మోహరించిన పార్టీలు.. ఎంపికలో అభ్యర్థులు!
ABN , First Publish Date - 2020-03-08T18:05:25+05:30 IST
జిల్లాలో ఇప్పుడందరి దృష్టీ కుప్పంపైనే ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో ఇక్కడొక్కచోటే ప్రతిపక్ష టీడీపీ నాయకుడు చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

- మొదలైన ఎన్నికల రాజకీయం
కుప్పం, మార్చి 7: జిల్లాలో ఇప్పుడందరి దృష్టీ కుప్పంపైనే ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో ఇక్కడొక్కచోటే ప్రతిపక్ష టీడీపీ నాయకుడు చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన సొంత నియోజకవర్గం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ అత్యధిక స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదల టీడీపీతో పాటు, అధికార వైసీపీలోనూ కనిపిస్తోంది. అందుకే ఇరు పార్టీల నాయకులు కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలో శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ తగ్గిపోవడం టీడీపీ శ్రేణులను బాధిస్తోంది. ఇప్పుడా లోటును పూడ్చుకోవడానికి పార్టీ ప్రణాళిక రచించే ప్రయత్నంలో పడింది. కాగా, ఎలాగైనా సరే, కుప్పం నియోజకవర్గంలో అత్యధిక స్థానాలను గెలుచుకుని జిల్లాలో ఆ పార్టీ నాయకులను తలెత్తుకోకుండా చేయాలని వైసీపీ శ్రేణులు పట్టుగా ఉన్నాయి. ఎన్నికల షెడ్యూలు వెలువడడంతో శనివారం నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల్లో హడావుడి ప్రారంభమైంది.
నియోజకవర్గంలో కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాలున్నాయి. కుప్పం జడ్పీటీసీ బీసీకి,ఎంపీపీ జనరల్ మహిళకు రిజర్వు అయింది. గుడుపల్లె జడ్పీటీసీ స్థానం బీసీకి, ఎంపీపీ జనరల్ మహిళకు, శాంతిపురం జడ్పీటీసీ బీసీకి, ఎంపీపీ జనరల్ మహిళకు, రామకుప్పం జడ్పీటీసీ జనరల్‌కు, ఎంపీపీ జనరల్ మహిళకు కేటాయించారు. ఆయా పార్టీలలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు జోరుగా సాగుతోంది. వైసీపీ అభ్యర్థుల పేర్లను దాదాపు ఖరారు చేశారు. అయితే టీడీపీలోనే ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు సాగుతున్నాయి.
బల నిరూపణలో వైసీపీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యతను అధికార పార్టీలో ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలపైన పెట్టిన విషయం తెలిసిందే. అయితే కుప్పం నియోజకవర్గంలో ఆ పార్టీకి ఎమ్మెల్యే లేరు. దీంతో అధికార పార్టీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను వ్యూహాత్మకంగా కుప్పం నియోజకవర్గంలో తిప్పుతోంది. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వంలో ఆయన దాదాపు రోజుమార్చి రోజు కుప్పం నియోజకవర్గానికి రాకపోకలు సాగిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబుమీద పోటీ చేసిన వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ అనారోగ్యం పాలవడంతో ఆయన లేని లోటు కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఇటీవల కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభకు హాజరైన చంద్రమౌళి తన వారసునిగా తన కుమారుడు భరత్‌ను ప్రకటించారు. ఇప్పుడు భరత్‌తో పాటు మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు, రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ పార్టీ కార్యక్రమాలను సమన్వయిస్తున్నారు. వీరిద్దరికీ ఎంపీ రెడ్డెప్ప పెద్దరికం వహిస్తున్నారు. ఎన్నికలు హఠాత్తుగా వచ్చి పడడంతో తిరుపతిలో శనివారం మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి కూడా భరత్, సెంథిల్ ఇద్దరూ హాజరయ్యారు. స్థానిక ఎన్నికల్లో మాజీ సీఎం సొంత నియోజకవర్గంలో బలం నిరూపించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. అందుకనుగుణంగా ఎంపీ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల పేర్లను దాదాపు ఖరారు చేశారు.
క్రమశిక్షణే టీడీపీ బలం: కుప్పం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ చూడనంతటి గడ్డు పరిస్థితులను టీడీపీ ఎదుర్కొంటోంది. శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ తగ్గడం పార్టీ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీసింది. అధికార పార్టీ పెడుతున్న కేసులు, చేస్తున్న వేధింపులు తట్టుకుంటూ కార్యకర్తలకు ధైర్యం నూరిపోసే పనిలో పార్టీ నేతలు పడ్డారు. ఇంతలో స్థానిక ఎన్నికలు వచ్చి పడడం వారిని అయో మయానికి గురిచేసే పరిణామమే. అయితే అధికార వైసీపీలో లేని క్రమశిక్షణ టీడీపీలో ఉండడంతో ఆ బలంతో ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీ సన్నద్ధమవుతోంది. అధినేత చంద్రబాబు గత నెల 24, 25 తేదీల్లో నియోజకవర్గంలో జరిపిన ప్రజా చైతన్య యాత్రలు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపాయి. అయితే అభ్యర్థుల ఎంపిక అంత ఆషామాషీగా కుదరడంలేదు. ప్రతిపక్షంలో ఉండడంతో అవతలి పార్టీ కక్షపూరిత చర్యలు అడ్డుకోవాల్సిన గడ్డు పరిస్థితులు ఇప్పుడున్నాయి. రేపు గెలిచిన తర్వాత కూడా ధైర్యంగా అధికార పార్టీకి ఎదురు నిలబడగలిగే అభ్యర్థుల కోసం టీడీపీలో మల్లగుల్లాలు సాగున్నాయి. శనివారం కూడా కుప్పం, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి పీఎస్.మునిరత్నం, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ అంతర్గత సమావేశాలు జరిగాయి. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువును నిలబెట్టుకవడానికి టీడీపీ తాపత్రయ పడుతోంది.