ప్రైవేట్‌ చేతికి టూరిజం హోటల్‌

ABN , First Publish Date - 2020-12-05T06:35:40+05:30 IST

తిరుపతి నగరం రుయాస్పత్రికి ఎదురుగా ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటీడీసీ) చేపట్టిన 103 గదుల హరిత హోటల్‌ ప్రాజెక్ట్‌ హైదరాబాద్‌కు చెందిన చంద్రహాస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ చేజిక్కించుకుంది.

ప్రైవేట్‌ చేతికి టూరిజం హోటల్‌

నెలకు రూ.12లక్షల అద్దెతో చేజిక్కించుకున్న చంద్రహాస్‌


తిరుపతి, ఆంధ్రజ్యోతి: తిరుపతి నగరం రుయాస్పత్రికి ఎదురుగా ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటీడీసీ) చేపట్టిన 103 గదుల హరిత హోటల్‌ ప్రాజెక్ట్‌ హైదరాబాద్‌కు చెందిన చంద్రహాస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ చేజిక్కించుకుంది. తిరుపతిలో ఓ స్టార్‌ హోటల్‌ కట్టాలని ఏపీటీడీసీ నిర్ణయించింది. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తిరుమలకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని రూ.17కోట్లతో హరిత హోటల్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇందులో రూ.7కోట్లను విడుదల చేయడంతో నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. 1.03 ఎకరాల విస్తీర్ణంలో తొలిదశలోనే భవన నిర్మాణపు సివిల్‌ వర్క్‌ దాదాపు పూర్తయిపోయింది. ఇంతలో అధికారుల అలసత్వమో, రాజకీయ కారణమో తెలియదుకానీ హరిత హోటల్‌ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక  ప్రైవేట్‌ వ్యక్తుల నిర్వహణకు ఇవ్వాలని ఆగస్టు 27న ఈ-టెండర్‌ నిర్వహించింది. హైదరాబాద్‌కు చెందిన చంద్రహాస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఏడాదికి రూ1.53కోట్లతో టెండర్‌ దక్కించుకుంది. ఏడాదికి 5 శాతం పెంచుకుంటూ 33 ఏళ్లపాటు హోటల్‌ నిర్వహించుకోవచ్చని గతనెల 24న చంద్రహాస్‌కు ఏపీటీడీసీ లేఖ రాసింది. 


ప్రైవేట్‌ పరంపై విమర్శలు

అలిపిరి సమీపంలోని విశాలమైన స్థలంలో హరిత హోటల్‌ కోసం నిర్మించిన 5 అంతస్థుల భవనంలో 103 గదులు, ఒక రెస్టారెంట్‌, మూడు కాన్ఫరెన్స్‌ హాళ్లు, ఒక ఫంక్షన్‌ హాల్‌ ఉన్నాయి. నెలకు రూ.12లక్షల అద్దెకోసం ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాల విస్తరణ నేపథ్యంలో ఖాళీ స్థలాలు, భవనాల కోసం యంత్రాంగం జల్లెడ పడుతోంది. తిరుపతి కొత్త జిల్లాగా ఏర్పడితే టూరిజం అధీనంలో ఉన్న ఇలాంటి భవనానికి తుదిమెరుగులు దిద్దితే ఎలాంటి ప్రజావసరానికైనా ఉపయోగపడుతుంది. తిరుచానూరు సమీపంలో టీటీడీ నిర్మించిన పద్మావతి నిలయాన్ని ఏపీటీడీసీ ఏడాదికి రూ.కోటి అద్దెతో తీసుకుంది. అదే టూరిజం విభాగం తనకున్న భవనాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అద్దెకు ఇవ్వడం గమనార్హం. కాగా, ఫర్నిచర్‌ వ్యాపారం చేసే చంద్రహాస్‌ సంస్థ అలిపిరిలోని టూరిజం భవనాన్ని ఈ-టెండర్లో దక్కించుకుని  వల్లభ ఫర్చ్యూన్‌ గ్రూపునకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-12-05T06:35:40+05:30 IST