విదేశాల నుంచి వస్తున్నవారితో గ్రామాల్లో అలజడి

ABN , First Publish Date - 2020-03-23T10:08:21+05:30 IST

జిల్లాకు చెందిన వేలాది మంది విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు సాగిస్తున్నారు. తరచూ స్వస్థలాలకు వచ్చి వెళుతుంటారు.

విదేశాల నుంచి వస్తున్నవారితో గ్రామాల్లో అలజడి

వలంటీర్ల ఆరా.. చుట్టుపక్కల వారి ఫిర్యాదులు

జిల్లాలో స్వీయ గృహ నిర్బంధంలో 777 మంది


తిరుపతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన వేలాది మంది విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు సాగిస్తున్నారు. తరచూ స్వస్థలాలకు వచ్చి వెళుతుంటారు. ఇటీవల కరోనా ప్రభావంతో ఇలాంటి వారు క్వారంటైన్‌లలో ఉండకుండా నేరుగా ఇళ్లకు వచ్చేస్తుండటంతో ఆయా గ్రామాల్లో అలజడి రేగుతోంది. వీరిపట్ల గ్రామీణులు కరోనా అనుమానంతో చూస్తున్నారు. వీరి గురించి స్థానికులే సమాచారం ఇస్తుండటం, వలంటీర్లు ఆరా తీస్తుండడంతోనూ అధికారులకు తెలుస్తోంది. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారిని ఉద్యోగులు అంబులెన్సుల్లో ఐసొలేషన్‌ వార్డులకు తరలిస్తున్నారు. ఈ పరిణామాలు గ్రామాల్లోనూ ఆందోళనకు కారణమవుతోంది. విదేశాల నుంచి వస్తున్న వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్వారంటైన్‌లో గడువు పూర్తి చేసుకున్న వారి పట్ల ఎటువంటి అనుమానం చూపాల్సిన అవసరం లేదన్న విషయాలపైనా జనానికి చైతన్యం కలిగించాల్సి ఉంది.


లేనిపక్షంలో కరోనా పట్ల జనంలో నెలకొన్న భయాందోళనలు గ్రామాల్లో అలజడికి, ఉద్రిక్తతలకు, వివాదాలకు కారణమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చే వారిని కరోనా బాధితులుగానే చూస్తున్నారు. ఖత్తర్‌నుంచి ఓ వ్యక్తి శనివారం చంద్రగిరి మండలానికి రావడంతో.. ఆగ్రామంలో ఆదివారం ఇలాంటి ఆందోళనే చోటుచేసుకుంది. జిల్లాలో ఇలాంటివి చాలా ఘటనలున్నాయి. కాగా, విదేశాల నుంచి వచ్చిన వారు.. స్థానికులు కలిపి 856 మంది కరోనా అనుమానితులు ఆసుపత్రుల్లోనూ, ఇళ్ళలోనూ వైద్యాధికారుల పరిశీలనలో వున్నారు. వీరిలో 78 మందికి 28 రోజుల గడువు పూర్తి కాగా, మిగిలిన 777 మంది ఇప్పటికీ వైద్యుల పర్యవేక్షణలోనే వున్నారు.

Updated Date - 2020-03-23T10:08:21+05:30 IST