మల్లంగుంటలోని బ్యాంకుల్లో చోరీకియత్నం

ABN , First Publish Date - 2020-12-29T05:03:30+05:30 IST

తిరుపతి రూరల్‌ మల్లంగుంటలోని కెనరా బ్యాంకు, కో-ఆపరేటివ్‌ బ్యాంకుల్లో సోమవారం రాత్రి దుండగులు చోరీకి ప్రయత్నించారు.

మల్లంగుంటలోని బ్యాంకుల్లో చోరీకియత్నం
సహకార బ్యాంకు తలుపు గడియను వంచారిలా..

 తిరుపతి రూరల్‌, డిసెంబరు 28: తిరుపతి రూరల్‌ మల్లంగుంటలోని కెనరా బ్యాంకు, కో-ఆపరేటివ్‌ బ్యాంకుల్లో సోమవారం రాత్రి దుండగులు చోరీకి ప్రయత్నించారు. సోమవారం తెల్లవారుజామున 3- 4 గంటల మధ్య ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ రెండు బ్యాంకులు ఒకే ఆవరణలో ఉన్నాయి. ఇక్కడి సీసీ కెమెరా దిశను దుండగులు మార్చారు. కో ఆపరేటివ్‌ బ్యాంకు తలుపు గడియను విరిచే ప్రయత్నం విఫలమవడంతో అందులోకి వెళ్లలేకపోయారు. ఇక కెనరాబ్యాంకు విద్యుత్‌ సర్వీసును తొలగించారు. కిటికీ అద్దాలు పగులగొట్టి.. కమ్మీని తొలగించారు. దీని ద్వారా బ్యాంకు లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో బ్యాంకు అధికారులకు అలారం మోగడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే దుండగులు అక్కడ్నుంచి పారిపోయారు. చోరీ జరగకపోవడంతో బ్యాంకు అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఖాతాదారులు, లాకర్లు తీసుకున్నవారు బ్యాంకు వద్దకు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ఈ బ్యాంకులను క్లూస్‌టీమ్‌ అధికారులు పరిశీలించి ఆధారాలు సేకరించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్టు తిరుచానూరు సీఐ సుధాకర్‌ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-12-29T05:03:30+05:30 IST