తిరుపతిలో ధర్మమే గెలుస్తుంది

ABN , First Publish Date - 2020-03-16T17:49:59+05:30 IST

ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను..

తిరుపతిలో ధర్మమే గెలుస్తుంది

ఎన్నికల వాయిదా శుభపరిణామం

మాజీ ఎమ్మెల్యే సుగుణ


తిరుపతి(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం శుభపరిణామమని మాజీ ఎమ్మెల్యే సుగుణ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో ధర్మమే గెలుస్తుందన్నారు. తన నివాసంలో ఆదివారం ఆమె టీడీపీ నాయకులతో కలసి మీడియాతో మాట్లాడారు. వారం రోజులుగా ఎన్నికల ప్రకియ ఎంత దుర్మార్గంగా జరిగిందో అందరూ చూశారన్నారు. వీటిపై తాము ఎన్నికల పరిశీలకులకు సకాలంలో ఫిర్యాదు చేయడంతో వారు ఎన్నికల సంఘానికి నివేదించారన్నా రు. నిష్పక్షపాతంగా ప్రజల కోసం అధికారులు తమ అధికారాన్ని వినియోగించాలని కోరారు. అలా వ్యవహరించని అధికారులకు బదిలీ వేటు పడిందన్నారు.


తిరుపతిలో నామినేషన్ల సందర్భంగా అధికార పార్టీ చేసిన ఆగడాలను ప్రజలు అందరూ గమనించారన్నారు. తమ అభ్యర్థులను పోలీస్‌స్టేషన్లకు పిలిపించి నామినేషన్లను ఉప సంహరించుకోవాలని బెదిరించారన్నారు. పోలీసుల ద్వారా 6వ డివిజన్లోని తమ మహిళా అభ్యర్థిని భయపెడితే తాను వెళ్లి నామినేషన్‌ వేయించాల్సి వచ్చిందన్నారు. ఆరేళ్ల బాలుడిని పోలీస్‌ స్టేషన్‌కు పట్టుకెళ్లి బెదిరించారన్నారు. పూతలపట్టు బైపాస్‌రోడ్డులో తమ అభ్యర్థిని వదిలిపెట్టి వచ్చేస్తారా? అని ఆమె ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పప్పు అనే రౌడీ ఊరులో లేకుండా పోయాడని, ఇప్పుడు తిరుపతికి వచ్చి రౌడీయిజం చేస్తున్నాడన్నారు.


ఎన్నికల సంఘం న్యాయం చేస్తుందన్న ఉద్దేశంతోనే ఇక్కడి పరిణామాలను సచిత్రంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేమన్నారు. వార్డు సచివాలయాల్లో ఎన్నికలను నిర్వహించడమే తప్పుడు ప్రక్రియగా సుగుణ పేర్కొన్నారు. పాలన వికేంద్రీకరణ చేసినట్టు పోలింగ్‌ కేంద్రాలను కూడా సచివాలయాల్లో తమ రౌడీలను పెట్టి ఎన్నికల తంతును ముగించాలని చూశారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఆగాయంటే శ్రీవారి తిరుపతికి ఉన్నాయనే చెప్పవచ్చన్నారు. వైసీపీ అరాచకాలతో ఏకగ్రీవమైన వార్డులను రద్దు చేసి మొత్తం ఎన్నికల ప్రక్రియను రీషెడ్యూల్‌ చేసినప్పుడే అసలైన ప్రజాస్వామ్యం కనిపిస్తుందన్నారు. ఈ సమావేశంలో నాయకులు దంపూరి భాస్కర్‌ యాదవ్‌, బుల్లెట్‌ రమణ, సూరా సుధాకర్‌రెడ్డి, మునిశేఖర్‌ రాయల్‌, బ్యాంకు శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-16T17:49:59+05:30 IST