‘ఆశా’ల విషయంలో.. ఏపీ ప్రభుత్వం ఇలా చేసిందేమిటి!
ABN , First Publish Date - 2020-04-21T17:37:39+05:30 IST
ఇది కరోనా కాలం. ఇంత క్లిష్ట సమయంలో క్షేత్ర స్థాయిలో..

ఆశా.. నిరాశ!
కరోనా విధుల్లో ఉన్న ఆశా కార్యకర్తలకు జీతమేది ?
మార్చి నెల కేంద్రం వాటా జమ
రాష్ట్రం వాటాకు తాత్సారం
ఇంటింటి సర్వేలో మాస్కులు, శానిటైజర్‌లకూ దిక్కులేదు
కాకినాడ(ఆంధ్రజ్యోతి): ఇది కరోనా కాలం. ఇంత క్లిష్ట సమయంలో క్షేత్ర స్థాయిలో పనిచేసేవారంతా మనకు దేవుళ్లు. నిజంగా వారికి చేతెలెత్తి మొక్కాలి. పారిశుధ్య కార్మికుడి నుంచి వైద్యుడి వరకు మన కోసం నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పనిచేసేవారి సహకారం వెలకట్టలేనిది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆశా కార్యకర్తలు చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు. రెడ్ జోన్లలో అయితే వీరి సేవలు మరీ ముఖ్యం. ప్రాణాంతకమైన పరిస్థితుల మధ్య పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం చేసిందేమిటో తెలుసా. పది వేల జీతంలో సగం కోత. ఇది కూడా కేంద్రం వాటాగా ఇచ్చిన మొత్తం. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇదేంటని అడిగితే పది రోజుల్లో ఇస్తామని చెబుతోంది.
‘కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నివారణ విధుల్లో సేవలందిస్తున్నాం. అనుమానితులను గుర్తించడంలో కీలకంగా ఉన్నాం. అప్పగించిన విధులు నిర్వహిస్తూ ప్రజారోగ్యం కోసం ఎప్పుడూ చేసే పనికంటే అదనంగా పనిచేస్తున్నాం. కానీ కష్టానికి వేతనం దక్కలేదు. మార్చి నెల జీతం రూ. 10 వేలు చెల్లించాల్సి ఉండగా, కేంద్ర వాటా రూ.4,725 మాత్రమే ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా వారం పది రోజుల్లో ఇస్తామంటున్నారు. దీనికీ రాజీ పడుతున్నాం. కానీ వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న మాకు.. కనీసం నాణ్యమైన మాస్కులు, శానిటైజర్ బాటిళ్లు ఇవ్వడం లేదు. మరీ ఇంత చిన్న చూపా..’ ఇది జిల్లాలోని ఆశా కార్యకర్తల ఆవేదన.
జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో సుమారు నాలుగువేల మంది ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం, ఆరోగ్య కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లి బహుళార్ధ సాధకులుగా వీరు పనిచేస్తున్నారు. జనతా కర్ఫ్యూ తర్వాత లాక్‌డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు కోవిడ్ 19 వైరస్ నియంత్రణలో భాగంగా వీరికి కొన్ని విధులప్పగించారు. ఏఎన్‌ఎం, హెల్త్ సూపర్‌వైజర్, వలంటీర్‌లతో కలిసి వీరు ఇంటింటి సర్వే చేస్తున్నారు. వీరిలో కొందరికి మాత్రమే శానిటైజర్, మాస్కులు ఇస్తున్నారన్నది వారి ఆరోపణ. మాస్కులు తీసుకున్నవారు వాటిని ఉతుక్కుని మళ్లీ వాటినే వినియోగించుకోవాల్సి వస్తోంది. సర్వే సమయంలో భౌతిక దూరం పాటిస్తు న్నప్పటికీ ఎవరికైనా వైరస్ లక్షణాలుంటే నాణ్యమైన మాస్కు లేకపోవడం వల్ల లక్షణం సోకే ప్రమాదం ఉంటుంది.
ఉదాహరణకు ఇటీవల రాజమహేంద్రవరం మంగళవారపేటలో సర్వే తర్వాత అక్కడ కొన్ని పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అక్కడ సర్వేలో పాల్గొన్న ఇద్దరు ఆశా, ఏఎన్‌ఎంలను అనుమానితుల జాబితాలో చేర్చారు. వారిని పరీక్షలు చేయడానికి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముందస్తు చర్యల్లో వీరికి రక్షణ సదుపాయాలు కల్పించి ఉంటే ఈ పరిస్థితి రాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరు క్షేత్ర స్థాయిలో సేకరించిన వివరాలతో జిల్లాలో చాలామంది అనుమానితులను అధికారులు గుర్తించారు. వారిలో కొందరిని ఐసోలేషన్‌కు, మరికొందరిని క్వారంటైన్‌కు తరలించారు. రెడ్‌జోన్‌లలో ఆశ కార్యకర్తలు చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. రాజమహేంద్రవరంలాంటి దాఖలాలు తలెత్తకుండా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోడానికి వీరు సమాయత్తమవుతున్నారు. విధుల్లో ఉన్న ప్రతీ ఉద్యోగి, సిబ్బందికి పరీక్షలు చేయిస్తామని ఇప్పటికే జిల్లా యంత్రాంగం ప్రకటించింది. దీంతో తాము పరీక్షలు చేయించుకునే రోజున ఆన్‌డ్యూటీగా పరిగణించాలని ఆశా కార్యకర్తలు కోరుతున్నారు.
కేంద్రం రూ.50 లక్షల బీమా ప్రకటించింది..
కోవిడ్ 19 వైరస్ నియంత్రణ విధుల్లో ఉన్న ఆశ కార్యకర్తలకు ప్రధాని మోదీ రూ.50 లక్షలతో బీమా చేస్తామని ప్రకటించారు. అది అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. రావులపాలెం మండలం గోపాలపురం పీహెచ్‌సీ పరిధి పొడగట్లపల్లి గ్రామం సబ్ సెంటర్‌లో పనిచేస్తున్న ఓ ఆశా కార్యకర్త కిడ్నీలు పాడై ఇటీవల మరణించారు. ఆ కుటుంబం అనాధయ్యింది. ఇటువంటి వారికి కూడా బీమా వర్తింపజేయాలి. ఆశ కార్యకర్తలందరికీ మాస్కులు, శానిటైజర్‌లు ఇవ్వాలి.
- చంద్రమాళ్ల పద్మ, ఆశ కార్యకర్తల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి