బీచ్‌లంటేనే భయం..భయం

ABN , First Publish Date - 2020-11-20T07:20:24+05:30 IST

బంగాళాఖాతం సముద్ర తీరం భయానకంగా మారుతోంది. ఆటవిడుపు కోసం బీచ్‌లకు వెళ్లే పర్యాటకుల పాలిట ప్రాణాంతకమవుతోంది. కార్తీకమాసం ప్రారంభంకావడంతో కోనసీమలోని సము ద్ర తీరాలు గత కొన్నిరోజుల నుంచి పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి.

బీచ్‌లంటేనే భయం..భయం
అమలాపురం ప్రాంతంలోని ఓడలరేవు సాగర తీరంలో పర్యాటకుల సందడి


  • పర్యాటకుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్న బీచ్‌లు 
  •  భారీగా కోతకు గురవుతున్న సముద్రతీరం
  • స్నానాలకు వెళితే.. ప్రాణాలు వదులుకోవాల్సిందేనా? 
  • ముఖ్యమైన బీచ్‌లలో రక్షణచర్యలు చేపట్టాలి
  • నిత్యం పర్యాటకులతో కళకల్లాడుతున్న బీచ్‌లు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

బంగాళాఖాతం సముద్ర తీరం భయానకంగా మారుతోంది. ఆటవిడుపు కోసం బీచ్‌లకు వెళ్లే పర్యాటకుల పాలిట ప్రాణాంతకమవుతోంది. కార్తీకమాసం ప్రారంభంకావడంతో కోనసీమలోని సము ద్ర తీరాలు గత కొన్నిరోజుల నుంచి పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. అయితే తీరం వెంబడి చోటుచేసుకుంటున్న పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సరదా కోసం సముద్ర స్నానాలకు వెళితే ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుందంటూ పర్యాటకులు ఆవేదన చెందుతున్నారు. బంగాళా ఖాతం తీరంలో సముద్రంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పులతో తీరమంతా భారీగా కోతకు గురై కనుమరుగు కావడంతో స్నానాలు చేసేవారికి ఇక్కడ ఇబ్బందులు తప్పడంలేదు. బంగాళాఖా తం సముద్రతీరం భారీగా కోతకు గురవుతోంది. వేలాది ఎకరాల భూములు సముద్రగర్భంలో కలిసిపోతున్నాయి. రహదారులు, సరుగుడుతోటలు, తాడిచెట్లు, మడ అడవులు వంటివి కళ్లముందే కడలిలో కలిసిపోతున్న భయానక పరిస్థితులు తీరగ్రామాల ప్రజలను, పర్యాటకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికితోడు నిబంధనలకు విరుద్ధంగా సముద్రతీరం వెంబడి ఇసుక ర్యాంపులు పెట్టి  భారీగా సముద్ర తీరంలోని ఇసుకను తరలించడం ద్వారా అక్రమార్కులు లాభార్జనలకు పాల్పడుతున్నా నిరోధించాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. బంగాళాఖాతం సముద్రతీరం కోనసీమలో తీవ్రంగా కోతకు గురవుతోంది. నిత్యం వందల ఎకరాల భూములు కడలిలో కలిసిపోతున్నాయి. తీరం ముందుకు చొచ్చుకొస్తున్న పరిస్థితులు ఆయా తీరగ్రామాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కోనసీమలోని సుమారు 40 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీరప్రాంతం గత కొన్నిరోజుల నుంచి దారుణాతి దారుణంగా కోతకు గురవుతోంది. ఒకవైపు ఇసుకమాఫియా ప్రతినిధులు మరోవైపు రొయ్యలు, చేపల చెరువుల కోసం తీరాన్ని తవ్వేస్తున్నారు. ఇటీవల సముద్రం ముందుకు దూసుకొస్తూ గ్రామాలను సైతం ముంచెత్తే ప్రమాదకర పరిస్థితులకు కారణమవుతోంది. భైరవపాలెంలోని సముద్రతీర ప్రాంతం నుంచి బ్రహ్మసమేధ్యం, చిర్రయానాం, ఎస్‌.యానాం, వాసాలతిప్ప, కొమరిగిరిపట్నం, ఓడలరేవు, కేశనపల్లి, కరవాక, చింతలమోరి, అంతర్వేది తీరం వరకు సముద్రం భారీగా కోతకు గురికావడంతోపాటు అనూహ్యంగా ముందుకు చొచ్చుకొస్తున్న తీరు భవిష్యత్‌లో ఆందోళనకరమైన పరిణామాలకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఓడలరేవు  తీరప్రాంతంలో వేలాది కోట్ల రూపాయల విలువైన చమురు సంపదను తరలించుకునేందుకు వీలుగా ఏర్పాటుచేసిన కట్టడాలకు చేరువగా సముద్రం ముందుకొచ్చింది. గతంలో తీరానికి వేసిన రోడ్లు సైతం సముద్రంలో శరవేగంగా కలిసిపోతున్నాయి. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కడలి కోపాగ్నికి తీరప్రాంతం కనుమరుగవుతోంది. తీరం వెం బడి ఐదు అడుగుల మేర భూమి కోతకు గురైంది. సముద్రం దగ్గరకు వెళ్లాలంటే కూడా కష్టమైన పరిస్థితులు నెలకొన్నాయని ఓడలరేవుతీరంలో పర్యాటకులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఎంతో దూరంలో ఉండే సముద్రం ఇప్పుడు గ్రామ సరిహద్దుల్లోకి చొచ్చుకొస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. కార్తీకమాసంలో స్నానాల కోసం వెళ్లే పర్యాటకుల రక్షణ కోసం ముఖ్యమైన అంతర్వేది, ఓడలరేవు, చింతలమోరి, ఎస్‌.యానాం వంటి బీచ్‌లలో రక్షణ చర్యలు చేపట్టడంతోపాటు పోలీసు భద్రతను ఏర్పాటు చేయకపోతే యువకులు మూల్యం చెల్లించవలసిన పరిస్థితులు ఉత్ప న్నం అవుతాయని పర్యాటకులు ఆవేదన చెందుతున్నారు.

Updated Date - 2020-11-20T07:20:24+05:30 IST