బీసీలకు 34 శాతం వాటా ఇచ్చి తీరాలి
ABN , First Publish Date - 2020-10-28T05:16:01+05:30 IST
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు. నగరంలోని గోలి ప్లాజాలో నగర అధ్యక్షుడు గోలి రవి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 27: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు. నగరంలోని గోలి ప్లాజాలో నగర అధ్యక్షుడు గోలి రవి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జ్యోతిబాపూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ త్యాగాలతో రాజ్యాంగం బీసీలకు హక్కులను కల్పించిందే తప్ప ఏ పార్టీ దయాదాక్షిణ్యం కాదన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న రిజర్వేషన్ల వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాజకీయాలకు అతీతంగా బీసీలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుని రాజ్యాధికారం దిశగా ప్రతీ బీసీ ముందుకు రావాలన్నారు. మోదీ బీసీ అయినా ఆయన అధికారంలోకి వచ్చాక బీసీలకు ఏమి చేశారని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకు గానే చూశారని, ఇప్పుడు జగన్ కూడా కేవలం కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. వాటికి నిధులు మంజూరు బట్టి పరిస్థితి ఏమిటో తెలుస్తుందన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిటీలను వేస్తామన్నారు. సమావేశంలో సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికుమార్, రాజమహేంద్రవరం పార్లమెంటరీ అధ్యక్షుడు బర్ల బాబూరావు, మజ్జి అప్పారావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం ప్రసాద్ పాల్గొన్నారు. పలువురిని బీసీ సంఘంలో చేర్చుకుని నియామక పత్రాలు ఇచ్చారు.