ఫాసిస్టు వ్యవస్థను అడ్డుకుంటాం

ABN , First Publish Date - 2020-12-27T06:13:21+05:30 IST

‘దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ.. ఫాసిస్టు వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు. దీనికి ఎర్రజెండాతోనే అడ్డుకట్ట వేస్తాం’ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు.

ఫాసిస్టు వ్యవస్థను అడ్డుకుంటాం
సభలో ప్రసంగిస్తున్న నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ


తిరుపతి(ఆటోనగర్‌), డిసెంబరు 26: ‘దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ.. ఫాసిస్టు వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు. దీనికి ఎర్రజెండాతోనే అడ్డుకట్ట వేస్తాం’ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. తిరుపతిలో జరుగుతున్న సీపీఐ 95వ వార్షికోత్సవంలో ఆయన శనివారం పాల్గొన్నారు. బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కువద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి సీపీఐ కార్యాలయం వరకు జనసేవాదళ్‌ కార్యకర్తలు నిర్వహించిన కవాతులో పాల్గొన్నారు. తర్వాత ప్రజా ఉద్యమాల్లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో నారాయణ మాట్లాడుతూ.. రైతాంగాన్ని బానిసలుగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ చట్టాలు అమలైతే తిండిగింజలను గిడ్డంగుల్లో దాచి, కృత్రిమ కొరత సృష్టించి జనానికి అధిక ధరలకు కార్పొరేట్లు విక్రయించే ప్రమాదం ఉందన్నారు. రూ.10లక్షల కోట్లు దోచేసిన కార్పొరేట్లు విదేశాల్లో తలదాచుకుంటే మోదీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. కొవిడ్‌ కాలంలోనూ ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఈ సమయంలోనూ కార్పొరేట్లకు దోచిపెట్టడానికే మోదీ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. మోదీ విధానాలను చంద్రబాబు వ్యతిరేకించక పోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ప్రత్యక్ష ఆందోళనకు రావాలని కోరారు. ఇక తండ్రి ఆశయాలను పెడచెవిన పెట్టి.జ మోదీకి సీఎం జగన్‌ గులాంగిరి చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఉచిత్‌ విద్యుత్‌కు మంగళం పాడడానికి వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించడానికి శ్రీకారం చుట్టారని, దీనిని రైతులు అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.  ‘జమిలి’కీ కాకుండా దామాషా ఎన్నికలకు మోదీ సిద్ధంకావాలన్నారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు హరినాథరెడ్డి, జిల్లా కార్యదర్శి రామానాయుడు ప్రసంగించగా.. ప్రజానాట్య మండలి కళాకారులు గుర్రప్ప, సుబ్రహ్మణ్యం ప్రదర్శన ఆకట్టుకుంది. నాయకులు జనార్దన్‌, పెంచలయ్య, మురళి, రామచంద్రయ్య, విశ్వనాథ్‌, జయలక్ష్మి, నదియ, మంజుల రాధాకృష్ణ, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2020-12-27T06:13:21+05:30 IST