వ్యవసాయ రంగాన్ని ప్రథమస్థానంలో నిలపడమే ధ్యేయం

ABN , First Publish Date - 2020-11-13T06:10:17+05:30 IST

వ్యవసాయ రంగాన్ని దేశంలోనే ప్రథమస్థానంలో నిలపాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.

వ్యవసాయ రంగాన్ని ప్రథమస్థానంలో నిలపడమే ధ్యేయం
పామాయిల్‌ రైతులకు చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి కన్నబాబు, ఎంపీలు భరత్‌రామ్‌, గీత

  • వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు

అనపర్తి/రంగంపేట, నవంబరు 12: వ్యవసాయ రంగాన్ని దేశంలోనే ప్రథమస్థానంలో నిలపాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అనపర్తిలోని వైసీపీ కార్యాలయంలో గురువారం రాత్రి జిల్లా ఆయిల్‌ఫామ్‌ రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి అనేక పథకాలను అందజేస్తున్నారన్నారు. రంగంపేట మండలం దొంతమూరులో పామాయిల్‌ రైతుల పంటలను తప్పుడు కాటా పేరుతో దోచుకున్న వారిని నిలదీసి రైతులకు నష్టపరిహారం అందించడం ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి కృషికి నిదర్శనమన్నారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ఎంపీలు భరత్‌రామ్‌, వంగా గీత మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ రైతులకు గిట్టుబాటు ఽధ అందించేలా పార్లమెంట్‌లో తమ వాణిని వినిపిస్తామన్నారు. మరోఅతిథి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ దళ్వా పంటకు మెట్ట ప్రాంతానికి ఒకటిన్నర టీఎంసీల నీరు అందిస్తే మెట్ట రైతులకు ఎంతో ఉపయోగకరమని, దీనిపై మంత్రి కన్నబాబు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ పామాయిల్‌ రైతులకు మునుపెన్నడూ లేని విధంగా సీఎం జగన్‌ ప్రభుత్వం తెలంగాణ ధరతో ఉన్న వ్యత్యాసానికి రూ.80కోట్ల తేడాను రైతుల ఖాతాలకు జమ చేయడం చిన్న విషయం కాదన్నారు. దొంతమూరులోని పామాయిల్‌ కాటా తూకం తేడాతో రైతులు నష్టపోయిన రూ.50లక్షల చెక్కులను 462మంది రైతులకు మంత్రి అందజేశారు. అతిథులను పామాయిల్‌ రైతుల సంక్షేమ సంఘం నాయకులు, రైతులు సత్కరించారు.


ఏప్రిల్‌ నాటికి సొంత భవనాలు పూర్త


రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లకు శాశ్వత భవనాలు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని, ఇవన్నీ ఏప్రిల్‌ నాటికి పూర్తికావాలని ఆదేశించామని మంత్రి కన్నబాబు తెలిపారు. రంగంపేటలో రూ.90 లక్షలతో నిర్మించిన తహశీల్దార్‌ భవనాన్ని ఆయన ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. మండల కేంద్రాల్లో కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణం చేపట్టి గోదాములు కూడా నిర్మించి రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో పామాయిల్‌ సంక్షేమ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సత్తి రామారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణమూరి, హార్టీకల్చరల్‌ పీడీ రామ్మోహన్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ నాయకులు నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, రంగంపేట మండల కన్వీనర్‌ నల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-13T06:10:17+05:30 IST