ఆ అధికారులపై ప్రైవేటు కేసులు వేస్తాం
ABN , First Publish Date - 2020-03-16T11:19:43+05:30 IST
ఆ అధికారులపై ప్రైవేటు కేసులు వేస్తాం
బెదిరించి చేసుకున్న ఏకగ్రీవాలను రద్దు చేయాలి
టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని డిమాండ్
తిరుచానూరు, మార్చి 15: ‘చంద్రగిరి నియోజకవర్గానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. అగరాల ఈశ్వర్‌రెడ్డి నుంచి గల్లా అరుణకుమారి వరకు ప్రజలకు మంచి సేవలు అందించారు. మరిప్పుడు వైసీపీ అరాచకాలకు హద్దులేకుండా పోతోంది. దీనికి స్థానిక ఎన్నికల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులు అండగా నిలిచారు. వీరిపై సాక్ష్యాల సహా ప్రైవేటు కేసులు వేస్తాం. గవర్నర్, ఎన్నికల కమిషనరుకూ ఫిర్యాదు చేస్తాం’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఆ నియోజకవర్గ సమన్వయకర్త పులివర్తి నాని ఆరోపించారు. తిరుచానూరు రఘునాథ రిసార్ట్స్‌లోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. నామినేషన్ల నుంచి ఉపసంహరణ వరకు వైసీపీ దౌర్జన్యకాండ కొనసాగించిందన్నారు. అన్ని మండలాల్లో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను చించేసి.. కొందరిని కిడ్నాప్ చేసి.. మరికొందరి ఇళ్లకు వెళ్లి బెదిరించి వైసీపీ నేతలు ఏకగ్రీవం చేసుకున్నారని ధ్వజమెత్తారు. వీటన్నింటినీ రద్దుచేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండు చేశారు. ప్రజల వద్దకు వెళ్లడానికి అధికార పార్టీకి దమ్ము లేకనే ఇన్ని ఘాతుకాలకు పాల్పడిందన్నారు. ముగ్గురు అభ్యర్థులకు తమ ఇంటల్లో రక్షణ కల్పించకుంటే కిడ్నాప్ చేసేవారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివకోటిరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, అమిలినేని మధు తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ దౌర్జన్యాలిలా..
తిరుపతి రూరల్‌లో టీడీపీ అభ్యర్థులకు తిరుచానూరు సీఐ ఫోన్లు చేసి బెదిరించారంటూ ఆ కాల్ రికార్డ్‌ను నాని వినిపించారు. ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ వేయడానికి వెళుతున్న అభ్యర్థిని నువ్వు ఏ పార్టీ, నామినేషన్ వేస్తే బాధలు పడాల్సి వస్తుందంటూ ఎంఆర్‌పల్లె సీఐ బెదిరించారన్నారు. ‘ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఉండాలి. కానీ ఒక తహసీల్దార్‌కు ఏం పని? ఆయన అభ్యర్థులను బెదిరించారుకూడా. అక్కడా సీసీ ఫుటేజీలు ఉన్నాయి. ఆయనపైనా కోర్టుకు వెళ్తాం’ అని తెలిపారు. బ్రాహ్మణపట్టుకు చెందిన గాయత్రి నామినేషన్ బయటకు వచ్చిందని, ఆమెకు ప్రతిపాదకుడిగా ఉన్న మధు సంతకాన్ని ఫోర్జరీ చేసి.. అదే ఎంపీటీసీ స్థానానికి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి నామినేషన్‌లో వాడారన్నారు. పాడిపేట, పద్మావతిపురంలోనూ ఇలాగే చేశారన్నారు. ఇందులో కీలక పాత్ర పోషించిన ఎన్నికల అధికారిపై కోర్టుకు వెళ్తామన్నారు.
పాకాల ఎంపీడీవో కార్యాలయంలో వైసీపీ నేతలు తిష్టవేసి ఎన్నికల అధికారుల ముందే టీడీపీ అభ్యర్థులను బయటికి తోసేసి, నామినేషన్లను చించేశారన్నారు.
చంద్రగిరి మండలం దోర్నకంబాల ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరపున పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి నామినేషన్ పత్రాలను అందరూ చూస్తుండగా ఆర్‌వో టేబుల్‌పై నుంచి వైసీపీ నేత చంద్రమౌళిరెడ్డి ఎత్తుకెళ్లిపోయారన్నారు. అక్కడున్న సీఐ రామచంద్రారెడ్డి, ఎన్నికల అధికారులు పట్టించుకోలేదన్నారు. పనపాకం స్థానానికి నామినేషన్ వేసిన బాలసుబ్రహ్మణ్యంను కిడ్నాప్ ఏసినా పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే నీ కూతురిని కిడ్నాప్ చేస్తామంటూ కల్‌రోడ్‌పల్లి ఎంపీటీసీకి పోటీగా నిలిచిన మంజులను వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో బెదిరించారన్నారు. చంద్రగిరిలో బీసీ అభ్యర్థి శంకర్ భార్యను బెదిరించారని చెప్పారు.
ఎర్రావారిపాళెం ఎంపీడీవో కార్యాలయంలో ఎర్రచందనం స్మగ్లర్లు తిష్టవేసి టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని నాని ఆరోపించారు. స్థానిక పోలీసులూ తమ అభ్యర్థులను బెదిరించారన్నారు.