తిరుపతి, రేణిగుంట రైల్వేస్టేషన్లకు ఐఎస్‌వో గుర్తింపు
ABN , First Publish Date - 2020-09-14T09:53:47+05:30 IST
తిరుపతి, రేణిగుంట రైల్వేస్టేషన్లకు ఐఎస్‌వో (14001/2015) గుర్తింపు లభించిందని డైరెక్టర్ నాగరమణశర్మ వెల్లడించారు.
తిరుపతి (ఆటోనగర్), సెప్టెంబరు 13: తిరుపతి, రేణిగుంట రైల్వేస్టేషన్లకు ఐఎస్‌వో (14001/2015) గుర్తింపు లభించిందని డైరెక్టర్ నాగరమణశర్మ వెల్లడించారు. ఆదివారం తిరుపతి రైల్వేస్టేషన్ వీఐపీ లాంజ్‌లో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎన్‌జీటీ నిబంధనల మేరకు స్టేషన్ పరిధిలో మొక్కలు నాటి పర్యావరణం పరిరక్షించడం, వృథా నీటిని రీట్రీట్‌మెంట్ చేసి.. తిరిగి వినియోగించడం, రైల్వేస్టేషన్ భవనాలపై సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేసి పొదుపు పాటించడంతోపాటు పరిశుభ్రతకు అవలంబించిన ప్రమాణాలకు ఈ గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఈ రెండు స్టేషన్లతోపాటు దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్‌లో గుంతకల్లు, రాయచూర్ రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయన్నారు. దీనివెనుక అన్ని విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమష్టి కృషి ఉందని అభినందించారు. సీనియర్ డీఈఈఎన్ పుష్పరాజ్, సీసీఐ పరమేశ్వరరాజు, ఎస్‌ఎంఆర్ చిన్నప్పరెడ్డి, ఎస్‌ఎస్‌ఈ రామ్మోహన్‌రావు, ఐపీఎఫ్ సైదయ్య, అధికారులు హేమరాజ్‌మీనా, ఎంఎస్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.