టీడీపీ నేతల వాహనాలపై వైసీపీ శ్రేణుల దాడికి యత్నం
ABN , First Publish Date - 2020-12-11T18:22:29+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల నుంచి
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల నుంచి ఇప్పటి వరకూ ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొందరు రెచ్చగొట్టి మరీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే గుంటూరు, విజయవాడ, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగిన విషయం విదితమే. తాజాగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట వద్ద టీడీపీ నాయకుల వాహనాలను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అంతేకాదు.. వాహనాలపై దాడికి కూడా వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి.
తంబళ్లపల్లిలో పర్యటన నిమిత్తం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, పీలేరు నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బయలుదేరారు. ముందుగానే ప్లాన్‌తో వచ్చిన వైసీపీ శ్రేణులు.. టీడీపీ నేతల వాహనాలను అడ్డుకున్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు.. టీడీపీ నేతల రెండు కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కిషోర్‌కు అడ్డుగా నిలవడంతో నేతలకు ఎవరికీ ఏమీ కాలేదు.
లోకేష్ ఫోన్..
విషయం తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. కిషోర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. వైసీపీ నేతల దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన.. వైసీపీ దాడులకు భయపడేది లేదన్నారు. ప్రజాసమస్యలపై టీడీపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత డీజీపీ గౌతమ్ సవాంగ్‌దేనని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటనపై ఇంతవరకూ వైసీపీ నేతలు కానీ.. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ ఎవరూ స్పందించలేదు.