అంగన్‌వాడీ స్కూళ్లకు సెలవులు ఇవ్వలేదేం...!

ABN , First Publish Date - 2020-03-21T09:03:29+05:30 IST

కోవిడ్‌-19 వైరస్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు వంటి వాటితో సహా అన్నింటినీ మూయించేసిన ప్రభుత్వం

అంగన్‌వాడీ స్కూళ్లకు సెలవులు ఇవ్వలేదేం...!

జిల్లాలో కొనసాగుతున్న 5,546 పాఠశాలలు

ప్రభుత్వం ఆదేశిస్తే సెలవులు ఇస్తాం: పీడీ జీవన్‌బాబు


(ఆంధ్రజ్యోతి, అమలాపురం)

కోవిడ్‌-19 వైరస్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు వంటి వాటితో సహా అన్నింటినీ మూయించేసిన ప్రభుత్వం అంగన్‌వాడీ పాఠశాలలకు మాత్రం సెలవులు ప్రకటించలేదు. ఐదేళ్లలోపు పసిపిల్లలకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లోకి అనుమతిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. జిల్లాలో 5,546 అంగన్‌వాడీ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ప్రతి కేంద్రానికి పది నుంచి 20 మధ్య పిల్లలు హాజరవుతారు. జిల్లావ్యాప్తంగా 10వేల మందికి పైగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పనిచేస్తున్నారు.


అమలాపురం ఐసీడీఎస్‌ సీడీపీవో కార్యాలయ పరిధిలో 285 అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు మరో 11 మినీ సెంటర్లు నిర్వహిస్తున్నారు. 600మంది సిబ్బంది వరకు ఈ కేంద్రాల్లో పనిచేస్తున్నారు. ప్రతిరోజు కేంద్రాలకు వచ్చే పిల్లలకు 8నుంచి 11 గంటల్లోపు పౌష్టికాహారాన్ని అందించి ఆటలు, ఇతర కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉండటంతో అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు.


స్త్రీ, శిశుసంక్షేమశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి తానేటి వనిత సైతం ఈ వ్యవహారంపై దృష్టిసారించకుండా నిర్లక్ష్యం ఎందుకు ప్రదర్శిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా ఐసీడీఎస్‌ పీడీ సుఖజీవన్‌భాబును వివరణకోరగా ప్రభుత్వ ఆదేశాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని, ఇప్పటివరకు అంగన్‌వాడీ కేంద్రాల మూసివేతపై తమకు ఎటువంటి అధికారిక ఆదేశాలు అందలేదని స్పష్టం చేశారు.

Updated Date - 2020-03-21T09:03:29+05:30 IST