గరుత్మంతుడిపై గోవిందుడి కటాక్షం

ABN , First Publish Date - 2020-10-21T17:23:09+05:30 IST

తిరుమల వేంకటేశ్వర స్వామి మంగళవారం రాత్రి తన ఇష్టవాహనమైన గరుత్ముంతుడిపై కటాక్షమిచ్చారు. రంగనాయక మండపంలో..

గరుత్మంతుడిపై గోవిందుడి కటాక్షం

మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు


తిరుమల(ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వర స్వామి మంగళవారం రాత్రి తన ఇష్టవాహనమైన గరుత్ముంతుడిపై కటాక్షమిచ్చారు. రంగనాయక మండపంలో మలయప్పస్వామికి విశేష అలంకరణ చేశారు. రాత్రి 7 గంటలకు ఊరేగింపుగా తీసుకెళ్లి కల్యాణోత్సవ మండపంలో అప్పటికే సిద్ధం చేసిన గరుత్మంతుడిపై కొలువుదీర్చారు. అనంతరం వేదపారాయణం, దివ్యప్రబంధం నిర్వహించి మంగళవాయిద్యాలతో శాత్తుమొర, హారతి, నైవేద్యాలు సమర్పించారు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా,ఉదయం 9 గంటలకు కల్యాణోత్సవ మండపంలో మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై మలయప్పస్వామి దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు.చాలా రోజుల తర్వాత శ్రీవారి ఆలయం ముందు భక్తుల సందడి కనిపించింది.  దర్శన టికెట్లు బుక్‌ చేసుకుని కొండకు వచ్చిన భక్తులతో పాటు తిరుమల స్థానికులు గరుడ వాహనసేవ జరిగే సమయంలో ఆలయం ముందు కూర్చుని దేవుడిని ధ్యానించుకున్నారు. 


శ్రీవారి సేవలో హైకోర్టు సీజే

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి  మంగళవారం రాత్రి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.గరుడవాహన సేవలో  పాల్గొన్న ఆయన తర్వాత గర్భాలయం చేరుకుని మూలమూర్తిని దర్శించుకున్నారు. తొలుత తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, కలెక్టర్‌ భరత్‌గుప్తా తదితరులు స్వాగతం పలికారు. 


750 కేజీలతో పుష్పకవిమానం తయారీ

మూడేళ్లకు ఓసారి వచ్చే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా కనిపించే వాహనమైన పుష్పకవిమానాన్ని ఈ సారి 750 కేజీలతో తయారు చేస్తున్నారు. సాధారణంగా ఆలయ మాడవీధుల్లో విహరించే ఈ వాహనసేవలను వీక్షించేందుకు భక్తులు పోటీపడుతుంటారు. మూడేళ్లకు ఓసారి మాత్రమే పుష్పకవిమానం దర్శనమిస్తుంటుంది. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావంతో పుష్పకవిమానాన్ని నేరుగా చూసే అవకాశం లేకుండా పోయింది. కానీ, అదే వైభవంతో పుష్పక విమానసేవను కల్యాణోత్సవ మండపంలో నిర్వహించేందుకు అర్చకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 15 అడుగుల ఎత్తు,        14 అడుగుల వెడల్పుతో పుష్పక విమానాన్ని సిద్ధం చేస్తున్నారు. కొబ్బరిచెట్టు ఆకులతో తయారుచేసే      ఈ విమానం చుట్టూ గరుడ, హనుమ, అష్టలక్ష్ములు, ఏనుగులు, చిలుకలు, శేషమూర్తి ప్రతిమలను ఏర్పాటు చేయనున్నారు. తక్కువబరువుండే సంప్రదాయ పుష్పాలనే అలంకరణకు వినియోగించనున్నారు. దాదాపు 750 కేజీల బరువుతో తయారవుతున్న ఈ పుష్పకవిమానంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉత్సవమూర్తులు  కొలువుదీరి దర్శనమివ్వనున్నారు. 

Updated Date - 2020-10-21T17:23:09+05:30 IST