ఉపాధిహామీకీ కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2020-04-07T12:06:46+05:30 IST

జిల్లాలో ఉపాధిహామీ పనులతో పొట్టపోసుకుంటున్న కూలీలపై ‘కరోనా’ దెబ్బపడింది.

ఉపాధిహామీకీ కరోనా దెబ్బ

ప్రాణభయంతో పనులకు రాని కూలీలు

భుక్తి కోసం.. తక్కువ సంఖ్యలోనే హాజరు


తిరుపతి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధిహామీ పనులతో పొట్టపోసుకుంటున్న కూలీలపై ‘కరోనా’ దెబ్బపడింది. వ్యాధి భయంతో ఈ పనులకు కూలీలు ముందుకు రాకపోవడంతో వారు వేతనాల రూపంలో పొందాల్సిన కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. కరోనా సోకుతుందనే భయంతో పనులు చేపట్టేందుకు ముందుకు రాలేక, అలాగని కుటుంబాలు గడవడానికి పనులు చేయకుండానూ వుండలేక నిరుపేద కూలీలు సతమతమై పోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అతి తక్కువ సంఖ్యలోనే  పనులకు హాజరవుతున్నారు.


పనులకు వస్తోంది 10 శాతమే!

జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన జాబ్‌ కార్డులు 4.45 లక్షలు వున్నాయి. ఈ కుటుంబాల నుంచి 6.53 లక్షల మంది కూలీలు ఈ పథకం కింద నమోదై వున్నారు. వీరిలో   ఏడాదిలో 50 రోజులకు పైగా పనులు చేపట్టే చురుకైన కూలీల సంఖ్య 3.25 లక్షలుంటుందని అంచనా. వేసవి వచ్చిందంటే ఉపాధిహామీ పథకం అమలు పతాక స్థాయికి చేరాలి. ఏప్రిల్‌, మే నెలల్లో పనులు చేసే కూలీల సంఖ్య లక్షన్నర దాటాలి. గతేడాది మార్చి నెలలో లక్ష మంది కూలీలు రోజువారీ పనులు చేయగా గత నెలలో ఆ సంఖ్య 70 వేలు దాటలేదు. ఏప్రిల్‌ వచ్చేసరికి కరోనా ఉధ్రుతి పెరగడం, లాక్‌డౌన్‌ కారణంగా ఆ సంఖ్య 18 వేలు దాటడం లేదు. గతేడాది ఇదే ఏప్రిల్‌ నెలలో రోజుకు 1.90 లక్షల మంది కూలీలు ఉపాధిహామీ పథకం కింద పనులు చేశారు.


ఇప్పుడు కూడా అంతే సంఖ్యలో కూలీలు పనులు చేపట్టాలి. వారికి వేతనాల కింద రోజుకు రూ. 4.50 కోట్లు అందాలి. నెలలో పాతిక రోజుల పాటు పనిచేస్తే వారి ఆదాయ మొత్తం రూ. 112.50 కోట్లు వుండాలి. కానీ ఇప్పుడు కరోనా భయంతో ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం రోజువారీ పనులు చేస్తున్న కూలీల సంఖ్య 18 వేలు లోపే. వారికి అందుతున్న రోజువారీ వేతనాల మొత్తం రూ. 42.66 లక్షలు మాత్రమే. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా రోజుకు 1.72 లక్షల మంది కూలీలు తమ రోజువారీ వేతనాలు రూ.4.07 కోట్ల మేరకు నష్టపోతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ నెలలోనే కూలీలు సుమారు రూ. 102 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది.  గత ఏప్రిల్‌లో రోజుకు 1.90 లక్షల మంది కూలీలు పనులు చేశారు.


కానీ ఈ నెలలో తొలి నాలుగు రోజులు పనులు చేపట్టిన కూలీల సంఖ్య ఆరు వేలకు మించలేదు. ఐదారు తేదీల్లో ఆ సంఖ్య అతికష్టం మీద 17,800కు చేరుకుంది. గతేడాది ఏప్రిల్‌ నెలతో పోల్చి చూస్తే ఈ ఏడాది 1.72 లక్షల మంది కూలీలు పనులు చేపట్టకుండా ఇంటి పట్టున వుండిపోతున్నారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఇద్దరు సభ్యులు కూలి పనులకు వెళ్ళడం సర్వ సాధారణం. ఆ లెక్క ప్రకారం చూసినా 1.70 లక్షల కూలీల కుటుంబాలు ఈ నెలలోనే రూ. 10 వేలు వంతున ఆదాయం కోల్పోనున్నాయి.  



Updated Date - 2020-04-07T12:06:46+05:30 IST