కలిగిరి కొండ ఆలయం టీటీడీలో విలీనం

ABN , First Publish Date - 2020-12-11T06:28:53+05:30 IST

కలిగిరి కొండపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీలో విలీనం చేయడం ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి అన్నారు.

కలిగిరి కొండ ఆలయం టీటీడీలో విలీనం
ఆలయ స్వాధీన పత్రాన్ని టీటీడీ అధికారికి అందిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి

పెనుమూరు, డిసెంబరు 10: కలిగిరి కొండపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీలో విలీనం చేయడం ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి అన్నారు. దేవాలయానికి సంబంధించిన రికార్డులు, ఇతర పత్రాలను గురువారం దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ చంద్రమౌళితో కలిసి టీటీడీ డిప్యూటీ ఈవో శాంతికి అందజేశారు. శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో ఈ ఆలయాన్ని చేర్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఆలయాన్ని టీటీడీలో విలీనం చేయాలని గత ప్రభుత్వ హయాంలో చాలాసార్లు అడిగినా ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లానని, అలాగే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని ఆలయానికి ఆహ్వానించి ఇక్కడి విశిష్టతను తెలియజేశానని చెప్పారు. దాంతో విలీన ప్రక్రియ సులువైందన్నారు. ఇకపై ఆలయం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. కాగా.. గంగాధరనెల్లూరు నియోజకవర్గ ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చడానికి చామంతిపురం సమీపంలో రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నారు. త్వరలోనే టెండర్లు పూర్తిచేసి, పనులను ప్రారంభిస్తామన్నారు. టీటీడీ డిప్యూటీ ఈవో వీఆర్‌ శాంతి, వైసీపీ నాయకులు దయాసాగర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, కమలాకర్‌రెడ్డి, కామసాని విజయ్‌, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T06:28:53+05:30 IST