ఇంత బాధ్యతా రాహిత్యమా..?

ABN , First Publish Date - 2020-11-07T07:53:25+05:30 IST

జనజీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి నెమ్మదిస్తున్న తరుణాన జిల్లాలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. భారీ జనసమీకరణలతో చేపడుతున్న పార్టీ కార్యక్రమాల్లో భౌతిక దూరం ఏమాత్రం పాటించడం లేదు.

ఇంత బాధ్యతా రాహిత్యమా..?
పాదయాత్రలో పెద్దిరెడ్డి

పుంగనూరులో పెద్దిరెడ్డి పాదయాత్ర

తిరుపతిలో కరుణాకర రెడ్డి పాదయాత్ర

శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే మధు నేతృత్వంలో మానవహారం

పలమనేరులో ఎమ్మెల్యే వెంకటేగౌడ పాదయాత్ర

పాదయాత్రల్లో పాటించని భౌతిక దూరంతో

 వైరస్‌ మరోసారి విజృంభించే ప్రమాదం

 తిరుపతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):జనజీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి నెమ్మదిస్తున్న తరుణాన జిల్లాలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. భారీ జనసమీకరణలతో చేపడుతున్న పార్టీ కార్యక్రమాల్లో భౌతిక దూరం ఏమాత్రం పాటించడం లేదు. ముఖ్యమంత్రి జగన్‌ పాదయాత్ర చేపట్టి మూడేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పాదయాత్రలు చేపడుతున్నారు. పుంగనూరు, కుప్పం, పలమనేరు, చిత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతి తదితర చోట్ల శుక్రవారం భారీగా జనాన్ని సమీకరించి ప్రారంభించిన పాదయాత్రలు, ర్యాలీల్లో అడుగడుగునా కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన జరిగింది. నేతలు, అత్యధిక సంఖ్యలో జనం మాస్కులు ధరించినా కీలకమైన భౌతికదూరాన్ని పాటించడం విస్మరించారు. వేలాదిగా కిక్కిరిసిన కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం కరోనా వైరస్‌ వ్యాప్తిపరంగా ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించాయి. 


83వేలకు చేరువైన కరోనా కేసులు

జిల్లాలో గురువారం ఉదయం 9 గంటల నుంచీ శుక్రవారం ఉదయం 9 గంటల నడుమ 253మందికి కరోనా సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 82863కు చేరుకుంది. కొత్తగా గుర్తించిన కేసుల్లో తిరుపతి నగరంలో 52, చిత్తూరులో 36, తిరుపతి రూరల్‌లో 24,మదనపల్లెలో 14,   పలమనేరు, జీడీనెల్లూరు మండలాల్లో 12 వంతున, చంద్రగిరి, పీలేరు మండలాల్లో 10 వంతున నమోదయ్యాయి.  వెదురుకుప్పం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థికి శుక్రవారం కరోనా నిర్ధారణ కావడంతో తిరుపతికి తరలించారు. 

Updated Date - 2020-11-07T07:53:25+05:30 IST