జల‘కళ’ సంతరించుకోనున్న గ్రామాలు

ABN , First Publish Date - 2020-11-26T05:54:04+05:30 IST

చిత్తూరు జిల్లాలో జల‘కళ’ తప్పిన 197 గ్రామాలకు మోక్షం

జల‘కళ’ సంతరించుకోనున్న గ్రామాలు


ఆంధ్రజ్యోతి కథనాలకు స్పందించిన ప్రభుత్వం

భూగర్భ జలాల పునఃపరిశీలనకు నిర్ణయం

జిల్లాస్థాయిలో కమిటీ ఏర్పాటు 


కలికిరి, నవంబరు 25: జిల్లాలో జల‘కళ’ తప్పిన 197 గ్రామాలకు  మోక్షం లభించనుంది. భూగర్భ జలాలు కనిష్ఠ స్థాయికి అడుగంటిపోయిన (డార్క్‌ ఏరియా) గ్రామాలుగా ప్రభుత్వం ప్రకటించడంతో కొత్తగా బోర్లు వేయడానికి, కొత్త విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయడాన్ని నిషేధించారు. తాజాగా వైసీపీ ప్రభుత్వం అమలు చేయనున్న ‘జలకళ’ పథకం ద్వారా ఉచిత బోర్లు మంజూరుకు కూడా ఈ గ్రామాలు దూరమైపోయాయి. అయితే ఈ  గ్రామాల్లో మళ్లీ భూగర్భ జలాల మదింపు కోసం జిల్లాస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఎప్పుడో మూడేళ్ళ క్రితం భూగర్భ జల శాఖ నివేదికను కొనసాగిస్తూ రాష్ట్రంలో 1094 గ్రామాలు డార్క్‌ ఏరియాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా ఈ గ్రామాలన్నీ ప్రభుత్వ కొత్తపథకం జలకళకు దూరమైపోతున్న విషయాన్ని వెలుగులోకి తెస్తూ అక్టోబరు 15, 20 తేదీల్లో ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధాన సంచికతోపాటూ జిల్లాలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం గత నెల రోజులుగా ఈ గ్రామాల్లో భూగర్భ జలాల తాజా పరిస్థితిపై మదింపు చేయడం కోసం మల్లగుల్లాలు పడింది. దీనిపై 23 మందితో రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసి 2021 ఫిబ్రవరి 28 నాటికి పునఃపరిశీలన నివేదిక అందజేయాలంటూ నవంబరు 5న ప్రభుత్వం జీవో 57 జారీ చేసింది. రాష్ట్రకమిటీకి సహకరించేందుకు జిల్లాస్థాయిలో 14మంది అధికారులతో కమిటీలను ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.  కలెక్టరు / జాయింట్‌ కలెక్టరు అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. భూగర్భ జల శాఖ డీడీ సభ్యుడు కన్వీనరుగా వ్యవహరిస్తారు. జలవనరుల శాఖ ఎస్‌ఈ, డ్వామా పీడీ, సీపీవో, వ్యవసాయ శాఖ జేడీ, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, ఉద్యాన శాఖ డీడీ / ఏపీఎంఐపీ పీడీ, డీఎఫ్‌ఓ, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌, గ్రామీణ తాగునీటి సరఫరా ఎస్‌ఈ, మున్సిపల్‌ కమిషనర్‌, ప్రజారోగ్య శాఖ ఎస్‌ఈ, నాబార్డు ఏజీఎంలను సభ్యులుగా నియమించింది. ఈ రెండు కమిటీలు అందజేసే నివేదికల ఆధారంగా సమస్య పరిష్కారమయ్యే మార్గం సుగమమైందని భావిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల వర్షాలు కూడా ఆశాజనకంగా పడుతుండడంతో దాదాపు అన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని  భావిస్తున్నారు. 

Updated Date - 2020-11-26T05:54:04+05:30 IST