ఏడాదిలో ఏం జరిగింది?.. మీ మాటలే సారూ... గాలికొదిలేశారు మీరు!

ABN , First Publish Date - 2020-05-29T19:28:42+05:30 IST

మైకు ముందుకొస్తే ఆయన ఊగిపోయేవారు. వెల్లువలా జనం కనిపించగానే మాటలు జలపాతాలయ్యేవి. అధికారంలో ఉన్నవారి మీద విమర్శలు తూటాల్లా పేలేవి. ప్రజల కష్టాలకు కన్నీళ్లు వరద కట్టేవి. తలమీద చేతులు ఆన్చి, నుదుటి మీద పెదవులద్ది నేనున్నాననే నమ్మకం కలిగించారు.

ఏడాదిలో ఏం జరిగింది?.. మీ మాటలే సారూ... గాలికొదిలేశారు మీరు!

తిరుపతి - ఆంధ్రజ్యోతి: మైకు ముందుకొస్తే ఆయన ఊగిపోయేవారు. వెల్లువలా జనం కనిపించగానే మాటలు జలపాతాలయ్యేవి. అధికారంలో ఉన్నవారి మీద విమర్శలు తూటాల్లా పేలేవి. ప్రజల కష్టాలకు కన్నీళ్లు వరద కట్టేవి. తలమీద చేతులు ఆన్చి, నుదుటి మీద పెదవులద్ది నేనున్నాననే నమ్మకం కలిగించారు. ఒకే ఒక్క ఛాన్స్‌ ఇస్తే చాలు ఆరు నెలల్లోనే అద్భుతం చేసి చూపిస్తా అన్నారు. వరాలు వానలా కురిశాయి. జనం జేజేలు పలికారు. ఊరూవాడా ఓట్లు పోటెత్తాయి. ఊహించని విజయం వరించింది. ఒకటీ..రెండూ..మూడూ.. పన్నెండు మాసాలు గడిచి పోయాయి. మరి ఈ ఏడాది కాలంలో ఏం జరిగింది? చెప్పిన మాటలకూ చేసిన చేతలకూ నడుమ ఉన్న అగాధాల సంగతేమిటి? వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న వేళ చిత్తూరు జిల్లా ప్రజలకు ఆయన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయో నిగ్గుతేల్చే కథనం ఇది...


ఎన్నికలకు ముందు ఏడాది వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో 23 రోజుల పాటూ సాగింది. 2017 డిసెంబరు 28న జిల్లాలో అడుగు పెట్టిన ఆయన 2018 జనవరి 22 వరకూ పది నియోజకవర్గాలు, 18 మండలాలు, 256 గ్రామాల మీదుగా 291 కిలోమీటర్ల పాటు  నడిచారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట జరిపిన పాదయాత్ర సందర్భంగానూ, ఆ తర్వాత మరో రెండు పర్యాయాలూ జిల్లాలో పర్యటించిన సందర్భాల్లోనూ జిల్లా ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు.


జగన్‌ హామీ(8-1-2018న పూతలపట్టులో):

జిల్లాలో మూతపడిన చిత్తూరు, గాజులమండ్యం సహకార చక్కెర ఫ్యాక్టరీలు తిరిగి తెరిపిస్తాం.


ఏడాదిలో ఏం జరిగింది?

జిల్లాలో వేలాది రైతుకుటుంబాలకు ఆలంబనగా నిలచి మూతబడిన ఈ రెండు  చక్కెర ఫ్యాక్టరీలూ తుప్పుపట్టిన యంత్రాలతో, ముళ్ళకంపలు పెరిగిన ప్రాంగణాలతో ఏడాది ముందు ఎలా ఉన్నాయో, ఇప్పుడూ అలాగే ఉన్నాయి. చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ 2014 జనవరిలో మూత పడింది. అప్పటికి ఫ్యాక్టరీలో 400 మంది ఉద్యోగులు, వర్కర్లు పనిచేస్తున్నారు. వారందరికీ జీతభత్యాలు సుమారు రూ. 30 కోట్లు చెల్లించాల్సి వుంది.  రేణిగుంట మండలం గాజులమండ్యంలోని ఎస్వీ సహకార చక్కెర ఫ్యాక్టరీ 2015లో మూతపడింది. ఇందులో 300 వరకూ ఉద్యోగులు, వర్కర్లు పనిచేసేవారు. వీరికీ ఐదేళ్ళుగా జీతభత్యాలు చెల్లించడం లేదు. జగన్‌ సీఎం అయ్యాక జరిగింది ఏమిటంటే.. వీటి పునరుద్ధరణకు గల అవకాశాలను అధ్యయనం చేసేందుకు నియమించిన నిపుణుల కమిటీ  నాలుగు నెలల కిందట రెండు ఫ్యాక్టరీలనూ సందర్శించింది. నివేదికలు కూడా  ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఇది తప్ప ఏడాదిలో మరెలాంటి పురోగతీ లేదు.


జగన్‌ హామీ (6-1-2018న కల్లూరులో):

యుద్ధ ప్రాతిపదికన గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు పనులు పూర్తి చేసి జిల్లాను కరువు నుంచీ శాశ్వతంగా కాపాడుతా. జిల్లాలోని చెరువులకు నీరిచ్చి సస్యశ్యామలం చేస్తా.


ఏడాదిలో ఏం జరిగింది?

ఈ పథకం పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. జిల్లా ప్రజలు ఎంతో ఆశగా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఈ పథకం 1988లో ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉండగా మొదలైంది. ఆ తర్వాత కదలిక లేదు. 2005లో వైఎస్‌  రాజశేఖరరెడ్డి సీఎంగా వుండగా మళ్ళీ కదలిక వచ్చింది. జిల్లాలో తిరుపతి, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, కేవీబీపురం, పిచ్చాటూ రు, నాగలాపురం, నిండ్ర, విజయ పురం, వడమాలపేట, రామచంద్రా పురం, పుత్తూరు, నారాయణవనం, నగరి తదితర 14 మండలాల్లో 1.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 5 లక్షల జనాభాకు తాగునీరు అందించేలా పథకంలో పలు మార్పులు జరిగాయి. అయితే జిల్లాలో కేవలం 17 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. కాలువ నిర్మాణంతో పాటు బాలాజీ రిజర్వాయర్‌, వేణుగోపాల సాగర్‌ వంటి రెండు ప్రధాన రిజర్వాయర్ల నిర్మాణం జరగాల్సివుంది. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక 2019-20 బడ్జెట్‌లో ఈ కాలువ పనులకు రూ. 391.01 కోట్లు కేటాయించినా,   కడప జిల్లాలో జరుగుతున్న పనులకే ఈ నిధులన్నీ ఖర్చు చేసినట్టు సమాచారం. జిల్లాలో అయితే గతేడాది మే తర్వాత ఈ పథకం పనుల్లో ఎటువంటి ముందడుగూ పడలేదు.


జగన్‌ హామీ (21-1-2018న శ్రీకాళహస్తిలో)

సోమశిల-స్వర్ణముఖి పనులు పూర్తి చేయిస్తా


ఏడాదిలో ఏం జరిగింది?

2019 మే తర్వాత సోమశిల-స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ పథకం పనుల్లో ఎలాంటి పురోగతీ లేదు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి వున్నాయి. మూడు ప్యాకేజీలుగా విభజతమైన ఈ పథకంలో తొలి రెండు ప్యాకేజీలూ నెల్లూరు జిల్లా పరిధిలోకి, చివరి ప్యాకేజీ చిత్తూరు జిల్లా పరిధిలోకీ వస్తాయి. శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లోని 24 వేల ఎకరాలకు సాగునీరందించే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం పనులు గత ఎన్నికల నాటికే జిల్లాలో  90 శాతం పూర్తయ్యాయి. కేవలం పది శాతం పనులు మాత్రమే పెండింగ్‌ వున్నాయి. ఏర్పేడు మండలం నుంచీ శ్రీకాళహస్తి మండలం తొండమనాడు వద్ద స్వర్ణముఖీ నది వరకూ  2.50 కిలోమీటర్ల మేరకు  కాలువ నిర్మించాలి. 48 చెరువులకు కాలువను అనుసంధానించే పనులు కూడా పెండింగులో వున్నాయి.  2019-20 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 42 కోట్ల నిధులు కేటాయించినా ఒక్క అడుగూ ముందుకు కదల్లేదు. 


జగన్‌ హామీ (6-1-2018న సదుంలో)

సదుంలో 50 పడకల  ఆస్పత్రి భవనం నిర్మిస్తాం.


ఏడాదిలో ఏం జరిగింది?

50 పడకలకు స్థాయికి పెంచుతూ, కొత్త భవనాలకు ప్రతిపాదనలు వెళ్ళినా, ఆమోదం రాలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలం ఇది. 1931లో బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్మించిన భవనంలోనే 30 పడకలతో ఆసుపత్రి కొనసాగుతోంది. 


జగన్‌ హామీ (16-1-2018న వడమాలపేటలో)

మూతపడిన విజయ సహకార డైరీని తెరిపిస్తాం..


ఏడాదిలో ఏం జరిగింది?

అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంతవరకూ దీనిపై ప్రభుత్వంలో ఏ కదలికా లేదు. చిత్తూరు కేంద్రంగా 1969లో ఏర్పాటైన విజయా సహకార డెయిరీ పాల సేకరణలో దేశంలోనే రెండవ స్థానంలో వుండేది. నష్టాల బారిన పడి 2002లో మూతపడింది. మూతపడే సమయానికి ఫ్యాక్టరీలో 680 మంది ఉద్యోగులు, వర్కర్లు పనిచేస్తుండగా 70 వేల లీటర్ల పాల సేకరణ జరిగేది.  2004-09 నడుమ తెరిపించే ప్రయత్నాలు  జరిగినా అవి సఫలీకృతం కాలేదు. ఇప్పటికీ అదే స్థితి కొనసాగుతోంది.


జగన్‌ హామీ( తంబళ్ళపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో)

చింతపండు మీద ఆధారపడ్డ వారికి మేలు జరిగేలా సమగ్ర చట్టం తీసుకువస్తాం.


ఏడాదిలో ఏం జరిగింది..?

చట్టం చేసే ప్రయత్నమే జరగలేదు. రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి చొరవ వల్ల చింతపండుపై 5శాతం జీఎస్టీ మాత్రం రద్దు అయింది.


జగన్‌ హామీ ( తంబళ్ళపల్లె మండలం బోరెడ్డి గారి పల్లెలో)

జిల్లాలో పశ్చిమాన టమోటా రైతులను ఆదుకునేందుకు పల్ప్‌ యూనిట్లు ఏర్పాట్లు చేయడంతో పాటు గిట్టుబాటు ధర లభించేదాకా వాటిని నిల్వ వుంచుకునేందుకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తాం.


ఏడాదిలో ఏం జరిగింది?

పల్ప్‌యూనిట్‌ ఒక్కటి కూడా జిల్లాలో ఏర్పడలేదు. ఏడాది పాలనపై సమీక్ష సమావేశంలో కూడా పల్ప్‌యూనిట్‌ ప్రస్తావన మళ్ళీ వచ్చింది. ఈ ఏడాది కూడా టమేటా రైతులు దారుణంగా చితికిపోయారు. శీతల గిడ్డంగుల వసతి కూడా నీటిమూటగానే మిగిలిపోయింది. ’


జగన్‌ హామీ ( 11-1-2018 వెదురుకుప్పంలో)

దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తాం.


ఏడాదిలో ఏం జరిగింది?

పదిరోజుల్లో విద్యుత్‌ కనెక్షన్‌ అనే హామీ ఆచరణలో అమలే కాలేదు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ల కోసం జిల్లాలో  అసలు దరఖాస్తులే తీసుకోవ డం లేదు.లోడ్‌ లేదని, ట్రాన్స్‌ ఫార్మర్లు లేవని కారణాలు చెబుతున్నారు. లక్షకు పైగా ఖర్చయ్యే ట్రాన్స్‌ఫార్మర్‌ భారం రైతు భరించే పక్షంలో మాత్రం కనెక్షన్‌ వెంటనే ఇచ్చేస్తున్నారు. 


జగన్‌ హామీ (21-1-2018న శ్రీకాళహస్తిలో)

శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తా.


ఏడాదిలో ఏం జరిగింది?

గత ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్క కొత్త పరిశ్రమ కూడా ఈ మూడు మండలాల్లో ఏర్పాటు కాలేదు.


జగన్‌ హామీ ( 6-1-2018న కల్లూరులో)

జిల్లాలో పాడి రైతులను ఆదుకునేందుకు లీటరుకు రూ.4 వంతున సబ్సిడీ ఇస్తాం.


ఏడాదిలో ఏం జరిగింది?

ఏమీ జరగలేదు. సబ్సిడీ ఊసే లేదు. ఈ హామీ అమలై ఉంటే, జిల్లాలోని  3.5 లక్షల మంది పాడి రైతులకు రోజుకు రూ. 1.28 కోట్లు, నెలకు రూ. 38.40 కోట్లు, ఏడాదికి రూ. 460.80 కోట్లు  ప్రభుత్వం నుంచీ సబ్సిడీగా అంది ఉండేది. పాడి రైతులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసినా నిరాశే మిగిలింది. 


జగన్‌ హామీ (21-1-2018న శ్రీకాళహస్తిలో)

మన్నవరం భెల్‌-ఎన్టీపీసీ ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా కృషి చేస్తా.


ఏడాదిలో ఏం జరిగింది?

అభివృద్ధి కలలు భగ్నమైన మన్నవరం ఇప్పటికీ అదే స్థితిలోనే ఉంది. ఏడాదిలో ఒక కాయితం కూడా కదల్లేదు. 


జగన్‌ హామీ (22-1-2018న బీఎన్‌ కండ్రిగ మండలం పల్లమాలలో)

శ్రీసిటీలో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇప్పిస్తాం.


ఏడాదిలో ఏం జరిగింది?

ఏడాది ముందు ఉన్నట్టే ఉంది. అ దనంగా జిల్లా ప్రజలకు దక్కిన ఉద్యోగాలేవీ లేవు.40 శాతంకు మిం చి స్తానికులకు అవకాశాలు దక్క డం లేదు.అవీ చిన్నా చితకా ఉద్యోగాలే.


జగన్‌ హామీ (16-1-2018న వడమాలపేటలో)

నగరిలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయిస్తా.


ఏడాదిలో ఏం జరిగింది?

టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు దిశగా కనీస ప్రయత్నం కూడా జరగలేదు. ఆ ఊసెత్తిన వారే లేరు. స్థానిక ఎమ్మెల్యే రోజా ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని కలసి లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న నేత కార్మికులను ఆర్థికంగా ఆదుకోమని వినతి పత్రం ఇచ్చారు తప్పితే టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు గురించి ప్రభుత్వాన్ని అభ్యర్థించలేదు. నగరి, ఏకాంబరకుప్పం, సత్రవాడ, చింతల పట్టెడ, పుదుపేట, కేవీబీఆర్‌పేట ప్రాంతాల  చేనేత కార్మికుల కుటుంబాల ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి.

Updated Date - 2020-05-29T19:28:42+05:30 IST