జగన్‌ పర్యటనలో హవా అంతా ఆయనదే..!

ABN , First Publish Date - 2020-09-25T16:27:12+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బుధ, గురువారాల్లో జరిపిన తిరుమల పర్యటనలో..

జగన్‌ పర్యటనలో హవా అంతా ఆయనదే..!

చిత్తూరు, చంద్రగిరి  మినహా వైసీపీ ఎమ్మెల్యేలంతా హాజరు


తిరుపతి(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బుధ, గురువారాల్లో జరిపిన తిరుమల పర్యటనలో హవా అంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే కనిపించింది. ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి సీఎంతో కలిసే విమానంలో వచ్చారు. తిరిగి వెళ్లేవరకూ తండ్రీకొడులులిద్దరూ సీఎంకు సన్నిహితంగా కనిపించారు. జగన్‌ పర్యటనలో చిత్తూరు ఎంపీ, చిత్తూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు మినహా వైసీపీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ సందర్భంలోనూ, కర్ణాటక సత్రాలకు భూమిపూజ చేసే కార్యక్రమంలోనూ,  సుందరకాండ పారాయణం సందర్భంలోనూ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌లే సీఎం వెంట ప్రధానంగా వున్నారు.


పట్టువస్త్రాల సమర్పణ సందర్భంలోనూ, గురువారం ఉదయం తిరిగి శ్రీవారిని దర్శించుకున్న సమయంలోనూ సీఎం జగన్‌ శ్రీవారి ఆలయంలో మంత్రి పెద్దిరెడ్డితో మాత్రమే మాటామంతీ సాగించారు. ఇతరులతో కేవలం పలకరింపు చిరునవ్వులతోనే సరిపెట్టారు. సీఎం బస చేసిన పద్మావతీ అతిధి గృహంలోకి జిల్లాకు చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్యులు వెళ్ళినా జగన్‌ గదిలోకి పెద్దిరెడ్డి, మిధున్‌లకు మాత్రమే ప్రవేశం దక్కింది. మిగిలిన వారు బయటే గడిపారు. కర్ణాటక సీఎం యడియూరప్పను కలిసేందుకు జగన్‌ శ్రీకృష్ణ గెస్ట్‌ హౌస్‌కు వెళ్ళినపుడు కూడా ఆయన వెంట పెద్దిరెడ్డి, మిధున్‌ మాత్రమే వెళ్ళారు. జగన్‌ తిరుగు ప్రయాణంలోనూ విమానంలో వెంట మిధున్‌  వెళ్ళారు.


చిత్తూరు ఎంపీ నల్లకొండక్కగారి రెడ్డెప్పకు కరోనా సోకడంతో ఆయన ఐసొలేషన్‌లో వున్నారు. అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తుమ్మలగుంట వెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కావడంతో ఆనవాయితీ ప్రకారం ఆయన గ్రామ సరిహద్దు దాటి వెలుపలికి రాలేకపోయారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇటీవలే కరోనా నుంచీ కోలుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన ఇంటిపట్టునే ఐసొలేషన్‌లో వున్నారు. ఈ కారణాలతో వీరు సీఎం పర్యటనకు హాజరు కాలేదు.


మంత్రి కుర్చీలో, ఉపముఖ్యమంత్రి నిలబడి

విమానాశ్రయంలో సీఎంకు స్వాగతం పలకడం నుంచీ తిరుగు ప్రయాణం వరకూ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి కూడా సీఎం వెన్నంటే ఉన్నా అంత ప్రాధాన్యం కనిపించలేదు. కర్ణాటక సత్రాలకు శంకుస్థాపన సందర్భంలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ జరుగుతుండగా సీఎంల పక్కనే టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడి, మంత్రి పెద్దిరెడ్డి ఆశీనులయ్యారు.  వారి వెనుక డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇతరులతో కలిసి చేతులు కట్టుకుని నిలుచుని వుండడం కనిపించింది. నాదనీరాజనం వేదికపై కూడా  పెద్దిరెడ్డి తర్వాత స్థానమే ఆయనకు దక్కింది. ఇక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ సందర్భంలో నూ, గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న సమయంలోనూ సీఎంతో పాటే పాల్గొన్నారు. కర్ణాటక సత్రాలకు భూమిపూజ, నాదనీరాజ నం వేదికపై మాత్రం కనిపించలేదు.


వారసుల హడావిడి

ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనలో చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేల వారసుల హడావిడి కొట్టొచ్చినట్టు కనిపించింది. బుధవారం విమానాశ్రయంలో జగన్‌కు చెవిరెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి తనయుడు అభినయ్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్ర స్వాగతం పలికారు. ఆయన కూడా వారిని పైన చేయివేసి ఆప్యాయంగా పలకరించారు.  అలాగే కుప్పం వైసీపీ మాజీ ఇన్‌ఛార్జి కృష్ణ చంద్రమౌళి తనయుడు భరత్‌ సైతం సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఉండడం విశేషం. తిరుమలలో కూడా మోహిత్‌రెడ్డి, అభినయ్‌రెడ్డి సీఎం వెంట అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Updated Date - 2020-09-25T16:27:12+05:30 IST