-
-
Home » Andhra Pradesh » East Godavari » a man get police
-
ఆ మృగాడు.. దొరికాడు!
ABN , First Publish Date - 2020-12-06T07:07:14+05:30 IST
కరడుగట్టిన నేరస్తులను పట్టుకునే రీతిలో 13 ప్రత్యేక పోలీసు బృందాలు.. 11 రోజులపాటు నిద్రాహారాలు మాని నిర్విరామంగా అన్వేషించి అయిదేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకున్నారు.

అత్యాచారానికి పాల్పడిన నిందితుడు అరెస్టు
నిందితుడి అరెస్టులో కీలక ఆధారం ఫోన్ చోరీ
ఆ ఆధారంతోనే పకడ్బందీగా నిందితుడి గాలింపు
జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ
కాకినాడ క్రైం, డిసెంబర్ 5: కరడుగట్టిన నేరస్తులను పట్టుకునే రీతిలో 13 ప్రత్యేక పోలీసు బృందాలు.. 11 రోజులపాటు నిద్రాహారాలు మాని నిర్విరామంగా అన్వేషించి అయిదేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకున్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, ఫోర్సెనిక్ ల్యాబ్ సాయంతో ఎట్టకేలకు పాత నేరస్తుడైన నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు గుర్తించారు. నిందితుడు తాడి ప్రభు (చిన్న) అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ తెలిపిన కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన అయిదేళ్ల చిన్నారి అమ్మమ్మ, తాతయ్యలతో ఇంట్లో నిద్రిస్తోంది. వరండాలో తండ్రి పడుకున్నాడు. నవంబరు 24న అర్ధరాత్రి అమ్మమ్మ లేచి చూసుకుంటే పాప పక్కలో లేదు. దాంతో తాతయ్య, భర్తతో కలసి చిన్నారి కోసం గాలించారు. వీధి చివరలో చిన్నారి ఒంటిపై బట్టలు లేకుండా వీపుంతా గాయాలు, రక్తస్రావంతో పడి ఉండడాన్ని సూచిన స్థానికులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు బాలిక అత్యా చారానికి గురైనట్టు గుర్తించి, తీవ్ర గాయాలతో ఉన్న బాలికను జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స అందిస్తున్నారు. దాంతో పాపపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కోసం డీజీపీ గౌతం సవాంగ్, డీఐజీ కేవీ మోహనరావు ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ నేతృత్వంలో దిశ డీఎస్పీ ఎస్.మురళీమోహన్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని పట్టుకునేందుకు 13 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలించారు. అత్యాచారం చేసిన తర్వాత చిన్నారి తాతయ్య సెల్‌ఫోన్ చోరీకి గురైంది. దీని ఆధారంగా తీగలాగారు. అలాగే సిటీలో, ఇంటి సమీపంలో చెడు, నేర స్వభావం కలిగిన వ్యక్తులపై దృష్టి సారించి పలువురుని విచారించారు. సీసీ కెమెరాలు, సంఘటనా స్థలం వద్ద లభించిన ప్రాథమిక ఆధారాలు దగ్గర నుంచి బాలిక ఆసుపత్రిలో చేర్చిన వరకు మొత్తం ఆధారాలను క్షుణ్ణంగా సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి విచారించారు. చోరీకి గురైన ఫోన్‌పై నిఘా ఉంచారు. కాకినాడు, రాజమహేంద్రవరం, యానాం, ఐ.పోలవరం, అమలాపురం, తాడేపల్లిగూడెం, విజయవాడ, హైదరాబాదు, తుని, ఉప్పాడ కొత్తపల్లి, బలుసుతిప్ప, కాట్రేనికోన, రౌతులపూడి, విశాఖ తదితర ప్రాంతాల్లో గాలించిన తర్వాత నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
నిందితుడు 16 చోరీ కేసుల్లో నేరస్తుడు
అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు కాకినాడ ముత్తానగర్‌కు చెందిన 29 ఏళ్ల తాడి ప్రభు (చిన్న)ను శనివారం తెల్లవారుజామున కత్తిపూడిలో పోలీసులు అరెస్టు చేశారు. గతనెల 24న నిందితుడు స్నేహితుడితో మద్యం సేవించిన అనంతర మద్యం మత్తులో స్నేహితుడి సెల్‌ఫోన్, డబ్బులు దొంగిలించాడు. అక్కడ నుంచి నగరంలోని ఒక ప్రాంతంలో బాలిక ఇంట్లో ప్రవేశించి, బాలికను, ఆమె తాతయ్య సెల్‌ఫోన్ ఎత్తుకుపోయాడు. స్మశానవాటిక వద్దకు బాలికను తీసుకెళ్లి అమానుషంగా అత్యాచారం చేశాడు. తీవ్ర రక్తస్రావం, గాయాలతో ఏడుస్తున్న బాలికను కొద్దిదూరం తీసుకొచ్చి వదిలేసి పరారై స్థానిక జ్యోతుల మార్కెట్ ప్రాంతంలో ఓ లాడ్జిలో గది తీసుకుని రెండు రోజులు ఉన్నాడు. రూమ్ తాళం ఇవ్వ కుండా అమలాపురం, ఆ తర్వాత హైదరాబాదు వెళ్లాడు. నిందితుడు పాత నేరస్తుడు. ఇతనిపై 16 దొంగతనాల కేసులు పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్నాయి. నిందితుడికి కఠిన శిక్షలు పడేలా ఐపీసీ 366ఏ, ఏబీ 376, 6ఆర్/డబ్లూ5 సెక్షన్ల్ కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. నిందితుడి నుంచి 3 సెల్‌ఫోన్లు, రూ.7 వేల నగదు, లాడ్జి గది తాళాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. పక్కా ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాల్సిందిగా డీఎస్పీ భీమారావును ఆదేశించారు. నిందితుడి పట్టివేతలో శ్రమించిన అడిషనల్ ఎస్పీ కె.కుమార్, డీఎస్పీ భీమారావు, ఎస్.మురళీమోహన్, సీఐ టి. రామోహ్మన్‌రెడ్డి, డి. గోవిందరావులతోపాటు పలు బృందాల ఎస్‌ఐలు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.