వెదురుకుప్పంలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2020-11-01T16:52:33+05:30 IST
బాల్య వివాహానికి సంబంధించిన విచారణ తీవ్రఉద్రిక్త పరిస్థితికి దారితీసిన ఉదంతమిది.వెదురుకుప్పం మండలం యనమలమంద ఎస్సీ కాలనీకి..
బాల్య వివాహంపై విచారణలో పోలీసుల దూకుడు
నిరసనగా స్టేషన్‌పై యనమలమంద దళితుల దాడి
ఫర్నిచర్ ధ్వంసం-అద్దం తగిలి ఓ యువతికి గాయాలు
ఎస్‌ఐని సస్పెండు చేయాలంటూ స్టేషన్ బయట రాస్తారోకో
బాధితులకు సీపీఐ నారాయణ సహా పలువురి పరామర్శ
వెదురుకుప్పం(చిత్తూరు): బాల్య వివాహానికి సంబంధించిన విచారణ తీవ్రఉద్రిక్త పరిస్థితికి దారితీసిన ఉదంతమిది.వెదురుకుప్పం మండలం యనమలమంద ఎస్సీ కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలికతో అదే గ్రామానికి చెందిన పుష్పరాజ్(36)కు గురువారం పచ్చికాపల్లంలో వివాహం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సి.లోకేష్ విచారణ కోసం శుక్రవారం సాయంత్రం కాలనీకి వెళ్లాడు. పెళ్లికి కారకుడిగా భావించి వధువు బంధువైన బాబు అనే వ్యక్తిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారణ సందర్భంగా అతడిపై చేయిచేసుకోవడంతో వివాదం ముదిరింది. చివరకు గ్రామ పెద్దల జోక్యంతో శుక్రవారం రాత్రి స్టేషన్ నుంచి బాబును స్వగ్రామానికి తీసుకువెళ్లారు.ఈ నేపథ్యంలో శనివారం కాలనీవాసులు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు.
కౌన్సెలింగ్ ఇవ్వకుండా బాబును ఎట్లా కొడతారని, ఎస్‌ఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.స్టేషన్‌లో చొరబడి రికార్డులను చిందర వందర చేశారు. టేబుల్‌పై వున్న అద్దాన్ని కిందపడవేసే సందర్భంలో వారి వెంట వచ్చిన మీనా అనే యువతి కాలికి గాయమైంది.అనంతరం పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ స్టేషన్ బయట దేవళంపేట రోడ్డుపై టెంట్ వేసిన కాలనీవాసులు ధర్నాకు దిగారు. పోలీసుల చేత దెబ్బలు తిన్న బాబును కొంతసేపు పోలీసుస్టేషన్ ముందు,తరువాత రోడ్డుపై ఆందోళన చేస్తున్న చోట పడుకోబెట్టారు.విచారణలో ఎస్‌ఐ చేయిచేసుకోవడంతోనే స్టేషన్ వద్ద ఆందోళనకు దిగాల్సి వచ్చిందని కాలనీవాసులు చెబుతుండగా స్టేషన్‌పై దాడి చేసిన కాలనీవాసులు విధ్వంసం సృష్టించడంతో పాటు తమ విధులకు ఆటంకం కల్గించారని ఏఎ్‌సఐ శివప్రసాద్, సిబ్బంది చెబుతున్నారు. కాలనీవాసుల రాస్తారోకో కారణంగా ఉద్రిక్తత నెలకొనడంతో డీఎస్పీ డి.మురళీధర్ ఆధ్వర్యంలో పలువురు సీఐలు,ఎస్‌ఐలు పోలీసు బలగాలతో వెదురుకుప్పం చేరుకున్నారు.
ఆందోళనకారులకు డీఎస్పీ మురళీధర్ నచ్చచెప్పి ధర్నా విరమింపజేశారు.బాబును చికిత్స నిమిత్తం పోలీసు వాహనంలో తిరుపతికి తరలించారు.తిరుపతిలో ఉన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ సమాచారం తెలుసుకుని వెదురుకుప్పం వచ్చారు.స్టేషన్ వద్ద బాధితులను పరామర్శించారు.డీఎస్పీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్‌ఐ లోకే్‌షరెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.గాయపడిన వారికి రూ.50వేలు ఇవ్వాలన్నారు.యనమలమంద ఎస్సీ కాలనీవాసులకు రక్షణ కల్పించి, వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకూడదని కోరారు.ఆయనవెంట సీపీఐ నాయకులు హరినాథరెడ్డి, రామానాయుడు, టీడీపీ జిల్లా కార్యదర్శి పి.మోహన్‌మురళి తదితరులున్నారు.జనసేన నియోజక వర్గ ఇన్‌చార్జి యుగంధర్,రిపబ్లికన్ పార్టీ నేత అంజయ్య, విశ్రాంత న్యాయమూర్తి పి.గుర్రప్ప, దళిత,ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు వెదురుకుప్పం చేరుకుని డీఎస్పీతో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండు చేశారు.
బాధ్యులపై రౌడీ షీట్లు :డీఎస్పీ
వెదురుకుప్పం స్టేషన్‌పై దాడి సంఘటన బాధ్యులపై రౌడీ షీట్లు తెరుస్తామని డీఎస్పీ డి.మురళీధర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాల్య వివాహాన్ని కప్పి పుచ్చే ప్రయత్నంలో దళితవాడవాసులు స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి, పోలీసు విధులకు ఆటంకం కలిగించినందు వల్ల చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామన్నారు. గ్రామంలో నాటు సారా తయారు చేసే వ్యక్తుల వివరాలు సేకరించి చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు రౌడీ షీట్లు తెరుస్తామన్నారు.