పల్లెల్లోనూ బెట్టింగ్‌ రాజాలు!

ABN , First Publish Date - 2020-09-29T08:01:27+05:30 IST

ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభమై దాదాపు పది రోజులవుతోంది. బెట్టింగ్‌ రాయుళ్లకు కాసుల పంట కురిపించే సీజన్‌ ఇది.

పల్లెల్లోనూ బెట్టింగ్‌ రాజాలు!

జంగారెడ్డిగూడెం కేంద్రంగా సాగుతున్న బెట్టింగ్‌ల దందా

గూగుల్‌పే, ఫోన్‌పేల్లోనే బెట్టింగ్‌ ఆర్థిక లావాదేవీలు

బుకీలుగా ఎటపాక మండలంలో పలువురు వ్యక్తులు 

పందాల మోజులో ఆర్థికంగా నష్టపోతున్న యువత

బెట్టింగ్‌లపై దృష్టి సారించని  పోలీసులు


ఎటపాక, సెప్టెంబరు 28 : ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభమై దాదాపు పది రోజులవుతోంది. బెట్టింగ్‌ రాయుళ్లకు కాసుల పంట కురిపించే సీజన్‌ ఇది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా బెట్టింగ్‌ రాయుళ్లు వాట్సప్‌ గ్రూపుల్లో ఇప్పుడు బెట్టింగ్‌ దందాకు తెరతీస్తున్నారు. గూగుల్‌పే, ఫోన్‌పేల ద్వారా బెట్టింగ్‌ల ఆర్థిక లావాదేవీలను సాగిస్తున్నారు. రూ.వెయ్యి నుంచి రూ. 1 లక్ష వరకు బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఆ జట్టు గెలుస్తుందని కొందరు, లేదు మరొక జట్టు గెలుస్తుందని మరికొందరు,  ఆ జట్టులోని పలానా క్రీడాకారుడు ఎక్కువ రన్స్‌ చేస్తాడని లేక ఆ బాల్‌ సిక్సర్‌ వెళుతుందని.. వెళ్లదని మరికొంద రు, ఈ ఓవర్లో మొదటి బాల్‌ వికెట్‌ వస్తుందని.. లేదు డాట్‌బాల్‌ అవుతుందని ఇలా వివిధ రకాలుగా ఈ ఐపీఎల్‌ సీజన్‌లో బెట్టింగ్‌రాయుళ్లు జోరుగా దందా ను కొనసాగిస్తున్నారు. విలీన మండలాల్లోని ఎటపాక, కూనవరం, చింతూరు ల్లో ఈ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసు నిఘా వర్గాలు, పోలీసు అధికారులు ఐపీఎల్‌ బెట్టింగ్‌లపై దృష్టిసారించకపో వడం పట్ల సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమగోదా వరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, భద్రాచలం కేంద్రంగా పలువురు బెట్టింగ్‌లు  నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.


ఎటపాక మండలంలోని తోటపల్లి, ఎటపాక, పొరుగున ఉన్న భద్రాచలంలో పలువురు బుకీలుగా కొనసాగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉన్నాయి. బుకీలు ఏ రోజుకుఆరోజు వాట్సప్‌ గ్రూపు ల్లో మ్యాచ్‌ వివరాలు, తలపడే మ్యాచ్‌ల జట్ల వివరాలు సైతం వాట్సప్‌ గ్రూప్‌ పెట్టడంతో బెట్టింగ్‌ల నిర్వహణ ప్రారంభమవుతుంది. ఉదయం నుంచి మ్యాచ్‌ ప్రారంభమయ్యే వరకు బెట్టింగ్‌ల జోరు సాగుతూ ఉంటుంది. సాంకేతిక పరి జ్ఞానాన్ని బెట్టింగ్‌కు అన్వయించడంతోపాటు పలురకాల బెట్టింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉండడం, వాట్సప్‌ గ్రూపుల్లో సైతం బెట్టింగ్‌లకు పాల్పడుతుండడంతో బెట్టింగ్‌రాయుళ్లను గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. అలాగే బెట్టింగ్‌ ఆర్థిక లావాదేవీలు బెట్టింగ్‌రాయుళ్లు అంతా ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తుండడంతో ఎవరి కంట పడడంలేదు. ప్రధాన జట్ల మధ్య మ్యాచ్‌ ఉంటే బెట్టింగ్‌ తారస్థాయిలో జరుగుతోంది. మరోవైపు చివరి ఐదు ఓవర్లకు లక్షల్లో బెట్టింగ్‌ సాగుతోందనేది బహిరంగ రహస్యమే. కానీ కొందరు యువత వేలాది రూపాయలు బెట్టింగ్‌ల్లో పొగొట్టుకుంటూ ఆర్థికంగా నష్టపోతున్నారు. మరి కొందరు క్రికెట్‌ మోజులో ద్విచక్ర వాహనాలను సైతం బెట్టింగ్‌ల్లో కాస్తున్నారు.


దృష్టి సారించని నిఘా వర్గాలు  

విలీన మండలాల్లో పది రోజులుగా బెట్టింగ్‌ల నిర్వహణ జోరుగా సాగుతు న్నా పోలీసు నిఘా వర్గాలు సైతం పసిగట్టలేకపోతున్నాయి. సాంకేతిక పరి జ్ఞానంతో బెట్టింగ్‌లు సాగుతుండడం వల్ల అంతా రహస్యంగా సాగిపోతోంది. బెట్టింగ్‌పై ఫిర్యాదులు, సమాచారం పెద్దగా వచ్చే అవకాశం లేకపోవడంతో నిఘా వర్గాలు సైతం బెట్టింగ్‌లపై దృష్టి సారించడం లేదనే ప్రచారం ఉంది.  గతంలో ఎటపాక మండలంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే  పోలీసులకు అంతుచిక్కకుండా యువత చాకచక్యంగా సాగిస్తున్న బెట్టింగ్‌ వ్యవహారంలో పోలీసు నిఘా వర్గాలు మరింత దృషి సారించాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌లు రోజురోజుకి ఉత్కంఠతను, ఆసక్తిని ఏస్ధాయిలో రేపుతున్నాయో అదే స్థాయిలో బెట్టింగ్‌లు సైతం సాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. పోలీసు అధికారులు దృష్టి సారించి బెట్టింగ్‌ రాయుళ్ల ఆట కట్టించాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-09-29T08:01:27+05:30 IST