కొవిడ్‌ పరీక్షలకు 48 గంటలు బ్రేక్‌

ABN , First Publish Date - 2020-07-19T10:38:42+05:30 IST

జిల్లాలో కొవిడ్‌-19 కేసులు రికార్డు స్థాయిలో నమోద వుతుండడంతో 48 గంటలపాటు కొవిడ్‌ పరీక్షలను

కొవిడ్‌ పరీక్షలకు 48 గంటలు బ్రేక్‌

(అమలాపురం-ఆంధ్రజ్యోతి/కొత్తపేట): జిల్లాలో కొవిడ్‌-19 కేసులు రికార్డు స్థాయిలో నమోద వుతుండడంతో 48 గంటలపాటు కొవిడ్‌ పరీక్షలను నిలుపుదల చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. అత్యవసర కాంటాక్ట్‌ కేసులు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ కిట్లు కొరత కారణంగా కొవిడ్‌ పరీక్షలు నిలిపి వేయడంతో అనుమానిత లక్షణాల బాధితులు ఆందోళన చెందుతున్నారు.


కోనసీమ వ్యాప్తంగా వివిధ పీహెచ్‌సీలతోపాటు ఇటీవల జిల్లాకు వచ్చిన సంజీవిని బస్సుల్లో సైతం కొవిడ్‌ పరీక్షలను శనివారం ఆకస్మికంగా నిలుపుదల చేశారు. వాస్తవానికి కొత్తపేటలో సంజీవిని బస్సులో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌లు నిర్వహించాలని అధికారులు ముందుగా నిర్ణయించి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం నుంచి వందల సంఖ్యలో అనుమానిత బాధితులు బస్సు వద్దకు చేరుకుని రిజిస్ర్టేషన్‌ కోసం బారులు తీరారు. అయితే జిల్లా అధికారుల ఆదేశాలతో సంజీవిని బస్సులో పరీక్షలు చేయడం లేదని చేతులెత్తేశారు. వాస్తవానికి ముందుగా నమోదు చేయించుకున్న 75 మందికి మాత్రమే కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు చెప్పారు.


అప్పటికే వందల సంఖ్యలో పరీక్షల కోసం క్యూ కట్టిన అనుమానితులు ఆందోళనకు సిద్ధపడడంతో అధికారులు జిల్లా యంత్రాంగంతో మాట్లాడి అత్యవసరంగా 200 కిట్లను వానపల్లి, అవిడి పీహెచ్‌సీలకు పంపించారు. ఆయా పీహెచ్‌సీల పరిధిలో బాధితులు అక్కడకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఈ మొత్తం వ్యవహారం గందరగోళంగా మారింది. గడిచిన రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 2వేల కేసులు నమోదు కావడంతో పాజిటివ్‌ వచ్చిన బాధితులను ఆసుపత్రులకు తరలించే ప్రక్రియ ఇబ్బందికరంగా మారడంతోపాటు బెడ్స్‌ కొరత, ఇతర సౌకర్యాల లేమితో బాధితుల తరలింపులో తీవ్ర జాప్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించడంతో కొవిడ్‌ పరీక్షల నిర్వహ ణకు అవకాశం లేదు. దాంతో శని, ఆదివారాల్లో కొవిడ్‌ పరీక్షలు నిలిపివేసి సోమవారం నుంచి వీటిని చేపట్టే అవకాశం ఉందని వైద్యశాఖ సిబ్బంది చెబుతున్నారు. అయితే అత్యవసర కాంటాక్ట్‌ కేసులకు మాత్రం ఆయా పీహెచ్‌సీల పరిధిలో మిగిలిన కిట్లతో పరీక్షలు చేసేందుకు సిబ్బంది సన్నద్ధమవుతున్నారు.


మొత్తం మీద జిల్లాలో కరోనా పరీక్షలకు సంబంధించి కిట్ల కొరత సైతం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు కరోనా బాధితులు పరీక్షల కోసం అధికారులపై ఒత్తిడి తేవడంతో కొన్నిచోట్ల ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంటోంది.

Updated Date - 2020-07-19T10:38:42+05:30 IST