ఎక్కడున్నాడో!

ABN , First Publish Date - 2020-10-03T07:36:46+05:30 IST

బంగారు ఆభరణాలు తయారుచేసి విక్రయించే విజయవాడకు చెందిన యువ వ్యాపారి జైన్‌ కౌశిక్‌కుమార్‌ అదృశ్యం మిస్టరీ ఇంకా

ఎక్కడున్నాడో!

బంగారు నగల వ్యాపారి అదృశ్యంపై వీడని మిస్టరీ 

ఐపీఎల్‌ బెట్టింగులకు పాల్పడ్డాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు


అమలాపురం టౌన్‌, అక్టోబరు 2: బంగారు ఆభరణాలు తయారుచేసి విక్రయించే విజయవాడకు చెందిన యువ వ్యాపారి జైన్‌ కౌశిక్‌కుమార్‌ అదృశ్యం మిస్టరీ ఇంకా వీడలేదు. అమలాపురం డీఎస్పీ షేక్‌ మసూమ్‌ బాషా ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గత నెల 29న అమలాపురం గడియార స్తంభం సెంటర్లోని లాడ్జి నుంచి చెక్‌ అవుట్‌ చేసిన కౌశిక్‌కుమార్‌ అనంతరం తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఇంటికి వస్తున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత నుంచి అతడి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. కౌశిక్‌కుమార్‌ బంగారు ఆభరణాలు తయారీకి సంబంధించి అమలాపురం, ముమ్మిడివరం తదితర ప్రాంతాల్లో ఆర్డర్లు తీసుకుని వాటిని సరఫరా చేస్తుంటాడు. అమలాపురం నుంచి బయలుదేరుతు న్నానని చెప్పిన కుమారుడు ఇంటికి చేరుకోకపోవడంతో అమలాపురం పట్టణ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.


దాంతో సీఐ షేక్‌ బాజీలాల్‌ ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్‌లోని లాడ్జిలో పోలీసులు విచారణ చేపట్టారు. లాడ్జి వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో అతని కదలికలను పరిశీలించారు. అయితే 2016లో క్రికెట్‌ బెట్టింగుల వ్యవహారంలో విజయవాడ కృష్టలంక పోలీస్‌స్టేషన్‌లో కౌశిక్‌కుమార్‌పై కేసు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఐపీఎల్‌ సీజను నడుస్తుండడంతో ఏమైనా బెట్టింగులకు పాల్పడి నష్టపోయాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.


ఈ మిస్టరీని చేధించేందుకు సీఐతో పాటు ఇద్దరు ఎస్‌ఐలు, నేర విభాగం సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమిం చినట్టు డీఎస్పీ తెలిపారు. పెదనాన్న వద్ద ఉంటూ కౌశిక్‌ కుమార్‌ ఆభరణాల తయారీకి సంబంధించి ఆర్డర్లు తీసుకుని ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వాటిని తయారు చేయించి ఈ ప్రాంతాలకు తీసుకు వస్తుంటాడు. జైన్‌ అదృశ్యమయ్యే సమయానికి అతని వద్ద ఎంత మేర బంగారం, నగదు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా అతని ఫోన్‌ డేటా ఆధారంగా ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి, వ్యాపార లావాదేవీలు తదితర అంశాలపై పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు.

Updated Date - 2020-10-03T07:36:46+05:30 IST