పది నెలలుగా రోడ్డుపైనే రైతు బజార్లు

ABN , First Publish Date - 2020-12-27T06:45:38+05:30 IST

కొవిడ్‌ ఉధృతి నెమ్మదించి అన్ని రకాల వ్యాపారాలు జోరుగా, రద్దీగా సాగుతున్నా రాజమహేంద్రవరంలోని రైతు బజార్లను సొంత ప్రాంగణాలకు తరలించడానికి అధికారులు ససేమిరా అంటున్నారు.

పది నెలలుగా రోడ్డుపైనే రైతు బజార్లు
క్వారీమార్కెట్‌ రైతుబజార్‌లో ఇష్టారాజ్యంగా సంచరిస్తున్న పందులు

 పందులు, పశువులతో ఇబ్బందులు 

సొంత ప్రాంగణాల్లోకి పంపించాలని రైతుల మొర

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 26 : కొవిడ్‌ ఉధృతి నెమ్మదించి అన్ని రకాల వ్యాపారాలు జోరుగా, రద్దీగా సాగుతున్నా రాజమహేంద్రవరంలోని రైతు బజార్లను సొంత ప్రాంగణాలకు తరలించడానికి అధికారులు ససేమిరా అంటున్నారు. దీంతో రైతుబజార్లలో వ్యాపారాలు సాగించే రైతులు, అధికారులు, సిబ్బంది నిత్యం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా రాజమహేంద్ర వరం సిటీలోని ఆల్కాట్‌గార్డెన్స్‌ మినహా, మిగిలిన ఆరు రైతుబజార్లను వేర్వేరు బహిరంగ ప్రదేశాల్లోకి తరలించారు. ఇది జరిగి దాదాపు పదినెలలు కావస్తోంది. అప్పటి నుంచి నేటివరకూ బయటే రైతుబజార్లు కొనసాగుతున్నాయి. ఎలాంటి సెలవులు లేకుండా ఒకపూట మా త్రం రైతుబజార్లు జరుగుతున్నాయి. నెలలు గడు స్తున్నా మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు ఈ రైతుబజార్లను మళ్లీ సొంత ప్రాంగణాల్లోకి తీసుకెళ్లే ఆలోచన చేయడంలేదు. బహిరంగ ప్రదేశాల్లోనే రైతులు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుని తమ వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో రైతులు, ఎస్టేట్‌ అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళా రైతులు మరుగు దొడ్లులేక మరిన్ని ఇక్కట్ల పాలవుతున్నారు.

పందులు, పశువులతో ఇబ్బందులు 

క్వారీమార్కెట్‌ రైతుబజార్‌ను లాలాచెరువు సమీపంలోని బహిరంగ ప్రదేశం లో నిర్వహిస్తున్నారు. ఇక్కడ పందులు, పశువులు ఇష్టారాజ్యంగా సంచరి స్తుంటాయి. బహిరంగ ప్రదేశం కావడంతో వీటిని అరికట్టే పరిస్థితి లేదు. వీఎల్‌ పురం రైతుబజార్‌ పరిస్థితి ఇలానే ఉంది. ఇక్కడా పశువులు, పందులు కామన్‌. ఇక్కడ ప్రైవేట్‌వ్యాపా రులు రైతుబజార్‌లోకి చొచ్చుకొచ్చి ఇష్టారాజ్యంగా వ్యాపారా లు చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. కిందిస్థాయి అధికారులు చెప్పినా ప్రైవేట్‌ వ్యాపారులు వినే పరిస్థితి లేదు. లూథర్‌గిరి గ్రౌండ్సులో ఏర్పాటుచేసిన నటరాజ్‌ రైతుబజార్‌లోనూ సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇక్కడ వ్యాపారులు చెట్టుకొ కరు పుట్టకొకరు అన్నచందంగా మారింది. కొందరు లూథర్‌గిరి గ్రౌండులో ఉంటే, మరికొందరు మార్కెట్‌యార్డు ప్రాంగణంలో వ్యాపారాలు చేస్తుంటారు. ఇలా బహిరంగ ప్రదేశాల్లోని రైతుబజార్ల నిర్వహణలో అనేక సమస్యలు నెలకొన్నాయి. మరోపక్క రైతుబజార్లను పర్యవేక్షించే ఎస్టేట్‌ అఽధికారులు, వాచ్‌మెన్‌లకు కనీసం కూర్చోవడానికి ఒక ఆఫీసు అంటూ లేదు. ఉన్నతాధికారులకు ఏ రోజుకారోజు రిపోర్టులు పంపడానికి ఎస్టేట్‌ అధికారులు తమ పాత కార్యాలయాల్లోనే ఎక్కువ  సమయం గడుపుతున్నారు. కరోనా ఉధృతి తగ్గడంతో అధికారులు అన్ని వ్యాపా రాలకు అనుమతులిచ్చారని, పార్కులు, సినిమాహాళ్లు తెరచుకున్నాయని కానీ తమను మాత్రం రోడ్డున వదిలేశారని రైతుబజార్‌లోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ ఇబ్బందులు పరిగణనలోకి తీసుకుని వెంటనే తమను సొంత ప్రాంగణాల్లోకి తరలించి అక్కడే వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.



Updated Date - 2020-12-27T06:45:38+05:30 IST