-
-
Home » Andhra Pradesh » Chittoor » TTD awareness centers on Corona
-
‘కరోనా’పై టీటీడీ అవగాహన కేంద్రాలు
ABN , First Publish Date - 2020-03-13T11:18:32+05:30 IST
తిరుమలలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాలతో పాటు అలిపిరి టోల్‌గేట్ వద్ద ప్రత్యేక అవగాహన కేంద్రాలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తాయని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

అలిపిరి, శ్రీవారిమెట్టు, టోల్‌గేట్ వద్ద నేటినుంచి అందుబాటులోకి
క్యూకాంప్లెక్సుల్లో అవగాహన లఘుచిత్రాల ప్రసారం
రూ.300 టికెట్ల భక్తులు దర్శనం వాయిదా వేసుకోవచ్చు
టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రకటన
తిరుమల, మార్చి 12: తిరుమలలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాలతో పాటు అలిపిరి టోల్‌గేట్ వద్ద ప్రత్యేక అవగాహన కేంద్రాలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తాయని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన గోకులం భవనంలో వివిధ శాఖల అధికారులతో ‘కరోనా’ నివారణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ భయాల నేపథ్యంలో తిరుమల యాత్రను రద్దు చేసుకునే వారు, వాయిదా వేసుకోవాలనుకునే భక్తుల సౌకర్యార్థం అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల రద్దుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. మే 31వ తేదీ వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, రూ.300 దర్శనం టికెట్లు, గదులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారు వాటిని రద్దు చేసుకోదలిస్తే నగదు తిరిగి చెల్లించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
అలాగే రూ.300 దర్శనం కలిగిన భక్తులు తమ దర్శన తేదీలను మార్చుకునేందుకు ఈ-మెయిల్‌కు రిక్వెస్ట్ పంపాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సమాచారం టీటీడీ కాల్‌సెంటర్ నుంచి భక్తులకు అందజేయాలని, అలాగే ఎస్వీబీసీ, బ్రాడ్‌కాస్టింగ్ విభాగాల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. కరోనా వైరస్‌పై భక్తుల్లో అవగాహన కల్పించేదిశగా చిన్నపాటి ప్రోమో తయారుచేసి వైకుంఠం క్యూకాంప్లెక్స్, ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఉన్న ప్రాంతాల్లో ప్రసారం చేయాలని అధికారులను ఆదేశించారు. వైరస్ వ్యాప్తి నివారణకు విస్తృతంగా వైద్య, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుమలలో విధులు నిర్వహించే టీటీడీ ఉద్యోగులందరికి మాస్కులు అందించాలని సంబంధిత అధికారులకు సూచన చేశారు. తిరుమలలోని రద్దీ ప్రాంతాలు, వసతి సముదాయాల వద్ద ప్రతి రెండు గంటలకు ఓ సారి శానిటైజర్లు, అంటు రోగ నివారణ మందులతో పరిసరాలను శుభ్రపరచాలన్నారు.
జలుబు, దగ్గు, జ్వరం ఉన్న భక్తులు తిరుమలలోని ప్రఽథమ చికిత్స కేంద్రాలు, అశ్విని ఆస్పత్రిల్లో సంప్రదించాలన్నారు. అంతకుముందు ఆయన అవగాహన కేంద్రాల వద్ద వైరస్‌ను గుర్తించేందుకు వినియోగించే థర్మల్‌గన్, ఇతర పరికరాలను పరిశీలించారు. సమావేశంలో ధర్మారెడ్డి మాస్కు ధరించే అధికారులతో మాట్లాడారు. ఈ సమావేశంలో టీటీడీ హెల్త్ ఆఫీసర్ ఆర్‌ఆర్ రెడ్డి, సీఎంవో డాక్టర్ నాగేశ్వరరావు, ఆలయ డిప్యూటీఈవో హరీంద్రనాఽథ్, డిప్యూటీఈవోలు బాలాజీ, దామోదరం, సెల్వం, నాగరాజు, ఎస్‌ఈ2 నాగేశ్వరరావు, ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి, వీఎస్వో మనోహర్ తదితరులు పాల్గొన్నారు.