-
-
Home » Andhra Pradesh » Chittoor » tpt news
-
‘కారుణ్య’ నియామకాలపై విచారణ
ABN , First Publish Date - 2020-10-07T11:25:48+05:30 IST
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన కారుణ్య నియామకాలపైన విచారణ జరపాలని ఎస్వీయూ పాలకమండలి నిర్ణయించింది.

బీటెక్ అడ్మిషన్లలో ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు అవకాశం
ఎస్వీయూ పాలకమండలిలో చర్చ
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), అక్టోబరు 6: గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన కారుణ్య నియామకాలపైన విచారణ జరపాలని ఎస్వీయూ పాలకమండలి నిర్ణయించింది. అలాగే, గతంలో ఉన్న ఓ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ వ్యవహారంపై విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఎస్వీయూ పాలకమండలి సమావేశం ఆన్‌లైన్ ద్వారా మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల దాకా కొనసాగింది. అమరావతి నుంచి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, రాష్ట్ర కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనరు కె.నాయక్ పాల్గొన్నారు.
తిరుపతి నుంచి రెక్టార్ సుందరవల్లి, రిజిస్ట్రార్ శ్రీధర్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు సావిత్రమ్మ, మాధవి, మధు, ద్వారకనాథరెడ్డి, భాస్కర్‌రెడ్డి (ప్రిన్సిపాల్, నగరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ), పరమగీతం, హనుమంతరావు, బెనజీర్ షేక్ హాజరయ్యారు. సుమారు 40 అంశాలపై చర్చ సాగినట్టు సమాచారం. వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో బ్రాంచ్‌కు ముగ్గురు చొప్పున ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలని తీర్మానించారు. ఎస్వీయూ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ వరదరాజన్‌కు ఎలాంటి ఉన్నత పదవులు అప్పగించకూడదని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఈసీ సభ్యురాలు అపర్ణ గైర్హాజరయ్యారు. బోధన, పరిశోధన రంగాల్లో ప్రమాణాలను మరింతగా పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ కోరారు.