అంతర్రాష్ట్ర మద్యం తరలింపునకు చెక్‌

ABN , First Publish Date - 2020-10-27T06:36:51+05:30 IST

కోరుకున్న బ్రాండు కోసం పక్కరాష్ర్టాల మీద ఆధారపడుతున్న మందుబాబులకు ప్రభుత్వం చెక్‌ పెట్టింది.ముందస్తు అనుమతులు లేకుండా మూడు మందు సీసాలు దగ్గరుంచుకునేందుకు వీలు కల్పిస్తున్న జీవోను సోమవారం రద్దు చేసింది.

అంతర్రాష్ట్ర మద్యం తరలింపునకు చెక్‌

కలికిరి, అక్టోబరు 26:కోరుకున్న బ్రాండు కోసం పక్కరాష్ర్టాల మీద ఆధారపడుతున్న మందుబాబులకు ప్రభుత్వం చెక్‌ పెట్టింది.ముందస్తు అనుమతులు లేకుండా మూడు మందు సీసాలు దగ్గరుంచుకునేందుకు వీలు కల్పిస్తున్న జీవోను సోమవారం రద్దు చేసింది.ఎలాంటి అనుమతులు, లైసెన్సులు అవసరం లేకుండా ఎవరైనా, ఏ సైజులోవైనా మూడు మందు సీసాలు దగ్గరుంచుకోవచ్చని గత ఏడాది సెప్టెంబరు 24న ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటితోపాటు ఆరు బీరు బాటిళ్ళు, రెండు లీటర్ల కల్లుకు కూడా ఈ అనుమతి వర్తిస్తుందని పేర్కొంది. తదనంతరం ఏ సైజులోవైనా మూడు బీరు బాటిళ్ళు మాత్రమే వుంచుకోవాలని గత అక్టోబరు 11న మరో సవరణ వుత్తర్వు జారీ చేసింది.ఈ అనుమతి జిల్లాలోని కర్ణాటక, తమిళనాడు సరిహద్దు మండలాలకు  వరప్రసాదంగా మారింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కావలసిన రకం మద్యం దొరక్కపోవడం, పేర్లు తిరగని బ్రాండ్లతోనూ, మూడింతల అధిక ధరలతోనూ సతమతమైన మద్యం ప్రియులు ఈ ఉత్తర్వుల ఆధారంగా పొరుగు రాష్ట్రాల మద్యం పై దృష్టి సారించారు. మరో వైపు సరిహద్దు రాష్ట్రాల నుంచి చౌకగా కొన్న మద్యాన్ని యథేచ్ఛగా తరలించి అంతో ఇంతో లాభార్జనకు ప్రయత్నించే వారూ తయారయ్యారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి సరుకుల రవాణా వాహనాలు కూడా ఈ మూడు సీసాల పద్ధతికి వాహకాలుగా మారాయి. దీంతో జిల్లా మొత్తం పొరుగు మద్యానికి బాగా అలవాటు పడిపోయింది. అయితే సోమవారం ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి చెప్పింది.   ఎక్సైజు చట్టం మేరకు రాష్ట్రంలో పన్నులు, డూటీ ట్యాక్సులు, రుసుములు చెల్లించని మద్యాన్ని అనుమతించకుండా కట్టడి చేసింది.అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విదేశాల నుంచి వచ్చే వారు తీసుకొచ్చే రెండు లీటర్ల మద్యాన్ని మాత్రం ఇందులో నుంచి మినహాయించింది

Updated Date - 2020-10-27T06:36:51+05:30 IST