కరువు నేలకు జలకళ

ABN , First Publish Date - 2020-09-17T11:43:39+05:30 IST

తంబళ్లపల్లె మండలంలోని పెద్దేరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 560 ఎంసీఎ్‌ఫటీలు. ఈ జలాశయ పరిధిలోని తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల్లో 4,300 ఎకరాల ఆయకట్టు ఉంది. నెలరోజులుగా కురుస్తున్న వర్షాలకు

కరువు నేలకు జలకళ

పూర్తిస్థాయిలో నిండిన పెద్దేరు ప్రాజెక్టు 

వారంరోజుల్లో కుడి, ఎడమ కాలువల మరమ్మతులు పూర్తి 

తంబళ్లపల్లె, పెద్దమండ్యం ఆయకట్టు రైతుల్లో ఆనందం


కరువు నేలను గంగమ్మ కరుణించింది. వరుణుడి దయతో తంబళ్లపల్లె మండలం కొటాల సమీపంలోని పెద్దేరు, పరసతోపు సమీపంలోని చిన్నేరు ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయి. జలాశయాలు, చెరువులు, కుంటల మొరవలు ప్రవహిస్తున్నాయి. పదోసారి పెద్దేరు ప్రాజెక్టు నిండడంతో తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల పరిధిలోని ఆయకట్టు రైతుల మోముల్లో ఆనందం నిండింది. 


తంబళ్లపల్లె, సెప్టెంబరు 16: తంబళ్లపల్లె మండలంలోని పెద్దేరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 560 ఎంసీఎ్‌ఫటీలు. ఈ జలాశయ పరిధిలోని తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల్లో 4,300 ఎకరాల ఆయకట్టు ఉంది. నెలరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ ప్రాజెక్టు నిండడంతో, నీటిపారుదల శాఖ అధికారులు కుడి, ఎడమ కాలువల మరమ్మతులు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే ఇటు ఆయకట్టు, అటు తంబళ్లపల్లె మండలంలోని 9 చెరువులు, పెద్దమండ్యం మండలంలోని మూడు చెరువులకు పూర్తిస్థాయిలో నీటిని అందించవచ్చు. 


సాగుకు రైతన్నలు సిద్ధం.. 

ఈ ఏడాది ఆగస్టులోనే పెద్దేరు ప్రాజెక్టు నిండింది. ఇటీవల వర్షాలకు పూర్తిస్థాయిలో నిండడంతో తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల 4300 ఎకరాల ఆయకట్టు రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. జలాశయ కాలువల పనులు పూర్తయితే తంబళ్లపల్లె మండలం కొటాల, గోపిదిన్నె, ఆర్‌.ఎన్‌.తాండా, జుంజురపెంట, పెద్దమండ్యం మండలం మందలవారిపల్లె, బండ్రేవు, ముసలికుంట గ్రామాల పరిధిలోని రైతుల పొలాలు పచ్చటి పంటలతో కళకళలాడనున్నాయి. ఇప్పటికే పలువురు రైతులు వరి తదితర పంటలు సాగు చేస్తున్నారు. పెద్దేరు పూర్తిస్థాయిలో నిండడంతో ఏడాదిన్నర పాటు సాగునీటి సమస్య ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


పదవసారి నిండిన పెద్దేరు..

పెద్దేరు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఏటా కొద్దికొద్దిగానే నీరు చేరుతోంది. 1981 నుంచి ఇప్పటి వరకు పదిమార్లు మాత్రమే పూర్తిస్థాయిలో నిండింది. 1988-89, 1989-90, 1991-92, 1993-94, 1996-97, 2002-03, 2004-05, 2012-13, 2014-15లోనూ, ప్రస్తుత ఏడాది ఈ జలాశయం పూర్తిగా నిండింది. కాగా, పెద్దేరు ప్రాజెక్టు పరిధిలోని 4,300 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.60లక్షల నిధులతో ఈ జలాశయ కుడి, ఎడమ కాలువల మరమ్మతులు చేపట్టినట్లు ఇరిగేషన్‌ ఈఈ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాలువ వెంబడి పిచ్చిమొక్కల తొలగింపు, పూడికతీత ఇతర మరమ్మతు పనులు చేపట్టినట్లు చెప్పారు. కుడి కాలువ పనులు పూర్తికాగా, ఎడమ కాలువ పనులను వారంరోజుల్లో పూర్తి చేసి తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల ఆయకట్టుకు నీరందిస్తామని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-17T11:43:39+05:30 IST