అరబిందో చేతికి కాకినాడ సీపోర్టు

ABN , First Publish Date - 2020-12-25T07:35:17+05:30 IST

కాకినాడ సీపోర్టు (డీప్‌వాటర్‌ పోర్టు)లో 41.12 శాతం వాటాను అరబిందో ఫార్మా చేజిక్కించుకుంది.

అరబిందో చేతికి  కాకినాడ సీపోర్టు

41.12 శాతం వాటా విక్రయం

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

కాకినాడ సీపోర్టు (డీప్‌వాటర్‌ పోర్టు)లో 41.12 శాతం వాటాను అరబిందో ఫార్మా చేజిక్కించుకుంది. ఈ మేరకు సీపోర్టుకు చెందిన కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (కేఐహెచ్‌పీఎల్‌) తన వాటాను అరబిందోకు విక్రయిస్తూ నిర్ణయించింది. దీంతో డీప్‌వాటర్‌ పోర్టులో వాటాను అరబిందో ఫార్మా చేజిక్కించుకున్నట్లయింది. ఈ మేరకు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ శుక్రవారం జీవో నెం.17 జారీ చేసింది. కాకినాడ సీపోర్టును డీప్‌వాటర్‌ పోర్టుగా పిలుస్తారు. 20ఏళ్ల కిందట నిర్మాణం జరిగిన ఈ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత వాటా ఉంది. అటు   కాకినాడ ఇన్‌ఫా్ట్రస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీకి 41.12 శాతం వాటా ఉంది. ఈనేపథ్యంలో పోర్టు వ్యాపారంలో వచ్చే ఆదాయంలో గడచిన మూడేళ్లుగా ఏటా రూ.100 కోట్ల వరకు ప్రభుత్వానికి చెల్లిస్తోంది. అయితే ఇప్పుడు సీపోర్టులో 41.12 వాటాను  కేఐహెచ్‌పీఎల్‌ అరబిందో ఫార్మాకు విక్రయించింది. ఈ డీల్‌ ఇటీవల పూర్తికావడంతో తాజాగా ప్రభుత్వం అరబిందో ఫార్మా పేరుతో 41.12 శాతం వాటా కింద 2.15 లక్షల షేర్లు బదిలీ అయినట్టు నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో ఇటీవల జీఎంఆర్‌ గ్రూపు 51 శాతం వాటాను అరబిందో ఫార్మాకు రూ.2,160 కోట్లకు విక్రయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది కార్పొరేట్‌ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు కాకినాడ సీపోర్టులో 41.12శాతం వాటా అరబిందో కంపెనీ చేతికి రావడం విశేషం.

Updated Date - 2020-12-25T07:35:17+05:30 IST