మేల్కోకపోతే ముప్పే.. తూర్పు గోదావరి జిల్లాలో 23 ప్రమాదకర పరిశ్రమలు
ABN , First Publish Date - 2020-05-09T18:18:25+05:30 IST
విశాఖ గ్యాస్ దుర్ఘటన తర్వాత జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇక్కడున్న పారి శ్రామికవాడల్లో అతిపెద్ద కర్మాగారాలు, ఇతర పరిశ్రమల సమీపంలో ఉంటున్న కాలనీల వాసులు బెంబేతెత్తితున్నారు. ఈ క్రమంలో యాజమాన్యాలు మేల్కొనక పోతే తమకు కూడా ముప్పు తప్పదని కంగారు పడుతున్నారు.
వీటిలో టాక్సిస్ వాయువుల అధిక వినియోగం
మరికొన్ని పరిశ్రమల్లో హజార్డ్ రసాయనాల సంయోగం
ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల శీతలీకరణలో అమ్మోనియం వాడకం
వాయువు నిక్షిప్తం చేసిన స్టోరేజీ ట్యాంకుల భద్రతపై అనుమానాలు
విశాఖ గుణపాఠంతో స్పందించకుంటే తప్పదు ప్రమాదం
(ఆంధ్రజ్యోతి- కాకినాడ): విశాఖ గ్యాస్ దుర్ఘటన తర్వాత జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇక్కడున్న పారి శ్రామికవాడల్లో అతిపెద్ద కర్మాగారాలు, ఇతర పరిశ్రమల సమీపంలో ఉంటున్న కాలనీల వాసులు బెంబేతెత్తితున్నారు. ఈ క్రమంలో యాజమాన్యాలు మేల్కొనక పోతే తమకు కూడా ముప్పు తప్పదని కంగారు పడుతున్నారు. జిల్లాలో వేలాది పరిశ్రమలు ఉండగా, అందులో 23 వరకు అతి ప్రమాదకర పరిశ్రమలున్నాయి. కానీ ఇక్కడ పర్యవేక్షణకు పరిశ్రమల శాఖకు రెగ్యులర్ జిల్లా అధికారి లేరు. ఆర్నెళ్ల నుంచి విశాఖ జిల్లాలో పనిచేస్తున్న జాయింట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివశంకర్‌రెడ్డి ఇన్చార్జ్జి. విశాఖ జిల్లా తర్వాత ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. 2010 నుంచి ఇక్కడ తీరంలో పలు రకాల నూనె శుద్ధి కర్మాగారాలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. అలాగే రసాయన పరిశ్రమలు వచ్చాయి. వీటిలో టాక్సిస్ (విష) వాయువుల వినియోగం ఎక్కువ. మరికొన్ని ఫ్యాక్టరీల్లో హజార్డ్ (ప్రమాద) రసాయనాల సంయోగం జరు గుతుంటుంది. ఈ రెండు ప్రక్రియలు జరగకపోతే ఉత్పత్తులు బయటకు రాలేని పరిస్థితి. అలాగే జిల్లాలో అనేక ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. చెరువుల నుంచి తెచ్చిన వివిధ సైజుల రొయ్యలు విదేశాలకు ఎగుమతి చేసే విషయంలో వీటిని శుద్ధి చేయడం, తర్వాత శీతలీకరణ చేసే విషయంలో యాజమాన్యాలు అమ్మోనియం గ్యాస్ వాడతారు.
వేసవిలో అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో వాయువు, రసాయనం నిక్షిప్తం చేసిన స్టోరేజీ ట్యాంకుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై పర్యవేక్షణకు పూర్తిస్థాయి ఉన్నతాధికారి లేరు. దీంతో రక్షణ చర్యల్లో పలు యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. విశాఖ గుణపాఠంతోనైనా వెంటనే ఆయా పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. విశాఖ జిల్లాలో సంభవించిన ప్రమాదం స్టైరీన్ గ్యాస్ లీకేజీ వల్ల జరిగింది. నిజానికి పెద్ద ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ప్రమా దకరమైన గ్యాస్, రసాయనాలను మన జిల్లాలోని పలు పరిశ్రమల్లో వాడుతు న్నారు. ఇక జిల్లాలో రసాయన, ఎరువుల మందులు తయారు చేసే పరిశ్రమల్లో రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. 2018 లో కాకినాడలో ఒక ఎరువుల ఫ్యాక్టరీలో ఓ కార్మికుడు గ్యాస్ లీకేజీ వల్ల మరణించాడు. బయటకు రాని మరణాలు ఎన్నో ఉన్నాయి. విషయాన్ని సదరు యాజమాన్యాలు గుట్టుచప్పుడు కాకుండా బుట్టదాఖలు చేసి మృతుల కుటుంబీకులతో సెటిల్ చేసుకున్న దాఖలాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో పారిశ్రామికీకరణ శరవేగంగా దూసుకెళుతోంది. భారీ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు 2,500 వరకు ఉన్నాయి. సహజ నిక్షేపాలను వెలికితీస్తున్న ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థ లు, చమురుశుద్ధి కర్మాగారాలున్నాయి. వీటిలో ప్రత్యక్ష, పరోక్షంగా సుమారు 3.60 లక్షల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. ప్రతీ కంపెనీలో కార్మి కులు వారు చేసే పనిని బట్టి సేఫ్టీ దుస్తులు, ముక్కుకు మాస్క్, కళ్లకు అద్దాలు, చేతులకు గ్లౌజులు, తలకు హెల్మెట్, కాళ్లకు బూట్లు ధరించాలి. కానీ ఏ కర్మాగారంలోనూ పూర్తిస్థాయిలో ఈ నిబంధన అమలవ్వడం లేదు. దీంతో అనుకోని సంఘటనల్లో కార్మికులు విగతజీవులవుతున్నారు.
ఎక్కడ ప్రమాదాలెక్కువ..
తూర్పు గోదావరి జిల్లాలో 23 పరిశ్రమల్లో ప్రమాదకర టాక్సిక్ గ్యాస్ అర్‌సెంటిక్ పెంటా ఫ్లూరైడ్, అర్‌సైన్, బిస్, బోరాన్, బోరాన్ ట్రైక్లోరైడ్, బోరాన్ ట్రై క్లోరైడ్, బోరాన్ నైట్రో బ్రోమైడ్, ట్రైఫ్లోరైడ్, బ్రోమైన్, కార్బన్ మోనాక్షైడ్, క్లోరిన్... ఇలా 56 రకాలకుపైగా విష వాయువులను పరిశ్రమల్లో వాడుతున్నారు. వీటిని ఆయా పరిశ్రమల్లో ఐఎస్‌వో రక్షణ ప్రమాణాలతోనే స్టోరేజీ ట్యాంకుల్లో భద్రపరుస్తు న్నారు. అయితే ఈ టాక్సిస్‌లన్నీ అధిక పీడన సామర్థ్యం కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఈ గ్యాస్ మూడు రూపాల్లో రూపాంతరం చెందుతుంటుంది. ఒక ట్యాంక్‌లో ఘన రూపంలో ఉన్న ఒక టాక్సిన్ ను స్టోరేజీ చేసినప్పుడు ద్రవ రూపంలో మారుతుంది. అధిక పీడనంతో ఆ ట్యాంక్‌లో నిక్షిప్తంగా ఉంటుంది. అనుకోని లీకేజీతో బయటకు వస్తే ఒక కేజీ ద్రవ రూపంలో ఉన్న టాక్సిన్ వంద రెట్లు వాయు రూపంలో బయటకు వచ్చి సమీప ప్రాంతాలను విషతుల్యం చేస్తుంది. ఇప్పుడు విశాఖలో ఇదే జరిగింది. అలాగే హజార్డ్ కెమికల్స్ (ప్రమాదకర రసాయనాలు) వాడుతున్న పరి శ్రమలు, కర్మాగారాలు జిల్లాలో 700కు పైగానే ఉన్నాయి. అయితే వీటిలో ఎప్పుడూ ఎటువంటి ప్రమాదాలు సంభవించలేదు. కానీ విశాఖ సంఘటన తర్వాత ఈ యాజమాన్యాలు కూడా మేల్కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలాగే అధికారుల నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి కావాలి.