బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణానికి సహకరిస్తాం

ABN , First Publish Date - 2020-10-04T08:41:42+05:30 IST

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో వారి నీటి అవసరాల కోసం బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణానికి సహకరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు.

బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణానికి సహకరిస్తాం

 కేంద్రమంత్రి షెకావత్‌ 


తిరుమల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో వారి నీటి అవసరాల కోసం బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణానికి సహకరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డితో కలిసి తిరుమలలోని పాపవినాశనం డ్యామ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపితే పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రతి ఇంటికీ తాగునీరు అందించే ప్రాజెక్ట్‌ కింద నిధులు అందించడానికి ప్రయత్నిస్తామన్నారు.


మంత్రి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. తిరుమలలో తాగునీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంయుక్తంగా బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు. దీనికి కేంద్రం తరఫున సహకరిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్టు చెప్పారు. అంతకుముందు ఉదయం వైవేద్య విరామ సమయంలో    శ్రీవేంకటేశ్వరస్వామిని షెకావత్‌ దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ఽధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా ఆయనకు స్వాగతం పలికి దర్శనం చేయించారు.

Updated Date - 2020-10-04T08:41:42+05:30 IST