవారం ఉదయం దొసకాయలపల్లిలోని వారి తోటలోనే రాజ్‌కుమార్‌ అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.


రాజ్‌కుమార్‌ మృతికి సంతాపంగా బుధవారం రాజమహేంద్రవరం వర్తక బంద్‌కు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పిలుపునిచ్చింది. వర్తక సంఘం తరపున వ్యాపారుల సమస్యలపై బొమ్మన గతంలో అనేక పోరాటాలు చేశారు. ఆయన మృతి వర్తక రంగానికి తీరని లోటని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ విచారం వ్యక్తం చేసింది. అలాగే వీవర్స్‌ యూనైటెడ్‌ ఫ్రంట్‌ నేత తూతిక విశ్వనాథ్‌ దిగ్ర్భాంతికి గురయ్యారు. ఫ్రంట్‌ పక్షాన రెండు రోజులు సంతాప దినాలుగా ఆయన ప్రకటించారు. 

Updated Date - 2020-09-02T17:43:01+05:30 IST