సహకరిస్తే సరే.. లేకుంటే బదిలీ!

ABN , First Publish Date - 2020-09-05T16:24:09+05:30 IST

చిత్తూరు జిల్లాలో తహసీల్దార్ల నెత్తిన బదిలీల కత్తి నిరంతరం వేలాడుతోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మెలగకపోతే చాలు మరుక్షణం బదిలీ అయిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాయకులకు జీ..హుజూర్‌! అంటున్న

సహకరిస్తే సరే.. లేకుంటే బదిలీ!

చిత్తూరు జిల్లాలో వివాదాస్పదం అవుతున్న తహసీల్దార్ల బదిలీలు


చిత్తూరు, ఆంధ్రజ్యోతి: చిత్తూరు జిల్లాలో తహసీల్దార్ల నెత్తిన బదిలీల కత్తి నిరంతరం వేలాడుతోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మెలగకపోతే చాలు మరుక్షణం బదిలీ అయిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాయకులకు జీ..హుజూర్‌! అంటున్న అధికారుల తీరు పట్ల రెవెన్యూ వర్గాల్లో నిరసనలూ వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మరే జిల్లాలో లేనంతగా చిత్తూరు జిల్లాలో తహసీల్దార్ల బదిలీలు జరుగుతున్నాయి. వాస్తవానికి  బదిలీలు చేయకూడదనే నిబంధన ఉన్నా.. పరిపాలన సౌలభ్యం కోసం అంటూ డిప్యుటేషన్‌ల మీద బదిలీ ఉత్తర్వులు కలెక్టరేట్‌ నుంచి వెలువడుతూనే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఏకంగా 43 మంది తహసీల్దార్లు బదిలీ అయ్యారు. వారిలో కొందరు ఏడాది కాలంలో నాలుగు సార్లు బదిలీ అవ్వగా.. మరికొందరు రోజుల, గంటల వ్యవధిలో బదిలీ అయిపోతున్నారు. మొత్తం 66 మండలాలు ఉండగా.. 30కిపైగా మండలాల్లో తహసీల్దార్లు డిప్యుటేషన్‌ మీద ఉన్నారు. 11 చోట్ల డిప్యూటి తహసీల్దార్లు ఇన్‌చార్జిలుగా కొనసాగుతున్నారు. రాజకీయ సిఫార్శులకు  అధికారులు తలొగ్గుతున్నారంటూ తహసీల్దార్లు లబోదిబోమంటున్నారు.


కలెక్టరేట్‌ నుంచి ఆరు నెలల కిందట ఓ తహసీల్దార్‌ను పెనుమూరు మండలానికి బదిలీ చేశారు. అయితే కేవలం మూడు గంటల్లోనే అతన్ని మళ్లీ కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. అధికార పార్టీకి, స్థానిక నాయకులకు పట్టని కులం అనే ఒకే ఒక్క కారణంగా ఈ నిర్ణయం జరిగినట్టు విమర్శలు ఉన్నాయి. ఇటీవల అతన్ని మళ్లీ జీడీనెల్లూరులోని ఓ మండలానికి మార్చారు.  ఈ మధ్యకాలంలో అతన్ని నాలుగుసార్లు బదిలీ చేశారు.


కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ తహసీల్దార్‌ రామసముద్రం మండలానికి వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ ఐరాలకు బదిలీ చేశారు. అక్కడా కుదురుగా ఉండనివ్వలేదు. కలెక్టరేట్‌కు మార్చారు.ప్రస్తుతం పలమనేరు నియో జకవర్గంలోని ఓ మండల తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. అంటే ఈయన కూడా ఏడాది కాలంలో నాలుగు ప్రాంతాల్లో పనిచేశారు. ఆయన వెళ్ళిన నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులకు నచ్చకపోవడమే కారణం అని చెప్పుకుంటున్నారు. 


కాణిపాకం ఆలయానికి భూమిని ఇచ్చి నష్టపరిహారం కూడా పొందిన ఒక వ్యక్తికి అదే భూమి మీద మళ్లీ పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలంటూ పూతలపట్టు నియోజకవర్గంలోని ఒక  తహసీల్దార్‌ మీద  ఒత్తిడి తెచ్చారని, మాట వినకపోవడంతో బదిలీ చేశారని ప్రచారం. ఆ తర్వాత వచ్చిన తహసీల్దారు కూడా ఇదే దారిలో బదిలీ అయ్యారు. ప్రస్తుతం మూడో వ్యక్తి పనిచేస్తున్నారు. అడ్డగోలుగా పాసు పుస్తకం ఇచ్చేస్తే తమ ఉద్యోగానికే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు భయపడుతున్నారు. అయినా నాయకులు మాత్రం ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. వినకపోతే బదిలీ చేయిస్తున్నారని విమర్శలున్నాయి. 


చంద్రగిరి నియోజవకర్గంలోని ఓ మండల తహసీల్దార్‌కు డిప్యూటి కలెక్టర్‌గా పదోన్నతి లభించినా బదిలీ కాలేదు. ఈయనతో పాటు పదోన్నతి లభించిన మిగతా ఐదుగురు బదిలీ అయిపోయారు. వారిలో ఒకరు మళ్లీ స్థానిక ఎమ్మెల్యేకు ఓఎ్‌సడీగా వచ్చేశారు. ఈయనను అక్కడి నుంచీ కదలకుండా ఉంచడానికి ఏకంగా ఆ పోస్టునే డిప్యూటీ కలెక్టర్‌ హోదాకు మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు.


కుప్పం నియోజకవర్గంలో నాలుగు, పలమనేరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో తహసీల్దార్‌లంతా డిప్యుటేషన్‌పైనే పని చేస్తున్నారు.


పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు మినహా మిగిలిన సదుం, సోమల, రొంపిచెర్ల, పులిచెర్ల, చౌడేపల్లె మండలాల్లో డిప్యూటి తహసీల్దార్‌లు ఇన్‌చార్జిలుగా పనిచేస్తున్నారు.


జిల్లాలో 30 మంది డిప్యూటి తహసీల్దార్లు సీనియర్‌ జాబితా ప్రకారం పదోన్నతి ప్యానెల్‌లో సిద్ధంగా ఉన్నప్పటికీ.. సీసీఎల్‌ఏ నిబంధనలతో నిమిత్తం లేకుం డా 11 చోట్ల జూనియర్‌లను ఇన్‌చార్జి తహసీల్దార్‌లుగా నియమించారు.66 మం డలాలలకు గానూ 31 మండలాల్లో తహసీల్దార్లు డిప్యుటేషన్‌ మీదే పనిచేస్తున్నారు.


సొంత నెలవులో కొలువులు 

వాస్తవానికి తహసీల్దార్‌లు సొంత జిల్లాల్లో పనిచేయకూడదు. పరిపాలన అనుకూలత కోసం పోస్టింగ్‌ ఇచ్చినా.. సీసీఎల్‌ఏ నిబంధనల మేరకు సొంత రెవెన్యూ డివిజన్‌లలో నియమించకూడదు. కానీ గుడిపాల, ఐరాల, వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌పురం, పెనుమూరు మండలాల తహసీల్దార్లు తమ సొంత రెవెన్యూ డివిజన్‌లలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా రెగ్యులర్‌గా ఇంకో చోట పనిచేస్తున్నా.. డిప్యుటేషన్‌ మీద సొంత డివిజన్‌లోని  మండలాల్లో ఉంటున్నారు. అలాగే సోమల, సదుం, పులిచెర్ల, బి.కొత్తకోట, రామసముద్రం, గంగవరం, బైరెడ్డిపల్లె, కలికిరి, వాల్మీకిపురం, రేణిగుంట, రొంపిచెర్ల, జీడీనెల్లూరు, గుర్రంకొండ మండలాల్లో డిప్యూటి తహసీల్దార్లు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2020-09-05T16:24:09+05:30 IST