నేడు ఏకాంతంగా పంచమితీర్థం

ABN , First Publish Date - 2020-11-19T06:32:10+05:30 IST

కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమితీర్థం (చక్రస్నానం) గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కుంభ లగ్నంలో జరగనుంది.

నేడు ఏకాంతంగా పంచమితీర్థం
వాహన మండపంలో నిర్మించిన చిన్న తొట్టె

తిరుచానూరు/ఆంధ్రజ్యోతి, తిరుపతి: కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమితీర్థం (చక్రస్నానం) గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కుంభ లగ్నంలో జరగనుంది. కొవిడ్‌ నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా, వాహన మండపంలో నిర్మించిన చిన్న తొట్టెలో ఈ ఘట్టం నిర్వహించనున్నారు. ఇందులో చక్రత్తాళ్వార్‌తో పాటు అర్చకులు మాత్రమే మునక వేయనున్నారు. తమిళనాడు నుంచి భక్తులు సమాచార లోపంతో వస్తారని మాడవీధి గేట్లకు తాళాలు వేశారు. నవజీవన్‌ ఆసుపత్రి నుంచి ఘంటసాల విగ్రహం వరకు రోడ్డు మధ్యలో ఇనుప మెష్‌తో బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులను అమ్మవారి దర్శనానికి ప్రైవేటు బస్టాండ్‌ నుంచి ఆలయంలోకి అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. చక్రస్నానం సందర్భంగా అమ్మవారు బంగారు చీరతో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 9.30 గంటలకు జరిగే ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి. 


 అమ్మవారికి శ్రీవారి సారె


తిరుచానూరు/ఆంధ్రజ్యోతి, తిరుపతి: పంచమితీర్థం సందర్భంగా గురువారం తిరుమల నుంచి శ్రీవారి తరపున ముత్తయిదువ సారెను అమ్మవారికి అందించనున్నారు. కొత్త చీర, పసుపు, కుంకుమ, బంగారు తిరు ఆభరణాలు, అన్నప్రసాదాలు తదితర సారెతో టీటీడీ ఉన్నతాధికారులు, ఏకాంగులు, అర్చకులు, పరిచారకులు కాలిమార్గాన అలిపిరి చేరుకుంటారు. అమ్మవారి ప్రతినిధిగా తిరుపతి జేఈవో బసంత్‌కుమార్‌ ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఏనుగు అంబారిపై ఊరేగింపుగా ఆలయానికి సారె తీసుకొస్తారు. కొవిడ్‌ నిబంధనలు, గరుడ వారధి పనుల నేపథ్యంలో ఈ ఏడాది అలిపిరి నుంచి టౌన్‌ క్లబ్‌, వెస్ట్‌ చర్చి, ఎంఆర్‌పల్లె కూడలి, అన్నమయ్య కూడలి, లక్ష్మీపురం, పద్మావతీపురం మీదుగా తిరుచానూరుకు రానుంది. ఇప్పటికే ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు. ఇలా మార్గం మళ్లించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా కోమలమ్మసత్రం, రాముల వారి ఆలయం వద్ద, గోవిందరాజస్వామి మాడవీధుల గుండా  సారె ఊరేగింపు వెళ్తుంది. సంప్రదాయం ప్రకారం ఇక్కడ హారతులు ఇస్తారు. అలాంటిది మార్గం మళ్లించడం సరికాదని స్థానికులు అంటున్నారు. 

Updated Date - 2020-11-19T06:32:10+05:30 IST