పొయ్యలో వైసీపీ దౌర్జన్యకాండ
ABN , First Publish Date - 2020-12-05T06:34:28+05:30 IST
పొయ్యలో వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. జనసైనికులను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు.
తొట్టంబేడు, డిసెంబరు 4: తొట్టంబేడు మండలం పొయ్యలో వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. జనసైనికులను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. తుఫాను బాధితులను పరామర్శించడానికి...రైతులతో ముఖాముఖి నిర్వహించడానికి తలపెట్టిన పవన్ కల్యాణ్ కార్యక్రమానికి పొయ్య గ్రామాన్ని ఎంపిక చేశారు. దీంతో జనసేన పార్టీ నేతలు కొంతమంది ముందుగానే ఆ గ్రామానికి వెళ్లి బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలను పవన్‌కు తెలియజేయాలని కోరారు. ఇందుకు రైతులు కూడా అంగీకరించాక స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు అడ్డుకున్నారు. రైతులెవరూ పవన్‌కు తమ బాధలు చెప్పకూడదని హుకుం జారీ చేశారు.అంతేగాక పవన్ కోసం వచ్చిన జనసేన కార్యకర్తలను గ్రామంలోకి రానీయకుండా ద్విచక్ర వాహనాలను అడ్డుగా పెట్టారు. దీంతో జనసేన,వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.వివాదం ముదరడంతో బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. వైసీపీ నేతలు పట్టుబట్టడంతో జనసైనికులను గ్రామంలోకి రావద్దంటూ రోడ్డు మీదకు పంపారు.ఈ విషయం తెలుసుకున్న జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినుత పొయ్య వద్దకు వచ్చింది. గ్రామంలోకి వెళ్లడానికి ఆమె ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.అయితే పవన్ కల్యాణ్ వచ్చినపుడు మాత్రం వైసీపీ నేతలు ఎవరూ బయటకు రాలేదు. దీంతో ఆయన కార్యక్రమం ప్రశాంతంగా జరిగిపోయింది.వాస్తవానికి పొయ్య గ్రామం వద్దకు ఉదయం 9.30గంటలకు పవన్ రావాల్సి ఉంది. తుఫానుతో నష్టపోయిన రైతులతో ముఖాముఖి జరపాల్సి ఉంది.దెబ్బతిన్న పంటలను పరిశీలించాల్సి ఉంది. అయితే ఆయన తిరుపతిలో ఆలస్యంగా బయలుదేరారు. పొయ్య చేరుకునే సరికి మధ్యాహ్నం 12.05 గంటలైంది. వర్షం ఎక్కువ కావడంతో రైతులతో ముఖాముఖి కార్యక్రమం రద్దయింది.